హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 5 : మార్గరెట్ అల్వాకు మద్దతివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికలో అనుసరించిన విధానాన్నే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాలని తెరాస అధిష్ఠానం నిర్ణయించింది. ఈ మేరకు విపక్ష కూటమి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తెరాసకు చెందిన మొత్తం 16 మంది తెరాస ఎంపీలు పార్లమెంట్ భవనంలో శనివారం జరగనున్న ఎన్నికలో మార్గరెట్ అల్వాకు మద్దతుగా వోటు వేయనున్నారు.
పార్లమెంట్ భవనంలో ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. రహస్య బ్యాలెట్ విధానంలో జరగనున్న ఈ ఎన్నికలో మొత్తం 788 మంది ఎంపీలు తమ వోటు హక్కును వినియోగించుకోనున్నారు. సాయంత్రం కౌంటింగ్ నిర్వహించి.. ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ ఎన్నికకు లోక్సభ సెక్రటరీ జనరల్ ఆర్వోగా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్ఖడ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.