మోదీ నోట తెలంగాణ విశిష్టత ..!

భారతీయ జనతాపార్టీ జాతీయ సమావేశాలు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో జరుగుతాయన్న వార్త వొచ్చినప్పటినుండి రాష్ట్ర రాజకీయాలు వేడి పుంజుకున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో పెద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సమావేశాలకు ప్రధాని మోదీ కూడా వొస్తుండడంతో రాజకీయ పార్టీల మధ్య సవాళ్ళు, ప్రతిసవాళ్ళు చోటుచేసుకున్నాయి. ఈ విమర్శల నేపథ్యంలో ఆయా పార్టీల నాయకులు హూందాతనాన్ని కోల్పోయారు. కనీసం మర్యాదలుకూడా పాటించకుండా నోటికి హద్దులులేనట్లుగా మాటల శరాఘాతలను కురిపించారు. ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే హైదారాబాద్‌ ‌రావాలని అటు కాంగ్రెస్‌, ఇటు అధికార టిఆర్‌ఎస్‌లు డిమాండ్‌ ‌చేశాయి. ఆ రెండు పార్టీలుకూడా ప్రధానిని మర్యాద పూర్వకంగా కలువడానికి ఇష్టపడలేదు. ప్రధాని రాష్ట్ర పర్యటనకు వొచ్చినప్పుడు అది అధికార పర్యటన కాకపోయినా మర్యాదపూర్వకంగా కనీసం ఎయిర్‌పోర్టులో ఆహ్వానం పలకడమన్నది ఆనవాయితీ.. కాని, కొంతకాలంగా కేంద్రంతో విభేదిస్తున్న టిఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ అనవాయితీని నిలుపుకోలేదు. అయితే ఇది మొదటిసారికాదు. ఇంతకు ముందుకూడా ప్రధాని రాష్ట్రానికి వొచ్చినప్పుడు రాష్ట్రంలోనే లేకుండా ముఖ్యమంత్రి ప్రోగ్రాం ఫిక్స్ ‌చేసుకున్న విషయం తెలియందికాదు. కాని, ఈసారి రాష్ట్రంలో, అందునా రాజధానిలో ఉండికూడా ఆయన మోదీని ఆహ్వానించేందుకు వెళ్ళలేదు. పైగా కేంద్రంలో అధికార బిజెపి నిలబెట్టిన రాష్ట్రపతి అభ్యర్థికి పోటీగా ప్రతిపక్షాలు నిలబెట్టిన అభ్యర్థిని రాష్ట్రానికి ఆహ్వానించి, ఆయనతోపాటు కార్యక్రమాల్లో పాల్గొనడం ఒక ఎత్తు అయితే, ఈ సందర్భంగా మోదీకి పలు ప్రశ్నలు సంధించి , వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ ‌చేయడం మరో ఎత్తు. విచిత్రమేమంటే రాష్ట్ర కాంగ్రెస్‌కూడా అదే పంథాలో పయనించడం.

ప్రతిపక్షాలు బలపర్చిన రాష్ట్రపతి అభ్యర్థికి కాంగ్రెస్‌ ‌కేంద్ర నాయకత్వం మద్దతు పలికితే, ఆ అభ్యర్థి హైదరాబాద్‌ ‌వొచ్చినప్పుడు అతన్ని కలుసుకోకూడదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పార్టీ వర్గాలకు ఆదేశించడం అందరినీ విస్మయపర్చింది. పార్లమెంట్‌ ‌సాక్షిగా తెలంగాణ ఏర్పాటుపై తల్లిని చంపి పిల్లను బతికించారని ప్రధాని అన్నమాటలకు క్షమాపణ చెప్పాలన్నది ఒకటికాగా, నేరుగా తమను కలుసుకోకుండా, టిఆర్‌ఎస్‌ ‌పార్టీ శ్రేణులను విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ ‌సిన్హా కలుసుకోవడాన్ని వ్యతిరేకించడం మరోకారణమైంది. మొత్తానికి ఈ రెండు పార్టీలు కనీస మర్యాదను పాటించకపోయినా ఆ పార్టీలగురించి ప్రధాని మోదీ ఎక్కడ పరుశ వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం. అంతేకాదు తెలంగాణకు వొస్తున్న ప్రధాని ముందుగా తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఈ పార్టీలు చేసిన డిమాండ్‌పైన కూడా ఆయన మాట్లాడకుండా కేవలం అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం ఎలా ముందుకు సాగుతున్న విషయాన్ని మాత్రమే ఆయన ఈ సందర్భంగా సోదాహరణగా వివరించడం గమనార్హం.

