ప్రజలకు మెరుగైన సేవలందించే దిశగా చర్యలు
ప్రయాణం అవసరం…భద్రత అంతే ముఖ్యం
రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
తుర్కయాంజల్లో ఆర్టీఓ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి
ఇబ్రహీంపట్నం, ప్రజాతంత్ర, జనవరి 18 : ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర రవాణా శాఖలో ప్రక్షాళనను చేపట్టి సమగ్ర మార్పులు చేయనున్నామని రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడిరచారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంస్థ ద్వారా సేవలు అందించాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకెళ్తుందన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని తుర్కయాంజల్ మున్సిపాలిటీ లోని మన్నెగూడ ప్రాంతంలో ఆరు ఎకరాల విస్తీర్ణంలో రూ 2.15 కోట్ల సిఎస్ఆర్ నిధులను వెచ్చిస్తూ రామోజీ ఫౌండేషన్ నూతనంగా నిర్మించిన ఆర్టీవో కార్యాలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…నానాటికి విస్తరిస్తున్న సమాజంలో సగటు మనిషి జీవితంతో పోలిస్తే, వాహనాల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతుందన్నారు. 2014లో 71 లక్షలకే పరిమితమైన వాహనాల సంఖ్య, నేడు కోటీ 60 లక్షలు దాటిందంటే వాహనాల విస్తృతిని అర్ధం చేసుకోవచ్చని అన్నారు.పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగానే రోడ్డు భద్రత అంశాన్ని కూడా ప్రతి ఒక్కరు అంతర్భాగంగా మల్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. లేనిపక్షంలో ప్రమాదాలకు ఎక్కువ ఆస్కారం ఉంటుందన్నారు. రాష్ట్రంలో గత సంవత్సరం 22 వేల ప్రమాద సంఘటనలు చోటు చేసుకుని మూడు వేల మంది తమ విలువైన నిండు ప్రాణాలను కోల్పోయారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రయాణం ఎంత అవసరమో, భద్రత కూడా అంతే ముఖ్యమని మంత్రి నొక్కి చెప్పారు. రవాణా శాఖ ద్వారా ప్రతి పౌరుడికి డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ వివిద రూపాల్లో మెరుగైన సేవలందించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇప్పటికే కంప్యూటరీకరించబడిన 59 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలకు వారి ఆకాంక్షలకు అనుగుణంగా సేవలందించేలా సమగ్ర మార్పులు తెస్తామని మంత్రి పునరుద్ఘాటించారు. ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మహిళలకు
ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అందుబాటులోకి తెచ్చిందని అన్నారు. ఈ పథకం అమల్లోకి వొచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు 9 కోట్ల జీరో వ్యాల్యూ టికెట్స్ జారీ చేయడం జరిగిందన్నారు. సంక్రాంతి పండుగకు ఉచిత రవాణా సదుపాయం కల్పించిన తరహాలోనే సమ్మక్క సారక్క జాతరకు, ఇతర పండుగలు, పుణ్యక్షేత్రాల సందర్శన వంటి వాటికి కూడా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఈ విషయమై కొందరు కుట్ర చేస్తున్నారని మంత్రి ఆక్షేపించారు. ఇదివరకు మెట్రో, ఓలా, ఉబర్ క్యాబ్ వొచ్చిన సమయంలో మిన్నకుండిపోయిన వారు నేడు అనవసర ఆందోళన వెలిబుచ్చుతున్నారని మంత్రి అన్నారు. అయినప్పటికీ ఆటో రిక్షా ఆపరేటర్ల పట్ల ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని, వారి సమస్యలపై చర్చించి పరిష్కరించేందుకు ఆటో యూనియన్ ప్రతినిధులతో సమావేశం కానున్నట్లు మంత్రి తెలిపారు.
మహిళా సాధికారతకు కట్టుబడి ఇతర సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరిలోనూ మహిళలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తుందని అన్నారు. ఇబ్రహీంపట్నం శాసన సభ సభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ…నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రామోజీ ఫౌండేషన్ సహకారంతో నూతనంగా ప్రాంతీయ రవాణ కార్యాలయం ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న వాహనాలను దృష్టిలో పెట్టుకుని పార్కింగ్ స్థలమును ఎంచుకోవలసి వొస్తుందని అన్నారు. అతి త్వరలో మున్సిపల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రజల అవసరాలకై అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. ప్రజల అవసరాలు, శ్రేయస్సు కొరకు ప్రభుత్వం పాటుపడుతుందని అన్నారు. జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ…6 ఎకరాలలో రామోజీ ఫౌండేషన్ సహకారంతో 2 కోట్ల నిధులతో నూతనంగా ప్రాంతీయ రవాణ కార్యాలయాన్ని అత్యాధునిక పద్దతిలో నిర్మించుకొని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని అన్నారు.
మనుషుల అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో అదే స్థాయిలో వాహనాల సంఖ్య పెరుగుతుందని అన్నారు. జిల్లాలో రవాణ శాఖ కార్యాలయాలు స్వంత భవనాలలో కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ప్రాంతీయ రవాణ కార్యాలయము ఇబ్రహీంపట్నం నియోజకవర్గములోని 11 మండలాల పరిధిలోని ప్రజల అవసరాలకు అందుబాటులో ఉండి సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ ద్వారా 1526 కోట్ల రెవెన్యూ సేకరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామోజీ ఫౌండేషన్ ప్రతినిధి విజయేశ్వరి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనిత హరనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం, బోగారపు దయానంద్, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్, జిల్లా రవాణా శాఖ అధికారి ప్రవీణ్ రావు, స్థానిక రవాణా శాఖ అధికారి రఘునందన్ గౌడ్, స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ మల్ రెడ్డి అనురాధ రాంరెడ్డి, వైస్ చైర్ పర్సన్ హరిత ధన్ రాజ్ గౌడ్, నయకులు, పలు శాఖల ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.