తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించుకునే విషయంలో గత ఎనిమిదేళ్ళుగా రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ప్రధానంగా ఈ విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస మధ్య విమర్శలు ప్రతి విమర్శలు నిత్యం చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తెరాస అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నయా నిజామ్ గా వ్యవహరిస్తున్నాడని, ఎంఐఎం పార్టీకి భయపడి ఆయన విమోచన దినాన్ని జరుపటంలేదంటూ బిజెపి తీవ్రంగా విమర్శిస్తూ వొస్తున్నది. వాస్తవంగా తెలంగాణ ఉద్యమం ప్రారంభంలో ఆనాడు ఉద్యమ పార్టీగా ఉన్న తెరాస కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంపైన దాదాపు ఇలాంటి విమర్శలే చేసింది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరుపడంలేదని తెరాస నాటి సమైక్య పాలకులను తీవ్రంగా విమర్శించిన విషయం తెలియంది కాదు. అదే తెరాస తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, అధికారంలోకి వొచ్చిన తర్వాత ‘తెలంగాణ ఆవిర్భావ దినోత్స’వానికి ఇచ్చిన ప్రాధాన్యత విమోచన దినోత్సవానికి ఇవ్వకపోవడం పలు విమర్శలకు కారణంగా మారింది. నిజామ్ నుండి విముక్తి లభించినప్పటికీ అధికారంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా ఇక్కడ అధికారికంగా ఈ ఉత్సవాన్ని చేపట్టింది లేదు. కాని, వివిధ రాజకీయ పార్టీలు మాత్రం తమ పార్టీ కార్యాలయాలకే ఈ ఉత్సవాలను పరిమితం చేస్తూ వొచ్చాయి.
తెలంగాణ పేరున ఉద్భవించిన తెరాస కూడా అధికారికంగా ఏనాడు ఈ ఉత్సవాలను చేపట్టకపోవడంతో ప్రధానంగా బిజెపి రెచ్చగొడుతూ వొచ్చింది. ముస్లిం మైనార్టీలకు భయపడి కెసిఆర్ చారిత్రాత్మక అంశాన్ని మరుగున పడవేస్తున్నాడని ధ్వజమెత్తుతూ వొచ్చింది. చివరకు ఆ పార్టీ రాష్ట్ర శాఖ పార్టీ పరంగా ఇక్కడ కార్యక్రమాలను చేపట్టడం వరకు పరిమితమయింది. అయినా టిఆర్ఎస్ ఈ విషయంలో ఎప్పుడూ పెద్దగా స్పందించకుండా మౌనం వహిస్తూ వొచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ రెండు పార్టీలు కూడా ఈ విషయంలో ఒక అడుగు ముందుకు వేశాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంపై కాషాయ జండాను ఎగురవేసే విషయంలో అనేక రాజకీయ ఎత్తుగడలు వేస్తూ వొస్తున్నది. తెరాసతో పడని వారిని, ఆ పార్టీనుండి బహిష్కృతులైన వారిని దరిచేర్చుకుంటూ రానున్న ఎన్నికల నాటికి బలమైన శక్తిగా ఆవిర్భవించేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నది. ఈ క్రమంలో అధికార తెరాసకు ప్రతికూలంగా ఉన్న ప్రతీ అంశాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తూ వొస్తున్నది. తెలంగాణ విమోచన దినోత్సవ నిర్వహణ అందులో ఒకటి. ఈ ఉత్సవాన్ని నిర్వహించాలన్న వివాదాన్ని ప్రతీ సంవత్సరం ముందుకు తీసుకువస్తున్న బిజెపి ఇప్పుడు ఏకంగా అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించి విస్మయాన్ని కలిగించింది. రాష్ట్రంలో అధికారంలో రాగానే ఈ ఉత్సవాలను అధికారికంగా చేపడుతామని ఇంతకాలం చెబుతూ వొస్తున్న బిజెపి అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక రాజకీయపు ఎత్తుగడ లేకపోలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఈ ఎనిమిదేళ్ళ కాలంలో ఏనాడు తీసుకోని నిర్ణయాన్ని ఇప్పుడే ఎందుకు తీసుకున్నదన్న విషయాన్ని వేరే చెప్పాల్సిన అవసరం లేదు.
రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకోవడం ఒకటి కాగా, దానికి ముందు జరుగనున్న మునుగోడు ఉప ఎన్నిక ఇప్పుడు ఆ పార్టీకి ప్రతిష్టగా మారింది. కాంగ్రెస్ సిట్టింగ్ సీటును ఖాలీ చేయించి, అక్కడి తాజా మాజీ ఎంఎల్ఏను తమ పార్టీలో కలుపుకోవడమే గాక, తిరిగి అతనికే పార్టీ టికెట్ ఇచ్చి అక్కడి నుండి పోటీపెట్టడం, ఇప్పుడు ఆ స్థానాన్ని గెలుచుకోవడం అన్నది ఆ పార్టీకి సవాల్‌గా మారింది. ఉప ఎన్నిక, సార్వత్రిక ఎన్నికల దృష్ట్యానే బిజెపి ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతున్నది. అయితే ఇదేదో ఒక రోజు ఉత్సవానికే పరిమితం కాకుండా ఏడాది పొడవునా దీన్ని నిర్వహించాలన్న నిర్ణయం తీసుకోవడం మరింత ఆసక్తిని కలిగిస్తున్న అంశం. అంటే ఏడాదిలో రానున్న ఎన్నికల వరకు బిజెపి విమోచనాంశాన్ని పట్టుకుని ప్రజల మధ్య తిరిగే అవకాశాన్ని ఎంచుకున్నట్లు స్పష్టమవుతున్నది. నిజామ్ నిరంకుశ పాలన నుండి తెలంగాణ ప్రాంతానికి విముక్తి కలిగించిన సందర్భాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17న సికిందరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ‘తెలంగాణ విమోచన దినాన్ని’ అధికారికంగా నిర్వహిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆనాడు కేంద్ర హోమ్ శాఖ మంత్రి సర్దార్ వల్లభభాయి పటేల్ తీసుకున్న సైనిక చర్యను పురస్కరించుకుని, నేటి కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్‌షా ఈ కార్యక్రమానికి విచ్చేస్తుండడం గమనార్హం. అలాగే ఆనాడు నిజామ్ ఏలుబడిలో ఉన్న హైదరాబాద్ స్టేట్ పరిధిలోని కొన్ని గ్రామాలు నేడు కర్ణాటక, మహారాష్ట్రాల్లో ఉండడం వల్ల, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడంతోపాటు కేంద్ర బలగాలతో పరేడ్ నిర్వహించాలని నిర్ణయం కేంద్రం నిర్ణయం తీసుకుంది. అంతేగాక ఆ రోజు కేంద్ర కార్యాలయాలమీద జాతీయ పతాకాన్ని ఎగురవేయాలన్న సూచన కూడా చేసింది.
ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే తరహా నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఇంతవరకు అధికారికంగా ఏనాడూ నిర్వహించని విమోచన దినాన్ని ఏకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా జరుపాలనుకోవడం ఒక వింత పరిణామమే. భారత దేశానికి స్వాతంత్య్రం లభించి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇటీవల ఎలాగైతే వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నారో, హైదరాబాద్ సంస్థానం కూడా స్వతంత్ర భారతదేశంలో విలీనానికి 74 ఏళ్ళుపూర్తి చేసుకుని 75వ సంవత్సరంలోకి అడుగిడుతున్న ఈ వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని ‘విలీన’ వేడుకలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయానికి రావడంకూడా ఒక శుభపరిణామమే. దీన్ని కేవలం తెలంగాణ విమోచన ఉద్యమంగానే కాకుండా తెలంగాణ రైతాంగ పోరాట కార్యక్రమంగా నిర్వహించాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నట్లు తెలుస్తున్నది. ఏదియేమైనా ఇంతకాలానికైనా నిజామ్ ముష్కరులతో పోరాడి, ఈ ప్రాంతానికి స్వేచ్ఛను కలిగించినవారిని ఈ సందర్భంగానైనా తలుచుకునే అవకాశం ఏర్పడడం సంతోషించదగిన విషయం. కేవలం ఉత్సవాలకే పరిమితం కాకుండా వారి జీవితాలను, వారి ఆదర్శాలను ముందు తరాలవారికి తెలియజేయాల్సిన అవసరం ఎంత్తైనా ఉంది.ఇదిలా ఉండగా నిజామ్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ప్రత్యక్ష పాత్ర పోషించి అగ్ర భాగం లో నిలబడ్డ కమ్యూనిస్ట్ పార్టీలు ఉత్సవాల పై నోరు తెరవక పోవడం గమనార్హం ..!