- ముందస్తు ఊహాగానాలకు కెసిఆర్ చెక్
- బిజెపి దూకుడుకు అడ్డుకట్ట వేయాల్సిందే
- ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి
- ఇడి, ఐటి దాడులకు బెదరాల్సిన పనిలేదు
- పాతవారికే మళ్లీ టిక్కెట్లు
- పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో సిఎం కెసిఆర్ స్పష్టీకరణ
తెలంగాణలో యథావిధిగా షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ముందస్తు ఊహాగానాలను కెసిఆర్ కొట్టి పడేశారు. టీఆర్‌ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలపై స్పష్టత ఇచ్చారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. అలాగే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై చర్చించారు. ప్రజల మధ్యలోనే ఎమ్మెల్యేలు, నేతలు ఉండాలని సీఎం సూచించారు. మళ్లీ పాత వాళ్లకే టికెట్లు ఇస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికలకు పది నెలల సమయమే ఉంది. బీజేపీతో పోరాడాల్సిందే అని చెప్పారు. ఎమ్మెల్యేలను మార్చే ప్రసక్తే లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికలకు ఏడాది కాలం ఉందని గట్టిగా పోరాడాలని నేతలకు సూచించారు. రానున్న 10 నెలలు చాలా కీలకమని, టీఆర్‌ఎస్ నేతలంతా ప్రజల్లో ఉండాలని, ఎమ్మెల్యేలు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలని కేసీఆర్ సూచించారు.
ఇకపై బీజేపీ మరింత రెచ్చిపోతుందని, ఆ పార్టీతో ఇక యుద్ధమేనని కేసీఆర్ స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ పార్టీ నేతలు ఇకపై మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీజేపీ ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేస్తుందన్నారు. అనవసర విషయాల జోలికి వెళ్లవద్దని నాయకులకు కేసీఆర్ సూచించారు. వివాదాస్పద విషయాల్లో తలదూర్చవద్దని స్పష్టం చేశారు. ఐటీ, సీబీఐ, ఈడీలకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలవడంతో టీఆర్‌ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్లవచ్చని ప్రచారం జరిగింది. ఏడాది ముందే ఎన్నికలకు కేసీఆర్ సిద్ధమౌతారని ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఈ ఊహాగానాలకు, పుకార్లకు కేసీఆర్ చెక్ పెట్టారు. ఏడాది తర్వాతే, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు. కాగా విస్తృత స్థాయి సమావేశానికి ఎంపిలు, ఎమ్మెల్యేలు, మంత్రులు తదితరులు హాజరయ్యారు.