- ప్రోటోకాల్ పాటించడంలో మార్పు రాలేదన్న గవర్నర్
- వరదలను రాజకీయం చేయదల్చుకోలేదని వెల్లడి
- ముర్ముకు పదవి మహిళలకు దక్కిన గౌరవమని వెల్లడి
న్యూ దిల్లీ, జూలై 25 : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, టీఆర్‌ఎస్ ప్రభుత్వం మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. తాజాగా మరోసారి ఈ విషయం బహిర్గతమైంది. దిల్లీ వేదికగా గవర్నర్ తమిళిసై..తెలంగాణ సర్కార్‌పై పరోక్షంగా విమర్శలు కురిపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై గవర్నర్ మరోసారి ఫైర్ అయ్యారు. ప్రోటోకాల్‌ను పాటించడంలేదని ఆరోపించారు. సోమవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ..మొట్ట మొదటిసారిగా ఒక గిరిజన మహిళ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అయ్యారని, ఇది దేశం గర్వించదగిన అంశమని అన్నారు. తాను రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా బాధ్యతతోనే వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లానన్నారు. ఈ దఫా పర్యటనలో కూడా అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని మండిపడ్డారు. ప్రగతి భవన్, రాజ్‌భవన్ గ్యాప్‌పై తానిప్పుడేవి• వ్యాఖ్యానించనని అన్నారు. వరదలకు క్లౌడ్‌బర్సట్ కారణం అన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై తాను బర్సట్ కానని, వరదల వల్ల నష్టపోయిన తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తూనే ఉందన్నారు. వరదలవల్ల కలిగిన నష్టంపై కేంద్రానికి ఇప్పటికే నివేదిక పంపించానన్నారు. ఇటీవల ప్రధాని హైదరాబాదు పర్యటనలో రాజకీయాలపై చర్చించారా అన్న మీడియా ప్రశ్నకు తాను స్పందించనని గవర్నర్ తమిళి సై సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో వరదలపై రాజకీయం చేయడం మంచిది కాదు.
కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తెలంగాణకు వొచ్చాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిధులకు సంబంధించిన వివరాలు ఇచ్చారు. నేను ఎప్పుడూ ప్రజలతోనే ఉంటాను. నైతిక బాధ్యతతోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాను. ఈ క్రమంలోనే వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదించాను. కింది స్థాయి నుంచి వొచ్చిన మహిళ..దేశానికి రాష్ట్రపతి కావడం కేవలం భారత్‌లోనే సాధ్యమైంది. మహిళా రాష్ట్రపతి కింద మహిళా గవర్నర్‌గా పని చేయడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదు. రాజ్‌భవన్‌లో సీఎం కేసీఆర్ కలిసిన తర్వాత కూడా ప్రొటోకాల్‌లో మార్పులేదు. వరదల సమయంలో కలెక్టర్ కూడా రాలేదు. మా మధ్య సంబంధాల్లో ‘స్టేటస్ కో’నే ఉంది. ఇతర రాష్ట్రాల గవర్నర్లతో నేను పోల్చుకోను. గవర్నర్‌ను కాబట్టి రాజ్‌భవన్‌కే పరిమితం కాను. ప్రజలకు అందుబాటులో ఉండటమే నా లక్ష్యం. నాకు తోచిన రీతిలో వారికి సాయం అందిస్తానని స్పష్టం చేశారు.
కాగా, తెలంగాణ గవర్నర్ హోదాలో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి తమిళిసై హాజరయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారోత్సవానికి గవర్నర్ హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారానికి హాజరుకావడం సంతోషంగా ఉందన్నారు. ఆమె చాలా కింది స్థాయి నుంచి వొచ్చారని… చాలా సింపుల్ పర్సన్ అని..ఇది మహిళలకు దక్కిన గౌరవంగా చెప్పుకొచ్చారు. మహిళలకు ఒక రోల్ మోడల్ ద్రౌపది ముర్ము అని తెలిపారు. గవర్నర్ భవన్‌కు, ప్రగతి భవన్‌కు మధ్య గ్యాప్‌పై స్పందించేందుకు గవర్నర్ నిరాకరించారు.