- సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ నుంచి త్వరితగతిన తుది నివేదిక
- సమ్మక్క-సారలమ్మ నిర్మాణానికి పక్రియ వేగవంతం
•విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించం
•వెంటనే 1800 మంది లష్కర్‌ల నియామకం
•జలసోధలో ప్రాజెక్టులపై సమీక్షలో అధికారులకు మంత్రి ఉత్తమ్‌కుమార్ ఆదేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం ప్రాజెక్ట్‌లపై జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ నుండి తుది నివేదికను త్వరితగతిన తెప్పించాల్సిందిగా రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖా మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖాధికారులను ఆదేశించారు. వానాకాలంలో నిర్వహించాల్సిన పరీక్షలు నిర్వహించి అంతిమ నివేదికను ఎన్‌డిఎస్‌ఏ నిపుణుల కమిటీకి సమర్పించాలని ఆయన చెప్పారు. బుధవారం జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్‌డిఎస్‌ఏకు అందించాల్సిన తుది నివేదికతో పాటు సమ్మక్క-సారక్క ప్రాజెక్ట్‌కు చత్తీస్ ఘడ్ నుండి రావాల్సిన అనుమతులు, ముంపుకు గురయిన సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ నష్టపరిహారం విషయంలో చత్తీస్ ఘడ్ ప్రభుత్వంతో చర్చలు తదితర అంశాలపై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ… తుది నివేదికను త్వరితగతిన ఇవ్వాల్సిందిగా ఎన్‌డిఎస్‌ఏతో సంద్రించాలని సూచించారు.
అదే విధంగా సమ్మక్క-సారక్క ప్రాజెక్ట్‌కు ఛత్తీస్ ఘడ్ నుండి అనుమతుల ప్రక్రియ వేగవంతం చెయ్యాలని మంత్రి అధకారులను ఆదేశించారు. ప్రాజెక్ట్‌పై కేంద్ర జలసంఘం లేవనెత్తిన అంశాలను వేగవంతంగా నివృత్తి చెయ్యాలని, త్వరితగతిన భూసేకరణ పూర్తి చెయ్యాలని, సమ్మక్క సాగర్ ముంపు విషయంలో నష్టపరిహారం విషయమై చత్తీస్ ఘడ్ ప్రభుత్వంతో చర్చలు జరపాలని ఆదేశించారు. లష్కర్‌ల నియామకాలను వేగవంతం చెయ్యాలని అన్నారు. విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, ప్రజాప్రతినిధుల విజ్ఞాపనలకు సత్వరం స్పందించాలని ఉత్తమ్ అధికారులకు సూచించారు. ముఖ్యంగా ఆరు లక్షల కొత్త ఆయకట్టుకు నీరు అందించేందుకు చేపట్టిన ప్రాజెక్ట్‌ల నిర్మాణాలకు అవసరమైన భూసేకరణను 2025 మార్చి మాసాంతానికి పూర్తి చెయ్యాలన్నారు.
ఆనకట్టలు, కాలువల భద్రతకు అవసరమైన 1800 మంది లష్కరుల నియామకాలు వెంటనే పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ విషయమై నీటిపారుదల శాఖా ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ స్పందిస్తూ పక్రియను పూర్తి చేశామని ఆర్థిక శాఖ అనుమతులు పొందాల్సి ఉందని మంత్రికి వివరించగా అక్కడికక్కడే ఆర్థిక శాఖా కార్యదర్శి రామకృష్ణ రావుతో మాట్లాడి వెంటనే మంజూరు చెయ్యాలని ఆదేశించారు.
ఇక ఇటీవల సంభవించిన వర్షపు విపత్తును ప్రస్తావిస్తూ ఆనకట్టలు, కాలువల భద్రతను నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా రాష్ట్ర ప్రభుత్వ నీటి పారుదల శాఖా సలహాదారుడు ఆదిత్యాదాస్, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆర్ అండ్ ఆర్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, ఇయన్‌సి అడ్మిన్ • జనరల్ జి అనిల్ కుమార్, ఓ • యం ఇయన్‌సి నాగేందర్ రావు, ఇఎన్‌సి గజ్వేల్ హారేరాం, సిఇలు రమణా రెడ్డి, అజయ్ కుమార్, విజయ్ భాస్కర్ రెడ్డిలతో పాటు డిప్యూటీ ఇఎన్‌సి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.