మరికొన్ని గంటల్లోనే మునిగోడు ఎవరిదన్న విషయం తేలనుంది. ఈ నెల మూడవ తేదీన ఇక్కడ ఉప ఎన్నిక జరిగినప్పటికీ వోట్ల లెక్కింపును మాత్రం ఆరవ తేదీగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ నియోజకవర్గంలో 47మంది పోటీలో ఉన్నప్పటికీ మొదటి నుండి అనుకున్నట్లుగానే ప్రధానంగా మూడు పార్టీ మధ్యే పోరు తీవ్రతరంగా సాగింది. ఈ మూడు పార్టీలు కూడా ఈ ఎన్నికను ప్రతిష్టగా తీసుకోవడంతో వోటింగ్ పర్సంటేజ్ కూడా బాగానే పెరిగింది. ఇక్కడ మొత్తం 93.13 శాతానికి పైగానే పోలైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మరి కొన్ని గంటల్లో విజేతలెవరన్నది తేలనున్న క్రమంలో రాష్ట్ర మంతా ఉత్కంఠభరితంగా ఎదిరిచూస్తుంది.
రాజకీయ పార్టీలు మాత్రం విజయం తమదంటే తమదని చెబుతున్నప్పటికీ ఇక్కడ నిర్వహించిన వివిధ సంస్థల సర్వేలు మాత్రం మరో విధంగా చెబుతున్నాయి. ఇప్పటి వరకు అయిదారు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటించాయి. వీటిల్లో ఆత్మసాక్షి, పీపుల్స్ పల్స్, త్రిశూల్, థర్డ్ విజన్, ఎస్‌ఏఎస్ గ్రూప్, నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ ఎగ్జిట్‌పోల్ లాంటి సంస్థలున్నాయి.
ఈ సంస్థలన్నీ కొద్దిగా ఇంచుమించు తేడాతో ఒకే అభిప్రాయంగా ఉన్నట్లు స్పష్టమవుతున్నది. ప్రధానంగా పై నాలుగు సంస్థల సర్వే ఫలితాలను విశ్లేషిస్తే టిఆర్‌ఎస్‌కే పట్టం కడుతున్నాయి. 41 నుండి 48 శాతం వరకు ఆ పార్టీకి వోట్లు రావచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఆ తర్వాత రెండవ స్థానంలో బిజెపి ఉంటుందన్నట్లు వాటి సర్వే రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. బిజెపికి సుమారు 31 నుండి 37 శాతం వరకు వోట్లు రావచ్చని చెబుతున్నాయి. ఇక మిగిలింది కాంగ్రెస్. కాంగ్రెస్‌కు మూడవ స్థానాన్నే అన్ని సర్వేలు చెబుతున్నాయి. ఈ పార్టీకి 12 నుంచి 18 శాతం వోట్లు మాత్రమే రావచ్చని ఆ సర్వే సంస్థలు అంచనావేశాయి.
ఇక పోతే ఈ మూడు పార్టీలకు అంతో ఇంతో పోటీ పడిన బిఎస్పీకి గాని, స్వతంత్రులకు గాని 4 నుంచి 5 శాతం వోట్లు రావచ్చన్నట్లుగా ఆ సర్వే లెక్కలు చెబుతున్నాయి. మొత్తం మీద టిఆర్‌ఎస్, బిజెపి, కాంగ్రెస్‌ల్లో కాంగ్రెస్ మాత్రం మూడవ స్థానంలోనే ఉంటుందన్నది వీటి ద్వారా స్పష్టమవుతున్నది. ఆ పార్టీ ముఖ్యనేత రాహుల్‌గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్న సందర్భంలోనే ఫలితాలు వెలువడడం ఆ పార్టీకి కొంత ఇబ్బందికరంగానే మారింది. ఒక వేళ ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నదే నిజమైతే, స్థానిక నాయకులు రాహుల్ ముందుకు వెళ్ళేందుకే జంకాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. ఇక మిగిలిన బిజెపి, టిఆర్‌ఎస్‌ల్లో సర్వేలన్నీ టిఆర్‌ఎస్‌కు అనుకూలంగా చెబుతున్నప్పటికీ మునుగోడు ప్రజలు ఎవరిని అందలం ఎక్కించనున్నారన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. ఈ ఫలితాలకోసం కేవలం మునుగోడు నియోజకవర్గ ప్రజలేకాదు, దేశ ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఎందుకంటే మునుగోడులో జరిగింది కేవలం ఉప ఎన్నికే అయినా, ఇది సాధారణ ఎన్నికలకన్నా ఎక్కువ అలజడిని సృష్టించింది. ఇక్కడ అభ్యర్థుల గెలపు ఓటముల గురించి కాకుండా పార్టీల ప్రతిష్టత ప్రధానాంశంగా మారింది. ఈ ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో మార్పుకు కారణమవుతుందన్న అభిప్రాయాలున్నాయి. అంతేగాక భవిష్యత్‌లో రాష్ట్రంలో అధికారం చేపట్టబోయేదెవరన్న విషయం కూడా ఇక్కడి ఫలితంపైనే ఆధారపడి ఉందన్నది గత కొంతకాలంగా ప్రజల మధ్య నలుగుతున్న అంశం. కాగా పై మూడు ప్రధాన పార్టీలను కాదని ప్రజలు తననే గెలిపిస్తారంటున్నాడు ప్రజాశాంతి పార్టీ అధినేత, స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచిన కెఏ పాల్. మునుగోడు ప్రజలు తననే గెలిపిస్తారన్న ధీమాను ఆయన వ్యక్తం చేస్తున్నాడు. కనీసం 50 వేల మోజార్టీ తనకు వొచ్చి తీరుతుందని ఆయన చెబుతున్నారు. నియోజకవర్గంలో తాను ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తనను ఆప్యాయంగా ఆహ్వానించారని, కనీసం డెబ్బై నుండి ఎనబై శాతం వోట్లు తనకు వొచ్చి ఉంటాయని చెబుతున్న పాల్, ఇక్కడ ఒక్క పైసాకైడా వ్యయం చేయకుండా ఎన్నికల్లో నిబడిన వ్యక్తిని తానేనంటారాయన.
ఎన్నికలు జరిపిన రెండు రోజులకు వోట్ల లెక్కించడమన్నది సరైందికాదంటూ ఈవిఎంల భద్రతపైన అయన అనుమానం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే గెలుపు ఓటములపై అప్పుడే బెట్టింగ్‌లు మొదలైనాయి. టిఆర్‌ఎస్, బిజెపిలపైనే ప్రధానంగా ఈ బెట్టింగ్‌లు కొనసాగుతున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ వారి ఉత్సాహంపై నీళ్ళు చల్లుతున్నాయి. గతంలో జరిగిన వివిధ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విఫలమైన నేపథ్యంలో అంచనాలన్నీ తారుమారు అవుతాయన్న నమ్మకంతోనే వారు బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. మొత్తానికి గంటల వ్యవధిలో ప్రకటించబోయే మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు పెద్ద సెన్షేషన్ కాబోతున్నాయనడంలో అతిశయోక్తి లేదు.