తెలంగాణ ముఖ్యమంత్రి అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు ఆయన సూటైన సమాధానం ఇవ్వ•• పోయినా, తెలంగాణ ప్రాంతానికి కేంద్రం ఎలాంటి సహాయ సహకారాలను అందించిందన్న విషయాన్ని గణాంకాలతో సహా వివరించే ప్రయత్నం చేశారు. విచిత్రమేమంటే ఆద్యంతం ఆయన ప్రసంగమంతా తెలంగాణ మీదే సాగింది. జాతీయ స్థాయిలో కొత్తగా ఏం చెయ్యబోతున్నామన్న విషయం కాని, విదేశ సంబంధాలపైన గాని, పెరుగుతున్న ధరలపైనగాని ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. తెలంగాణ రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నామని, పంటలకు కనీస మద్దతు ధర పెంచామని, రామగుండం ఎరువులు పరిశ్రమను పునరుద్దరించామని, కొరోనా వ్యాక్సిన్‌ ‌తయారీలో రాజధాని ప్రత్యేకతను చాటుకుందని, దానికి తమ సహకారం ఉందన్న విషయాన్ని, హైదరాబాద్‌ ‌చుట్టూ ప్రాంతాయ రింగ్‌ ‌రోడ్డు, పెద్ద ఎత్తున ఫ్లైవోర్‌ ‌నిర్మాణాలు చేపడుతున్న విషయాలను చెప్పుకొచ్చారు. అలాగే వరంగల్‌లో మెగా టెక్స్‌టైల్‌ ‌పార్క్ ఏర్పాటు పాత పాఠాన్నే మళ్ళీ చదివారు. కొరోనా సమయంలో దేశ ప్రజలతోపాటు తెలంగాణ ప్రజలకు అండగా నిలిచామని చెప్పుకొచ్చారు.

తెలంగాణలో తమ ప్రభుత్వం లేకున్నా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న తమకు ఒకసారి పాలనాధికారం ఇస్తే మరింత ముందుకు తీసుకెళ్తామని, అప్పుడది డబుల్‌ ఇం‌జన్‌ ‌పవర్‌తో దూసుకుపోతుందన్న విషయాన్ని ప్రజలకు చేరే విధంగా చెప్పడంలో సఫలమైనారు. అయితే ఇక్కడి అధికార టిఆర్‌ఎస్‌పై చేయాల్సినంతదాడి కేంద్రంనుండి వొచ్చిన ఇతర నాయకులు ముందుగానే చేయడంతో మోదీ తన ప్రసంగాన్ని హూందాగా కొనసాగించడం ద్వారా విమర్షలకు తావులేకుండా చూశారు. ప్రసంగం ప్రారంభంలో భద్రాచలం, జోగులాంబ, భద్రకాళి, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి, కాకతీయ రుద్రమ, ప్రతాపరుద్రుడు, కీర్తి తోరణాలు, కొమురం భీం, చాకలి ఐలమ్మ, పాలకుర్తి సోమనాథుడు లాంటి వారి పేర్లను ఊటంకిస్తూ అటు సాహిత్యపరంగా, ఇటు పౌరుషానికి ప్రతీకైన ఈ గడ్డకు ప్రణమిల్లుతున్నానని తడుముకోకుండా చెప్పడం ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నంగా కనిపించింది.. మొత్తానికి ఈ సమావేశాల ద్వారా బిజెపి తన లక్ష్యాన్ని నెరవేర్చుకోగలిందన్నది స్పష్టమవుతున్నది. దేశంలోని విభిన్న ప్రాంతాలనుండి బిజెపి నాయకులను తీసుకు వొచ్చి నియోజకవర్గాల వారిగా వారిని ఇన్‌ఛార్జిలు గా నియమించి భారీ సంఖ్యలో జనాన్ని సభకు తరలించడంద్వారా తమ సత్తాను తక్కువ అంచనా వేయవొద్దని అధికారపార్టీని హెచ్చరించినట్లైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page