గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ నేడు భదాద్రి-కొత్తగూడెం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్నారు. శనివారం న్యూ దిల్లీలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వీడ్కోలు విందుకు ఆమె హాజరు కావల్సి ఉన్నా ఆ పర్యటనను రద్దు చేసుకుని ఆమె హదాద్రి వరద ప్రాంతాలో పర్యటించి బాధితులను పరామర్శించనున్నారు. భద్రాచలం మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో వరద బాధిత ప్రజల దుస్థితిని చూసి చలించిన గవర్నర్ తన న్యూ దిల్లీ పర్యటనను రద్దు చేసుకుని భదాద్రి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటంచాలని నిర్ణయించుకున్నట్లు గవర్నర్ కార్యాలయం ద్వారా వెలువడిన ప్రకటనలో పేర్కొన్నారు.
గవర్నర్ శనివారం రాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైలు ఎక్కి ఆదివారం ఉదయం మణుగూరు చేరుకుంటారు. షెల్టర్ క్యాంపులు మరియు ఇతర వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు వైద్య మరియు ఇతర సహాయక చర్యలను అందించాలని గవర్నర్ ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, మరియు ఇఎస్ఐ మెడికల్ కాలేజీ బృందాలను ఆదేశించారు. గవర్నర్ షెల్టర్ క్యాంపులను సందర్శించి, ప్రజలతో మమేకమవుతారని, ఇతర దాతృత్వ సంస్థలు, వ్యక్తుల నుండి సహాయ సామాగ్రిని సమీకరించే అవకాశం ఉందని ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై ప్రజలు, ఇతర సంస్థలను ఉదారంగా విరాళాలు ఇవ్వడం, సహాయక చర్యలు చేపట్టడం, అవసరమైన వారికి మానవతా సహాయం అందించడం ద్వారా వరద బాధిత ప్రజలకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.