మాట్లాడటానికేం ఉందని
మాట్లాడుతూ ఉండటానికి
ఎవరి ఉదయాలు,
ఎవరి రాత్రుళ్లు వాళ్ళవయ్యాక
ఎవరి ప్రపంచంలో వారు
గిరికీలు కొట్టడం అలవాటు పడ్డాక
ఎండిన నదీ పాయలో
దోసెడు నీళ్ళు కనబడతాయా?
బీటలు వారిన నల్లరేగడి నేలలో
విత్తు విచ్చుకుంటుందా?
చిత్రకారుడు గీసిన
రేఖా చిత్రాల్లా మనుషుల రూపాలు
లోపల అంతా హ్యాలో
భారరహిత స్థితిలా
భావరహిత స్థితిలో జీవితాలు
మాట్లాడటానికేం ఉందని
మాట్లాడుతూ ఉండటానికి…
– రెహాన