యావత్‌ ‌దేశానికి తెలంగాణ తలమానికం

 

యావత్‌ ‌తెలంగాణకు సిద్ధిపేట తలమానికం

హరీష్‌రావుకు గత మెజారిటీ రికార్డును తిరగ రాయాలి

సిద్ధిపేట ప్రగతి ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కేసీఆర్‌

‌సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17: ‌జన్మభూమిని మించిన గడ్డ లేదు. సిద్ధిపేట పేరు విన్నా…ఆలోచన వొచ్చినా…నా మనసులోకి వొచ్చినా ఇదే అనిపిస్తుంది. నన్ను కన్నది..సాదింది. నేను పసిగుడ్డుగా ఉన్నప్పుడు నా తల్లి పాలు ఇచ్చే పరిస్థితి లేకుంటే చింతమడకలో ఒక ముదిరాజ్‌ ‌తల్లి నాకు చనుబాలు ఇచ్చి సాకింది. పెద్దది చేసింది…చదువు చెప్పింది. రాజకీయ నేతను చేసింది…ఈ రాష్ట్రానికి సిఎంను చేసింది. ఒక మాటలో చెప్పాలంటే నన్ను విజేతగా నిలబెట్టింది సిద్ధిపేట గడ్డనే. నన్ను ఇంత వాడిని చేసిన సిద్ధిపేట గడ్డకు శిరస్సువంచి నమస్కరిస్తున్నా. ప్రతి సందర్భంలోనూ నన్ను విజేతగా నిలబెట్టిన ఈ గడ్డకు ఈ జన్మలో కూడా ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనని బిఆర్‌ఎస్‌ ‌వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఒకింత బావోద్వేగానికి గురయ్యారు. మంగళవారం సాయంత్రం సిద్ధిపేటలో బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక శాఖ మ్రతి తన్నీరు హరీష్‌రావును మరోసారి ఆశీర్వదించడానికి గానూ సిద్ధిపేట ప్రగతి సభ ఆశీర్వాద సభ పేరుతో ఏర్పాటు చేసిన సిఎం కేసీఆర్‌..‌మిగతా ప్రాంతాల మాదిరిగా కాకుండా సిద్ధిపేటలో సిఎం కేసీఆర్‌ ‌పెద్దగా రాజకీయాల జోలికి వెళ్లకుండా…పూర్తిగా తనకు సిద్ధిపేటతో ఉన్న అనుబంధం, ఆత్మీయతను, పాత జ్ఞాపకాలను జ్ఞప్తితెచ్చుకుంటూ స్పీచ్‌ను అంతా సాగింది. ఈ సభలో సిఎం కేసీఆర్‌ ‌మాట్లాడుతూ… ప్రాణాలను తెగించి తెలంగాణ ఉద్యమాన్ని పోరాటాన్ని మొదలు పెట్టినప్పుడు వొచ్చిన ఉప ఎన్నికల్లో సిద్ధిపేట ప్రజలు 60వేల వోట్ల భారీ మెజారిటీతో గెలిపించారన్నారు. 2004లో జరిగిన కరీనంగర్‌ ‌పార్లమెంటులో సిద్ధిపేటను వదిలిపెట్టి వెళ్లినప్పుడు అప్పుడు ఓ మీటింగ్‌ ‌పెట్టుకుంటే మీరు ఏడ్చారు. నేను ఏడ్చాను. అయితే ఆయేడు జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఒక ఆరుడుగుల బుల్లెట్‌ ‌తన్నీరు హరీష్‌రావును తీసుకు వచ్చి మీకు అప్పగిస్తే నేను ఊహించినదానికంటే సిద్ధిపేటను అన్ని రంగాలలో అభివృద్ధి చేశారన్నారు. సిద్ధిపేటకు నీళ్లు వచ్చినా, రైలు వచ్చినా, విద్యా కేంద్రాలు వచ్చినా అన్నింటిలో హరీష్‌రావు కృషి ఉందన్నారు. సిద్ధిపేటను అన్ని రంగాల్లో హరీష్‌రావు అభివృద్ధి చేశాడనీ, నేను ఎమ్మెల్యేగా ఉంటే కూడా ఇంత అభివృద్ధి జరగకపోయేదన్నారు. సిద్ధిపేటకు అన్ని వచ్చాయనీ…రానిది ఏంది, లేనిది ఏంది…వచ్చేదొక్కటే గాలిమోటార్‌(ఏయిర్‌పోర్టు) మాత్రమేనని అన్నారు. ఒకప్పుడు కరువుతో అల్లాడిన సిద్ధిపేట ఇప్పుడు పచ్చని పంట చేన్లతో సస్యశ్యామలంగా మారడం సంతోషంగా ఉందన్నారు. కన్నీరు కార్చిన సిద్ధిపేట నేడు ఎండాకాలంలో కూడా చెక్‌డ్యాంలు, చెరువులు, కుంటలు మత్తళ్లు దుంకుతుంటే పన్నీరు వచ్చినట్లు ఉందనీ ఇది చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉందనీ, సంతోషంతో మనసు పులకరించిపోతుందన్నారు. త్వరలోనే సిద్ధిపేట వజ్రం తునకాల మారనుందన్నారు. రైతుబంధుకు, మిషన్‌భగీరథ వంటి పథకాలకు సిద్ధిపేటనే పునాది అన్నారు. దళితబందు నిరంతర ప్రక్రియ అని, రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు అందుతుందనీ, నా ప్రాణం ఉన్నంత వరకు దళితబంధును దళితులందరికీ అందుతుందనీ, దీంట్లో ఎవరూ ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దన్నారు. బిసిలకు కూడా పథకాలు అందుతాయన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ ఏనాడు అభివృద్ధి కోసం పని చేయలేదనీ, రాష్ట్రంలో సిద్ధిపేటకు ప్రత్యేక గౌరవం, గుర్తింపు ఉందన్నారు. సిద్ధిపేటకు ప్రత్యేక గుర్తింపు, గౌరవం తెచ్చిన మంత్రి హరీష్‌రావు లక్షకు పైగా మెజారిటీ ఇవ్వాలన్నారు. హరీష్‌రావు పనితనం, సిద్ధిపేట పటిత్వం తిరిగి సిద్ధిపేటకు దక్కాలన్నారు. దేశానికి తెలంగాణ రాష్ట్రం తలమానికమైతే…రాష్ట్రానికి సిద్దిపేట తలమానికంగా మారిందనీ, సిద్ధిపేటను అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన మంత్రి హరీష్‌రావును లక్ష వోట్లకు పైగా మెజారిటీతో గెలిపించి గతంలో సిద్ధిపేటకు రికార్డును మీరే తిరగ రాయాలని వోటర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పిలుపునిచ్చారు.

