మాటల దాడి తీవ్రం చేసిన రేవంత్‌రెడ్డి

స్పీడ్‌ ‌పెంచనున్న జగ్గా రెడ్డి
కసితో రగిలిపోతున్న రేవంత్‌, ‌జగ్గారెడ్డి
హరీష్‌ ‌రావుపై రివేంజ్‌ ‌తీసుకుంటారా?

సిఎం రేవంత్‌రెడ్డి గత కొన్ని రోజులుగా బిఆర్‌ఎస్‌ ‌నేతలపై ముఖ్యంగా మా జీమంత్రులు కేటీఆర్‌, ‌హరీష్‌ ‌రావుపై మాటల దాడి తీవ్రం చేశారు. రైతు రుణ మాఫీ విషయంలో తన రాజకీయ ప్రత్యర్థులైన కేటీఆర్‌, ‌హరీష్‌రావు లక్ష్యంగా విమర్శలకు మరింత పదును పెట్టారు. ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్‌ ‌రావును సిఎం రేవంత్‌రెడ్డి టార్గెట్‌ ‌చేసినట్లు ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు చెప్పకనే చెబుతున్నాయి. సిఎం రేవంత్‌రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలతో టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు జగ్గారెడ్డి కూడా తన స్పీడ్‌ను పెంచే అవకాశాలు లేకపోలేదని కాంగ్రెస్‌ ‌నేత ఒకరు గురువారమిక్కడ ‘ప్రజాతంత్ర’తో మాట్లాడుతూ అన్నారు. బిఆర్‌ఎస్‌ ‌పార్టీలో మాజీ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అంటే జగ్గారెడ్డి ఒంటికాలు మీద లేస్తాడు. దీనికి కారణం లేకపోలేదు. గతంలో సిద్ధిపేటకు జరిగిన ఉప ఎన్నికల్లోనూ జగ్గారెడ్డి ఇంఛార్జిగా సిద్ధిపేటకు వొచ్చిన సందర్భంలోనూ అనేక అల్లర్లు జరిగాయి. జగ్గారెడ్డిపై రాళ్ల దాడి జరిగింది. ఆయనపై కేసులు కూడా  నమోదయ్యాయి. జైలుకు కూడా వెళ్లాడు. దీంతో పాటు నకిలీ పాస్‌పోర్టు, వీసా కేసులో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని సెప్టెంబర్‌ 2018అసెంబ్లీ ఎన్నికల ముందు నార్త్ ‌జోన్‌ ‌పోలీసులు అరెస్ట్ ‌చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు.

 

తనను అక్రమంగా అరెస్టు చేశారనీ, తన అరెస్టు వెనకాల మాజీ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు ఉన్నాడనేది జగ్గారెడ్డిది బలమైన అభిప్రాయం. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా ఓడించడానికి హరీష్‌ ‌రావు 60 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశాడనీ, హరీష్‌ ‌రావు డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేయడం వల్లే తాను ఓడిపోయానేది కూడా జగ్గారెడ్డి బహిరంగ వేదికలపైనే చెప్పారు. అంతే కాకుండా, రాజకీయంగా తనను అణగదొక్కేందుకు హరీష్‌ ‌రావు అధికారాన్ని అడ్డుపెట్టుకుని కుట్రలకు కుతంత్రాలకు పాల్పడ్డాడని, టైమ్‌ ‌వొచ్చినప్పుడు తన సత్తా ఏమిటో చూపిస్తానంటు పలు సందర్భాల్లో జగ్గారెడ్డి మాట్లాడాడు కూడా.

