శాలువా కప్పి సత్కరించిన జైలు అధికారులు
అయోధ్య,జనవరి9 : సాధారణంగా జైలులో శిక్ష అనుభవించే ఖైదీని.. అతడి శిక్ష పూర్తయిన వెంటనే అక్కడి నుంచి పంపేస్తారు. అతడికి సంబంధించిన వస్తువులను ఇచ్చి.. ఇంటికి సాగనంపుతారు. కానీ.. ఆ జైలులో మాత్రం ఐదేళ్ల శిక్ష అనుభవించిన ఓ వృద్ద ఖైదీకి అధికారులు సన్మానం చేసి పంపించారు. ఉత్తరప్రదేశ్ అయోధ్యలో ఈ ఘటన జరిగింది. రామ్ సూరత్ అనే 98 ఏళ్ల వృద్ధుడు పలు కేసుల్లో దోషిగా తేలడంతో కోర్టు అతనికి ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. దీంతో అతను అయోధ్య జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.
ఇటీవలే శిక్ష పూర్తవడంతో అతను ఇటీవల విడుదలయ్యాడు. అయితే.. జైలు సూపరింటెండెంట్ శశికాంత్ మిశ్రా.. రామ్ సూరత్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. అతడిని శాలువాతో సన్మానించి.. కొంత నగదు ఇచ్చి పంపించారు. నిజానికి రామ్ సూరత్ గతేడాది ఆగస్టు 8న విడుదల కావాల్సి ఉంది. కానీ మే 20న అతనికి కొవిడ్ నిర్దారణ కావడంతో 90 రోజులు పెరోల్‌పై బయటకు వచ్చాడు. తాజాగా శిక్షాకాలం పూర్తవడంతో విడుదలయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోను ఉత్తరప్రదేశ్ జైళ్ల శాఖ డీజీ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ డియాలో వైరల్‌గా మారింది.