•స్వయంభూ దేవాలయాన్ని 12 ఫీట్ల లోతుకు తవ్వాల్సిన అవసరమేమిటి?
•తవ్వకాల్లో నిధి లభించిందని, దానిని అన్యాంక్రాంతం చేశారని అనుమానాలు?
•పునర్ నిర్మాణం పేరుతో దేవాలయం చారిత్రక ప్రతిష్టను దెబ్బతీశారు
•వైష్ణవ దివ్య క్షేత్రాన్ని టెంక్లాయిగా ఎలా మారుస్తారు?
•ప్రధాన ఆలయంలో ఆళ్వార్ల మూర్తులు ఎందుకు ఏర్పాటు చేశారు
•హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరిపించాలి
•మూల విరాట్ మాయంపై నిజనిర్ధారణ కమిటీ, త్వరలో నివేదిక సమర్పణ
•హిందూ ఏక్తా ఆందోళన్ పార్టీ అధ్యక్షులు హరక్ బహుదూర్ ఛత్రి వెల్లడి
హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 22 : యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి దేవాలయం పునర్ నిర్మాణం మొత్తం ప్రక్రియపై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరిపించాలని హిందూ ఏక్తా ఆందోళన్ పార్టీ అధ్యక్షులు హరక్ బహుదూర్ ఛత్రి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హరక్ బహుదూర్ ఛత్రి మాట్లాడుతూ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి పురాతన విగ్రహం ప్రస్తుతం దేవాలయంలో లేదని, అసలు శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి పురాతన విగ్రహం ఏమైందని, ఎక్కడ ఉందని ప్రశ్నించారు. దాదాపు నాలుగు వేల సంవత్సరాల కింద యాదగిరిగుట్టపై భూమికి 3 అడుగుల లోతులో స్వయంభూగా వెలసిన గర్భగుడిలోని శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి విగ్రహానికి స్థానభ్రంశం కలిగించాల్సిన అవసరం ఏమిటని, దేవాలయాన్ని 12 ఫీట్ల లోతుకు తవ్వకాలు జరపాల్సిన అవసరమేమిటని, ఇందుకు కారణం ఏమిటి, తవ్వకాల్లో ఎలాంటి పురాతన వస్తువులు, లేదా భాండాగారం ఏమైనా బయటపడిందా, తవ్వకాలలో దొరికిన వస్తువులను పురావస్తు శాఖ ఇప్పటివరకు ఎందుకు బహిర్గతం చేయలేదని ఆయన నిలదీశారు. తవ్వకాలలో అత్యంత పురాతన నిధి నిక్షేపాల భాండాగారం దొరికిందని, వాటిని అన్యాక్రాంతం చేశారని పలు అనుమానాలు ఉన్నాయన్నారు. శ్రీ లక్ష్మి నర్సింహస్వామి పురాతన విగ్రహం ఆలయ గర్భగుడిలో లేదని అఖిల భారతీయ హిందూ మహాసభ అధ్యక్షులు రవిరంజన్ సింగ్ యాదగిరిగుట్ట పోలీసు స్టేషన్ ఫిర్యాదు చేశారని, దీనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావడం ఇందుకు బలం చేకుర్చుతున్నదని అన్నారు. ఈ నేపథ్యంలో దేవాలయం మొత్తం పునర్ నిర్మాణ ప్రక్రియపై పలు అనుమానాలను భక్తులు వ్యక్తం చేస్తున్నారన్నారు. పైగా దేవాలయం పునర్ నిర్మాణం పేరుతో దేవాలయం చారిత్రక ప్రతిష్టను దెబ్బతీశారని, వైష్ణవ దివ్య క్షేత్రాన్ని టెంక్లాయిగా తమిళనాడు సాంప్రదాయంలోకి మార్చారన్నారు. శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి పురాతన విగ్రహం అదృశ్యంపై నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశామని, ఈ కమిటీ దేవాలయాన్ని సందర్శించి త్వరలోనే నివేదికను ఇస్తుందని ఆయన తెలిపారు. ఈ నిజనిర్ధారణ కమిటీలో శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి భక్త సమితి అధ్యక్షులుగా ఎన్.ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా హెచ్.సి.ఉపాధ్యాయ, ప్రతాప్ సింగ్ బిజిలి, ప్రధాన కార్యదర్శిగా కృష్ణంరాజు, కార్యదర్శిగా కమలాకర్, కోశాధికారిగా కె.మహేశ్వర రావు ఉంటారని ఆయన తెలిపారు. శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి దేవాలయం పునర్ నిర్మాణంలో హిందూ సాంప్రదాయాలను ఉల్లంఘించారని, దేవాలయంలో చేసిన మార్పులు పూర్తిగా హిందూ సాంప్రదాయాలకు విరుద్దంగా ఉన్నాయని హిందూ ఏక్తా ఆందోళన్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణంరాజు విమర్శించారు. దేవాలయంలో ఈ మార్పులను చిన్న జియర్ స్వామి కు ఎలా అనుమతించారని ఆయన ప్రశ్నించారు. శ్రీ లక్ష్మీ నర్సింహ స్వామి దేవాలయం టెంక్లాయి అని ప్రచారం చేస్తున్నారని, ఇటీవల పునర్ నిర్మాణంలో భాగంగా ప్రధాన ఆలయంలో ఆళ్వార్ల మూర్తులు ఏర్పాటు చేశారని, ఇవి ఇంతకు ముందు లేవని, ఇది సరైనది కాదన్నారు. ఆళ్వార్లు తమిళనాడు వైష్ణవ సాధువులని, అది వైష్ణవ టెంక్లాయి దేవాలయం ఎలా అవుతుందని ప్రశ్నించారు. శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి దేవాలయం అత్యంత పురాతన చారిత్రక వైష్ణవ క్షేత్రమని, 4000 దివ్య ప్రబంధం లేదా 108 దివ్య క్షేత్రంలో దాని ప్రస్తావన ఉందని, దాని ప్రకారం దేవాలయాన్ని సరిచేయాలన్నారు. అన్ని వైష్ణవ దేవాలయాలలో కొన్ని ఆచారాలు పాటిస్తారని, ప్రధాన మూర్తికి ఉదయం అభిషేకం, నైవేధ్యం సమర్పించడం కంటే దేవత అలంకారం సంవత్సరంలో అన్ని రోజులలో తప్పనిసరి అని, శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి ఆలయంలో తప్పనిసరిగా ఈ ఆచారాన్ని పాటించాలన్నారు. పండితులు, అర్చకులు ఇతరులు అనుసరించాల్సిన మార్గదర్శకాలు ఉన్నాయని, ఈ విషయంపై శాస్త్రాలు ఉన్నాయని, వాటిని ఖచ్చితంగా పాటించాలన్నారు. దేవాలయంలో అవాంఛనీయ సంఘటనలు మొత్తం హిందూ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని, వాటిని వెంటనే సరిచేయాలన్నారు. లౌకిక ప్రభుత్వం హిందూ మందిర్, మఠం వ్యవహారాలను సరిగ్గా నిర్వహించడం సాధ్యం కాదని, ఒక అధికారికి దాని గురించి తెలియకపోవచ్చని, సనాతన ధర్మాచార్యుడు మాత్రమే వివిధ ఆచారాలు, నియమాలు, గ్రంథాలను అర్థం చేసుకోగలడన్నారు. అందువల్ల మందిరాన్ని నిర్వహించడానికి నిర్దిష్ట సంప్రదాయానికి చెందిన ధర్మాచార్యుడిని చేర్చుకోవాలని కోరారు. ఈ సమావేశంలో హిందూ ఏక్తా ఆందోళన్ పార్టీ రాష్ట్ర నేతలు ఎన్.ప్రభాకర్ రెడ్డి, ప్రతాప్ సింగ్ బిజిలి, కె.మహేశ్వర రావు పాల్గొన్నారు.