కోపంతో, కసితో రగిలిపోతున్న జగ్గారెడ్డికి ఇప్పడు టైమ్‌ ‌వొచ్చినట్లు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం  రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి ఉంది. బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రస్తుతం ఉన్న సిఎం రేవంత్‌ ‌రెడ్డిని కూడా జైలుకు పంపడంతో జగ్గారెడ్డి, రేవంత్‌రెడ్డి ఇద్దరు నేతలు బిఆర్‌ఎస్‌ ‌పార్టీపైన ముఖ్యంగా కేటీఆర్‌, ‌హరీష్‌ ‌రావుపైన తీవ్రమైన కోపం, కసితో ఉన్నట్లు తెలుస్తుంది. రేవంత్‌ ‌రెడ్డి, జగ్గా రెడ్డి ఇద్దరూ బిఆర్‌ఎస్‌ ‌బాధితులే. ఇద్దరూ వేర్వేరు సందర్భాలలో జైలుకు వెళ్లినవారే. అయితే, బిఆర్‌ఎస్‌పై ముఖ్యంగా కేటీఆర్‌, ‌హరీష్‌ ‌రావుపై కసితో ఉన్న సిఎం రేవంత్‌ ‌రెడ్డి, టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు జగ్గారెడ్డికి ఇద్దరికీ రివేంజ్‌ ‌తీసుకునే టైమ్‌ ‌వొచ్చినట్లు వారి మాటల ద్వారా కనబడుతుంది. అయితే,  సిద్ధిపేటలో హరీష్‌ ‌రావుకు గట్టి పట్టు ఉంది.

 

ఎమ్మెల్యేగా వరుసగా డబుల్‌ ‌హ్యాట్రిక్‌ ‌కొట్టాడు. ఓటమెరగని నేతగా  ప్రజల్లోనూ హరీష్‌రావుకు మంచి పేరు, బలం ఉంది. పార్టీలో ట్రబుల్‌ ‌షూటర్‌గా పేరుంది. కేసీఆర్‌ ‌తర్వాత హరీష్‌ ‌రావే నెంబర్‌-2‌గా అందరూ భావిస్తారు. మంచి వ్యూహకర్త. మాటకారి కూడా. తన వాక్చాతుర్యంతో  కాంగ్రెస్‌ ‌పార్టీని, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్న హరీష్‌ ‌రావును ఎలాగైనా కట్టడి చేయాలనే కచ్చితమైన ఆలోచనకు, నిర్ణయానికి సిఎం రేవంత్‌రెడ్డి వొచ్చినట్లు తెలుస్తుంది.  దీంతో హరీష్‌రావు ప్రాతినధ్యం వహిస్తున్న సిద్ధిపేటలోనే తరుచూ ఏదో ఒక ఆందోళనతో టెన్షన్‌ ‌పెడుతూ, తద్వారా సిద్ధిపేటకే ఆయనను పరిమితం చేసి రాష్ట్ర రాజకీయాల జోలికి రాకుండా కట్టడి చేయొచ్చనేది కాంగ్రెస్‌ ‌పార్టీ, ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తుంది. దీని కోసం సిఎం రేవంత్‌రెడ్డి తాజాగా..తన బాణంగా హరీష్‌ ‌రావు అంటే గిట్టని, దూకుడు స్వభావం కలిగిన దేనికైనా రె‘ఢీ’అనే సవాల్‌ ‌చేసే జగ్గారెడ్డిని హరీష్‌ ‌రావుపైకి  వదులుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

మాస్‌ ‌లీడర్‌గా పేరున్న జగ్గారెడ్డికి సిద్ధిపేట నియోజకవర్గంలో తనకంటూ  అభిమానులు, అనుచరులు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నారని సమాచారం. జగ్గన్నను సిద్ధిపేటకు పంపిస్తానని స్వయంగా సిఎం రేవంత్‌రెడ్డే చెప్పడంతో రివేంజ్‌ ‌తీసుకోవడానికి కసితో ఉన్న, టైమ్‌ ‌కోసం ఎదురుచూస్తున్న జగ్గారెడ్డి స్పీడ్‌ను పెంచడమే కాకండా, సిద్ధిపేటకు రావడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. జగ్గారెడ్డి సిద్ధిపేటకు వొస్తే మాత్రం బిఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌మధ్య మరిన్ని కొట్లాటలు కావడం, అల్లర్లు జరగడం తథ్యమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఏది ఏమైనా కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌ ‌నేతల మధ్య సిద్ధిపేటలో మొదలైన ఫ్లెక్సీల వివాదం చినికిచినికి గాలి వానలా మారేలానే ఉందని…సిఎం రేవంత్‌రెడ్డి, టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు జగ్గారెడ్డి మాటలు చెప్పకనే చెబుతున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page