లిబియా, సెప్టెంబర్ 13: డేనియల్ తుఫాన్ తాకిడికి ఆఫ్రికా దేశం లిబియా అతలాకుతలమైంది. ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి వరదలు సంభవించాయి. ఆకస్మిక వదరల కారణం తూర్పు లిబియాలో జల ప్రళయం సంభవించింది. ముఖ్యంగా డెర్నా పట్టణం ఈ వరదలకు ఊడ్చిపెట్టుకుపోయింది. ఆ నగరంలో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. రోడ్లపై ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా శవాలే కనిపిస్తున్నాయి. వాహనాలు చల్లాచెదురుగా పడి ఉన్నాయి. అంతర్జాతీయ డియా కథనాల ప్రకారం.. ఇప్పటి వరకూ ఈ జల ప్రళయంలో సుమారు 5,300 మంది ప్రాణాలు కోల్పోయారు.
10 వేల మందికిపైగా ప్రజలు గల్లంతయ్యారు. ఇప్పటి వరకూ 1,000 మృతదేహాలను గుర్తించి ఖననం చేసినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ జల ప్రళయానికి అనేక ప్రాంతాలు పూర్తిగా అతలాకుతలమయ్యాయని.. ముఖ్యంగా డెర్నా నగరంలోనే ఎక్కువగా నష్టం వాటిల్లినట్లు వెల్లడించారు. డేనియల్ తుఫాన్ ఆదివారం రాత్రి లిబియా తీర ప్రాంతాన్ని తాకింది. కొన్ని గంటల వ్యవధిలోనే తుఫాన్ తీవ్ర రూపం దాల్చింది. వరదల తాకిడికి రెండు డ్యాములు కొట్టుకుపోయాయంటే జల విలయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. డ్యాములు ధ్వంసం కాగా అక్కడ్నుంచి పోటెత్తిన వరద నీటిలో అనేకమంది మధ్యధరా సముద్రంలోకి కొట్టుకుపోయారని అంతర్జాతీయ డియాలో వార్తలు వెలువడ్డాయి.