బాలల భారతం
డా।। పులివర్తి కృష్ణమూర్తి
అలాంటి పరిస్థితిని రానియ్యకండి. కావున మీరు రాజ్యాధికారం వహించాలి. మనం పాండువులను వారణావతం పంపుదాం. వారు అక్కడ వుండగా ప్రలందరినీ దాన ధర్మాలతో మన వైపు తిప్పుకుందాము. ఆ తర్వాత నేను సింహాసనాన్ని అధిరోహిస్తాను. అప్పుడిక కుంతీతో సహా అందరూ యదేచ్ఛగా వుండవచ్చును అన్నాడు. ధృతరాష్ట్రుడు మాత్రం అందుకు భీష్మ, ద్రోణ, కృప, విదురాదులు అంగీకరించరేమో అన్న సందేహాన్ని వెలిబుచ్చాడు. ధుర్యోదనుడు ఆలోచించి ఇలా అన్నాడు. ‘అశ్వత్థామను విడిచి ద్రోణాచార్యుడు వుండలేడు. అశ్వత్థామకు నేనంటే ఎంతో ప్రాణం. భీష్ముల వారు ఏమీ అనేవారు కాదు. విదురుడు అర్థమంత్రిగాబట్టి మనల్ని విడిచిపోడు. ఆయనకు పాండవుల యెడల పక్షపాతం వున్నా మనలను వారుచేయగలిగింది ఏమీవుండదు’ అనగా ధృతరాష్ట్రుడు మారు మాట్లాడక తలూపాడు.
ధుర్యోదనుడు వారణావతం గురించి గొప్పగా మాట్లాడేందుకు జనాలను ప్రత్యేకంగా నియోగించాడు. వాళ్ళు ఆ నగర సౌభాగ్యం గురించి, సుందర ఉద్యానవన వనాల గురించి గొప్పగా ప్రచారం చేయడం ప్రారంభించాడు. ఎప్పుడూ వారాణావతం గురించి వినిపిస్తూవుంటే పాండవులకు అక్కడికి వెళ్ళాలనిపించింది. అలాగని తెల్సిన వెంటనే ధృతరాష్ట్రుడు పాండవులకు వారణావతం వెళ్ళాలని వుంటే వెళ్ళి రమ్మనండి అన్నాడు.
ఈలోగా ధుర్యోదనుడు పురోచనుడనే వానిని పాండవులకోసం లక్క ఇంటిని నేతితోనూ, నూనెతోనూ నిర్మించమన్నాడు. పాండవులు అక్కడకు రాగానే సాదరంగా ఆహ్వానించి విడిది చేయించమన్నాడు తన మంత్రి పురోచనుడితో.
పాండవులు ధృతరాష్ట్రుని ఆదేశానుసారం ప్రయాణం కట్టారు. భీష్మ, ద్రోణ, కృప, విదురులకూ, కురువృద్ధులకూ నమస్కారం చేసి బయలుదేరగా పురజనులు ఎంతగానో విచారించారు. సద్గుణశీలుడైన ధర్మరాజు వెంటే తామూ వస్తామనగా ధర్మరాజు అందుకు అంగీకరించలేదు. ధృతరాష్ట్రుడు చేసిన ఈ పనికి భీష్మ ద్రోణులు ఎలా అంగీకరించారా అని ఆశ్చర్యపోయారు.
(మిగతా..వొచ్చేవారం)