‌రుగ్మత వలయంలో యువభారతం !

ప్రతి ముగ్గురిలో ఒక్క భారతీయ యువకుడు, అనగా 33.3 శాతం మంది ప్రమాదకర ‘మెటబాలిక్‌ ‌సిండ్రోమ్‌ (‌జీవ క్రియ బహువ్యాధి లక్షణం/జీవనశైలి రుగ్మతలు)’ విష వలలో చిక్కుతున్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘సిట్టింగ్‌ ఈజ్‌ ‌కిల్లింగ్‌’ అనే నినాదం నేడు బహుళ ప్రచారం పొందుతున్నది. గంటల తరబడి కూర్చొని పని చేస్తున్న వ్యక్తులు సమీప భవిష్యత్తులో మెటబాలిక్‌ ‌రుగ్మతల బారిన పడతారని తెలుస్తున్నది. ఉద్యోగ ఉపాధుల రీత్యా నిశ్చలమైన జీవనశైలి (సెడెంటరీ లైఫ్‌ ‌స్టైల్‌)‌కి అలవాటు పడిన 30 – 39 ఏండ్ల వయస్సు కలిగిన భారతీయ యువత ఉదర ఊబకాయం లేదా అబ్డమినల్‌ ఒబేసిటీ లేదా బొర్ర పెరగడం అనే రుగ్మతతో పాటు ఇన్సులిన్‌ ‌నిరోధకత, బిపీ, టైప్‌-2 ‌మధుమేహం, హైపర్‌లిపిడెమియా, హై బ్లడ్‌ ‌ట్రైగ్లిజరైడ్స్, ‌లో లెవల్‌ ‌హెచ్‌డిఎల్‌ ‌కొలెస్టరాల్‌ ‌లాంటి ‘మెటబాలిక్‌ ‌సిండ్రోమ్‌’ అనబడే అనారోగ్యాల బారిన పడి ప్రమాదకర హృద్రోగాల పాలు అవుతున్నారని నిపుణులు వివరిస్తున్నారు.

ఆధునిక జీవనశైలి రుగ్మతలు
కదలకుండా గంటల తరబడి కూర్చొని పని చేస్తున్న సాఫ్ట్‌వేర్‌, ఆఫీస్‌ ఉద్యోగుల్లో ఫ్యాటీ లివర్‌, ‌డిస్‌లిపిడెమియా, స్థూలకాయం, బిపీ, షుగర్‌, ‌నడుం చుట్టు/పొట్టలో అధిక కొవ్వు పేరుకు పోవడం లాంటి అనారోగ్యాలకు గురి అవుతున్నారని వైద్యులు సూచిస్తున్నారు. నిశ్చల జీవన విధానాన్ని పాటిస్తున్న యువతలో 25 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత మెటబాలిక్‌ ‌సిండ్రోమ్‌ ‌రుగ్మతలు తమ ప్రకూల ప్రభావాలను చూపుతూ గుండె జబ్బులకు సహితం కారణం అవుతున్నారు. భారతీయ యువతలో దాదాపు 25 శాతం (మహిళల్లో 31 శాతం, పురుషుల్లో 18.5 శాతం) మంది తీవ్రమైన మెటబాలిక్‌ ‌సిండ్రోమ్‌ ‌లేదా జీవనశైలి రుగ్మతల వలలో పడుతున్నారని అంచనా వేస్తున్నారు.

