9 మంది మంత్రలు శాఖలు తొలగింపు
ముంబై, జూన్ 27 : మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్ఠంభన కొనసాగుతున్నది. శివసేన చీఫ్, సీఎం ఉద్ధవ్ ఠాక్రే సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. 9 మంది రెబల్స్ మంత్రుల శాఖలను తొలగించారు. ఆయా మంత్రిత్వ శాఖలను మిగతా మంత్రులకు కేటాయించారు. శివసేన తిరుగుబాటు గ్రూపు నేత ఏక్నాథ్ షిండే చూస్తున్న పట్టణాభివృద్ధి, పబ్లిక్ వర్కస్ మంత్రిత్వ శాఖలను మంత్రి సుభాష్ దేశాయ్‌కు అప్పగించారు. మరో రెబల్ మంత్రి గులాబ్రావ్ పాటిల్ వద్ద ఉన్న నీటి సరఫరా, పారిశుద్ధ్యం శాఖల బాధ్యతలను మంత్రి అనిల్ పరబ్‌కు అప్పగించారు. మరో రెబల్ మంత్రి దాదాజీ భూసే వద్ద ఉన్న వ్యవసాయం, మాజీ సైనికుల సంక్షేమ శాఖలు, రెబల్ మంత్రి సందీపన్ భూమారే వద్ద ఉన్న ఉపాధి హా, ఉద్యానవన శాఖలను మంత్రి శంకర్ గడఖ్‌కు కేటాయించారు.
తాజాగా రెబల్ గ్రూప్‌లో చేరిన మంత్రి ఉదయ్ సావంత్ వద్ద ఉన్న ఉన్నత విద్య, సాంకేతిక విద్యా శాఖలను మంత్రి ఆదిత్య ఠాక్రేకు అప్పగించారు. అలాగే రెబల్ మంత్రి శంభురాజ్ దేశాయ్ వద్ద ఉన్న మూడు పోర్ట్‌ఫోలియోలను మంత్రులు సంజయ్ బన్సోడే, సతేజ్ పాటిల్, విశ్వజిత్ కదమ్‌లకు పంచారు. మరో రెబల్ మంత్రి రాజేంద్ర పాటిల్ (యాద్రవ్కర్) వద్ద ఉన్న నాలుగు మంత్రిత్వ శాఖలను మంత్రులు విశ్వజీత్ కదమ్, ప్రజక్త్ తాన్పురే, సతేజ్ పాటిల్, అదితి తత్కరేలకు పంపిణీ చేశారు. రెబల్ మంత్రి అబ్దుల్ సత్తార్ వద్ద ఉన్న మూడు శాఖలను మంత్రులు ప్రజక్త్ తాన్పురే, సతేజ్ పాటిల్, అదితి తత్కరే కేటాయించారు.
రెబల్ మంత్రి ఓంప్రకాష్ కుడు వద్ద ఉన్న నాలుగు పోర్ట్‌ఫోలియోలను మంత్రులు అదితి తత్కరే, సతేజ్ పాటిల్, సంజయ్ బన్సోడే, దత్తాత్రయ్ భర్నేలకు పంపిణీ చేశారు. పరిపాలనా పరంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఆయా శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనులు ఆగకుండా ఉండేందుకు అందుబాటులో లేని మంత్రుల వద్ద ఉన్న శాఖలను ఇతర మంత్రులకు కేటాయించినట్లు సీఎం ఉద్ధవ్ ఠాక్రే కార్యాలయం సోమవారం ప్రకటించింది.