ఓయ్!
అప్పుడు చెబితే వినలేదుగా
ఇప్పుడైనా ఒప్పుకుంటావా
నా జోస్యం నిజమని.
నీ రక్తాన్ని
బొట్టు బొట్టుగా పిండుకుంటూ,
తన భవిష్యత్ వెలిగించే
దీపాల్లో పోసుకుంటూ,
తనను తాను బతికించుకోజూస్తోన్న
రాకాసి కోరలలో ఇరుక్కున్నావని
అర్ధమయ్యాక
కాదని ఎలా అంటావులే?
ఎంతమొత్తుకున్నా వినకుండా,
తుళ్ళి తుళ్ళి పడుతూ,
చిన్నపిల్లాడిలా ఎగురుకుంటూ వెళ్లి
మరీ ఎన్నుకున్నావుగా!
అదిగో ‘నవలోక’మంటూ వెళ్లి
‘కలల ఐరావతం’ మీద నుంచి,
నీ ‘ఊహల రంభ’ ఒడిలోంచి,
ఆకాశం నుంచి జారి,
పుడకలేరి గూడు ఏర్పరుచుకున్న
పిట్టమాదిరి
ఒక్కొక్క కర్రతో నీవే పేర్చుకున్న
చితిలో పడి,
ఇప్పుడు దుఃఖజ్వాలల్లో
ఒళ్ళు కాలిపోతోందంటూ అరిస్తే
ఏం ప్రయోజనం?
‘చేసుకున్నవాడికి చేసుకున్నంత’ని
తెలుసుగా!
అనుభవించు మరి.
ముందు వచ్చే ముప్పు గ్రహించు,
గత కాలపు తప్పు చేయకు.
– వేమూరి శ్రీనివాస్, 9912128967,
తాడేపల్లిగూడెం