మెటబాలిక్‌ ‌సిండ్రోమ్‌కు కారణాలు
పాండుచ్చెరికి చెందిన జిప్మర్‌ ‌సంస్థ నిర్వహించిన అధ్యయనంలో 1.33 లక్షల మంది పౌరుల ఆరోగ్య ప్రగతిని విశ్లేషించి ఫలితాలను రాబట్టారు. 50 ఏండ్లు దాటిన భారతీయుల్లో 50 శాతం వరకు ఈ రుగ్మతలకు లోనవుతున్నట్లు తేలింది. పట్టణ యువతతో పోల్చితే గ్రామీణ యువతలో తక్కువగా కనిపిస్తున్నట్లు తేల్చారు. శారీరక శ్రమ లేదా వ్యాయామం కొరవడడం, బయటి పనులు తగ్గిపోవడం, మైదాన ఆటలకు స్వస్తి పలకడం, మానసిక ఒత్తిడి బారిన పడడం, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు లాంటి కారణాలతో మెటబాలిక్‌ ‌సిండ్రోమ్‌ ‌రుగ్మతలకు దగ్గరవుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. కనీసం 6 – 7 ఏండ్ల పాటు నిశ్చల జీవనశైలినా పాటిస్తున్న యువతలో ఈ రుగ్మతలు బయట పడుతున్నాయని తెలుపుతున్నారు. నభారతీయుల్లో 30 -40 శాతం వరకు మెటబాలిక్‌ ‌సిండ్రోమ్‌ ‌రుగ్మతలు కనిపిస్తున్నాయి.

మెటబాలిక్‌ ‌సిండ్రోమ్‌ ‌కట్టడి మార్గాలు
1960ల్లో రోజుకు రెండు పూటల మాత్రమే ఆహారం తీసుకునే అలవాటు ఉండేది. గతంతో పోల్చితే నేటి పట్టణ యువత 7 రెట్లు అధికంగా ఆహారం తింటున్నారని వివరిస్తున్నారు. ప్రతి వ్యక్తి. 20 – 30 ఏండ్ల వయస్సులో పాటించిన జీవనశైలి, ఆహార అలవాట్లు 30 దాటిన తర్వాత తమ ప్రభావాన్ని చూపుతాయని వైద్యులు అంటున్నారు. గ్లుకోజ్‌ అధికంగా ఉన్న ఆహారాలను నియంత్రించుకోవడం, శారీరక వ్యాయామానికి ప్రాధాన్యమివ్వడం, ఫాస్ట్/‌ప్యాకెజ్డ్/‌ప్రాసెస్డ్ ‌ఫుడ్స్‌కు చరమగీతం పాడడం, గంటల తరబడి కూర్చొని పని చేయడాన్ని తగ్గించడం, ప్రతి గంట లేదా గంటన్నర తర్వాత ఐదు నిమిషాలు లేచి నడవడం, దినచర్యను క్రమబద్దీకరించుకోవడం, పిండి పదార్థాలను తగ్గించి మాంసకృత్తులు/పీచు పదార్థాలను అధికంగా తీసుకోవడం

ఆల్కహాల్‌/‌స్మోకింగ్‌/‌ఫ్యాటీ ఫుడ్‌/‌నూనెలో వేయించిన ఆహారాలను వదిలేయడం, పరిమిత కాలం పాటు నిద్రించడం, నిత్యం (యోగా/ధ్యానం/వాకింగ్‌/‌రన్నింగ్‌/అవుట్‌డోర్‌ ‌గేమ్స్/‌ట్రెడ్‌మీల్‌/‌సైక్లింగ్‌) ‌శారీరక వ్యాయామాలు చేయడం లాంటి జీవన విధానాలు ‘మెటబాలిక్‌ ‌సిండ్రోమ్‌’ ‌బారిన పడకుండా రక్షిస్తాయి. బిఎంఐ (బాడీ మాస్‌ ఇం‌డెక్స్) ‌శాతం 40 దాటిన రోగులకు బెరియాట్రిక్‌ ‌సర్జరీ కూడా చేయడం చూస్తున్నాం. చేతులు కాలక ముందే ఆకులు సిద్ధం చేసుకున్నట్లు, ఆరోగ్యంగా ఉన్నప్పుడే భవిష్యత్తు ఆరోగ్యానికి బాటలు వేస్తూ, సంపూర్ణ ఆరోగ్య దీపం ఉండగానే భవిష్యత్తు ఆరోగ్య ఇల్లును సక్కబెట్టుకుంటూ, సక్రమ జీవనశైలిని పాటిస్తూ మన ఆరోగ్యాలను కాపాడుకుందాం, ఆరోగ్యమే సౌభాగ్యమని నినాదాలు చేద్దాం.                                     •

 -‌డా.బుర్ర
మధుసూదన్‌ ‌రెడ్డి
కరీంనగర్‌,
9949700037 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page