సంపద సృష్టికి నిలయాలు- వనాలు

ఐక్యరాజ్యసమితి మార్చి 21న అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. 2012 నుంచి దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ రోజు ముఖ్య ఉద్దేశ్యం అడవుల ప్రాముఖ్యతపై ప్రజలలో అవగాహన పెంచడం.ఐక్యరాజ్యసమితి ఫోరమ్‌ ఆన్‌ ‌ఫారెస్టస్ ‌మరియు ఫుడ్‌ అం‌డ్‌ అ‌గ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ అటవీ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది.
 జీవ వైవిద్యానికి ప్రతీక అడవులు
దాదాపు 700 కోట్ల ప్రపంచ జనాభాలో 300 కోట్లకు పైగా ప్రజలు అడవులపై ఆధారపడి జీవిస్తున్నారు. అంతేకాక 80% జీవ వైవిధ్యం అడవులపైనే ఆధారపడి వుంది. జీవ వైవిధ్య సమతుల్యత సాధనలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్న అడవులు ఒకప్పుడు ప్రపంచంలో 3.4 కోట్ల చదరపు కిలోమీటర్లు విస్తరించి వుండగా ప్రస్తుతం అది సగానికి పడిపోయింది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత పరిశోధన సంస్థ ‘‘ది వరల్డ్ ‌రిసోర్సెస్‌ ఇనిస్టిట్యూట్‌’ ‌ప్రకారం భూమిపై 22 శాతం అడవులే మిగిలి ఉన్నాయి.
వనాలు కోత
ఏటా 1.6 కోట్ల హెక్టార్‌ అడవులు కోత కు గురవుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా 130 కోట్ల హెక్టార్ల అడవులు కనుమరుగవుతున్నాయి. అంతేకాక కొన్ని లక్షల ఎకరాల అడవులు కార్చిచ్చుకు గురై బూడిదయిపోతున్నాయి. ఫలితంగా అడవులతో ముడిపడిన విశిష్ట జీవ వైవిధ్య సంపద కనుమరుగైపోతున్నది.
తెలుగు రాష్ట్రాల్లో తగ్గుతున్న అటవీ సంపద
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్‌, ‌తెలంగాణల్లో పర్యావరణ శాతం తగ్గిపోతోంది. జాతీయ అటవీ విధానం ప్రకారం ఏదైనా రాష్ట్రాల్లో 33 శాతం పచ్చదనాన్ని కలిగి ఉండాలి. అయితే తెలంగాణ లో 25.16 శాతం చెట్లతో పచ్చదనం నిండి ఉండగా, ఆంధ్రప్రదేశ్‌ ‌లో కేవలం 22.62 శాతం మాత్రమే పచ్చదనం నిండి ఉంది.
ఇండియాలో అడవులు
భారతదేశంలో అడవులు 8,07,276 చదరపు కిలోమీటర్ల వరకు (మొత్తం భూభాగంలో 25శాతం వరకు) విస్తరించి ఉన్నాయి. అడవుల విస్తీర్ణాన్ని 2030 నాటికి 33 శాతానికి పెంచాలని అటవీ శాఖ నిర్దేశించుకుంది. దేశంలో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్‌ ‌టాప్‌లో ఉంది. ఆ తర్వాత అరుణాచల్‌ ‌ప్రదేశ్‌, ‌ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, మహారాష్ట్ర ఉన్నాయి. గత రెండేళ్లలో అటవీ విస్తీర్ణం పెరిగిన రాష్ట్రాల్లో కర్ణాటక (1,025 చ.కి.మీ.) ముందుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ (990 ‌చ.కి.మీ.), కేరళ (823 చ.కి.మీ.) ఉన్నాయి. ప్రపంచ భూభాగంలో ఇండియా విస్తీరణం 2.5%. కానీ ప్రపంచ జీవవైవిధ్యంలో 8 శాతం భారతదేశంలోనే ఉంది.
ప్రత్యేక చర్యలు అవసరం
అడవుల్లో సంభవిస్తున్న అగ్ని ప్రమాదాలతో విలువైన జాతుల అటవీ సంపదకు నష్టం వాటిల్లుతోంది. భారీ వృక్షాలు, అడవి జంతువులతో పాటు ఆయుర్వేద గుణాలున్న విలువైన మూలికా వృక్షాలు, మొక్కలకు చేటు కలుగుతోంది. ఈ నేపథ్యంలో అటవీ సంపదను కాపాడుకోకుంటే భవిష్యత్‌లో తీవ్ర పరిణాలు ఎదుర్కోవాల్సి ఉంటోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వృక్షాలు చేస్తున్న మేలు..
వృక్షాలను రక్షిస్తే అవి మనలను రక్షిస్తాయని పూర్వీకుల మాట. ఒక చెట్టు తన 50 ఏళ్ల జీవిత కాలంలో రూ.33 లక్షల విలువైన సంపదను అందిస్తుంది. ఒక ఏడాదిలో ఒకచెట్టు 12 కిలోగ్రాముల కార్బన్‌డై ఆక్సైడ్‌ను తీసుకొని నలుగురు సభ్యులుగల కుటుంబానికి సరిపడా ఆక్సిజన్‌ అం‌దిస్తుంది. 55 ఏళ్ల జీవిత కాలంలో ఒక చెట్టు 5.3 లక్షల విలువైన ఆక్సిజన్‌ను, 6.4 లక్షల విలువైన మట్టి కొట్టుకుపోకుండా కాపాడుతుంది. 10.50 లక్షల విలువైన చల్లదనాన్ని ఇవ్వనుంది.
6.4 లక్షల విలువైన సారాన్ని నేలకు అందిస్తోంది. మానవాళి మనుగడ పర్యావరణంపైనే ఆధారం. పర్యావరణాన్ని కాపాడుకుంటే భావితరానికి భవిష్యత్‌ ఉం‌టుంది. ఇటీవల చట్టాలు పటిష్టంగా అమలు పరుస్తుండటంతో అడవుల నరికివేత కొంత తగ్గింది. గ్రామీణ జనాభా అటవీ సంపదపై ఆధారపడి జీవించేవారు.ఇటీవల గ్రామీణ ప్రాంతాల్లోనూ విలాస వస్తువులు విస్తరిస్తుండటంతో అడవుల నష్టవాటిల్లుతోంది. అడవుల తగ్గుదల వర్షపాతంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
అడవుల ప్రాధాన్యత
ఆహారాన్ని, నీటిని, జంతువులకు ఆశ్రయం కల్పించడంలో, అడవులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
మొక్కలు ద్వారా మనకు లెక్కింప లేనంతగా పర్యావరణ, ఆర్థిక, సాంఘిక మరియు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఇప్పటికీ ప్రపంచ అటవీ నిర్మూలన ఆందోళనకరమైన స్థాయిలో కొనసాగుతోంది. కాబట్టి గ్లోబల్‌ ‌వార్మింగ్‌ ‌తగ్గాలన్నా, ప్రపంచం ఆరోగ్యంగా ఉండాలన్నా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మరిన్ని చెట్లను నాటాలి.అది ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తించాలి.
image.png
పిన్నింటి బాలాజీ రావు,
భౌతిక రసాయన శాస్త్ర
ఉపాధ్యాయుడు
హనుమకొండ., 9866776286

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page