కేసీఆర్‌కు, ప్రజలకు నాచర్మం వలిచి చెప్పులు కుట్టించినా తక్కువే… : మంత్రి హరీష్‌రావు

కేసీఆర్‌ ఆశీస్సులు, సిద్ధిపేట ప్రజల దీవెనలతో సిద్ధిపేట నియోజకవర్గంకు సేవ చేసే అదృష్టం కలిగిందనీ, నా శ్వాస ఉన్నంత వరకు సిఎం కేసీఆర్‌ ‌కోసం, ప్రజల కోసమే పని చేస్తాననీ, కేసీఆర్‌కు, ప్రజలకు నా చర్మం వలిచి చెప్పులు కుట్టించినా తక్కువేననీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, సిద్ధిపేట బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తన్నీరు హరీష్‌రావు కూడా ఒకింత బావోద్వేగానికి గురయ్యారు.సిద్ధిపేట ప్రగతి ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ..సిద్ధిపేట డిక్షనరీలో కరువు అనే పదాన్ని తొలగించిన మన బిడ్డ సిఎం కేసీఆర్‌ అన్నారు. కేసీఆర్‌ ‌లేకుంటే కాలేశ్వరం ప్రాజెక్టు వచ్చేదా? కరవును పారదోరేవాళ్లమా?అని ప్రశ్నించారు. కాలేశ్వరంను కేసీఆర్‌ ‌రూపకల్పన చేస్తే ఆ టైంలో నేను నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండటం నా అదృష్టంగా భావిస్తాననీ అన్నిరు. కేసీఆర్‌ను కారణజన్ముడు అని అంటారన్నారు. కొందరు కలలు కంటారు. సాధించేది మాత్రం కొద్ది మందికే దక్కుతుందని దివంగత రాష్ట్రపతి ప్రణబ్‌ ‌ముఖర్జి అన్న మాటలను మంత్రి హరీష్‌రావు గుర్తు చేశారు. సిద్ధిపేట రైలు, గోదావరి నీళ్లు, జిల్లా అనేది ట్యాగ్‌లైన్‌గానే ఉండేదనీ, వీటన్నింటినీ కేసీఆర్‌ ‌నిజం చేశారనీ అందుకే ఆయనను కారుణజన్ముడు అంటారన్నారు. కొంతమంది మూర్చులు తెలంగాణ వస్తే ఏమొచ్చిందని మాట్లాడుతున్నారనీ…తెలంగాణ ఇప్పుడు దేశానికి అన్నం పెడుతుందనీ,ధాన్యాగారంగా మారిందన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ హయాంలో సిద్ధిపేటలో ఎక్కడ చూసినా కరువు అల్లాడుతుండేదనీ, పశుగ్రాసం కూడా కొరత ఉండేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్‌ ‌సిఎం అయ్యాకనే రాష్ట్రంలో సిద్ధిపేటలో కరువు అనేది లేకుండా పోయిందన్నారు. రైతును కేసీఆర్‌ ‌బలోపేతం చేయడం వల్ల ఒకనాడు లక్షల రూపాయలకు అమ్ముడుపోయే భూములు ఇప్పుడు కోట్ల రూపాయలు పలుకుతున్నాయన్నారు. రైతుల గౌరవాన్ని పెంచిన నిఖార్సయిన రైతుబిడ్డ సిఎం కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌పార్టీ ఒక చాన్స్ ‌ప్లీజ్‌ అం‌టుందనీ…ఇప్పటికే 11సార్లు ఛాన్స్ ఇస్తే ఏం చేసిందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ‌హయాంలో కనీసం తాగునీళ్లు కూడా ఇవ్వలేదన్నారు. అలాంటి కాంగ్రెస్‌కు మరో అవకాశం ఎందుకు ఇవ్వాలన్నారు. ఈసభకు సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి బిఆర్‌ఎస్‌ ‌పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సభ సక్సెస్‌ ‌కావడంతో బిఆర్‌ఎస్‌ ‌నాయకులు సంతోషం వ్యక్తం చేశారు

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page