కలెక్టర్, ఎస్పీని ఆదేశించిన మంత్రి తుమ్మల
కొత్తగూడెం/ ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసి వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, ఉపముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఖమ్మం జిల్లాలో మొదటిసారిగా పర్యటించారు. ఈ సందర్భంగా ఖమ్మం పాత బస్టాండ్ ఏర్పాటుచేసిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా మహిళలకు ఆర్టీసీ ఫ్రీ సర్వీస్ ను జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో తుమ్మల మాట్లాడుతూ భద్రాద్రి శ్రీ రామచంద్రుడి ఆశీస్సులతో మంత్రిగా మీకు సేవ చేసే భాగ్యం దక్కిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలను నిరవేర్చి తీరుతాము అన్నారు. గతంలో ప్రజలపై తప్పుడు కేసులు పెట్టిన పోలీస్ అధికారులు తీరు మార్చుకోవాలని హితవు పలికారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ ఎక్కడ ఉన్నా తెలంగాణ లో పనిచేయాల్సి ఉంటుందని గుర్తు పెట్టుకోవాలి సూచించారు. గతంలో పనికి మాలిన నాయకుడి ఒత్తిళ్ల మేరకు అధికారులు తప్పులు చేశారని, ఇకనైనా తీరు మార్చుకొని ప్రజా సేవ చేయాలని ఆదేశించారు. భూ కబ్జాల పై జిల్లా కలెక్టర్, ఎస్పీ దృష్టి సారించాలని అన్నారు. ఎన్నికల ఫలితాలలో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అఖండ విజయాన్ని సాధించి చరిత్రలో నిలిచిపోయేలా ఖమ్మం జిల్లా ప్రజలు తీర్పు ఇచ్చి నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.