గజ్వేల్‌లో కేసీఆర్ పోటీ చేయకుంటే…కట్టించిన బిల్డింగ్‌లకు సున్నాలు కూడా వేయలేరు
నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికీ పని చేసి పెట్టా..
గజ్వేల్ నియోజకవర్గ ముఖ్య నాయకులతో మంత్రి హరీష్‌రావు
సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 26: గజ్వేల్ ఎన్నిక అంటే చాలా ప్రాముఖ్యత కలదు. గజ్వేల్‌లో సిఎం కేసీఆర్ పోటీ చేయకుంటే…కేసీఆర్ కట్టించిన బిల్డింగ్‌లకు సున్నాలు కూడా వేసే వారు లేరని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. వొచ్చే అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని గురువారం గజ్వేల్ నియోజకవర్గంకు చెందిన బిఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో మంత్రి హరీష్‌రావు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ..ఎలక్షన్ వచ్చిందని ఎవరెవరో వస్తారు, ఏదేదో మాట్లాడుతారనీ, మభ్య పెడతారనీ వారిపట్ల జాగ్రత్తగా ఉండాలనీ, నవంబర్ 30తర్వాత ఎవరూ గజ్వేల్‌లో ఉండరన్నారు. ఒకప్పుడు గజ్వేల్ ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉంది అనేది మనం ఆలోచించాలనీ, కేసీఆర్ ఇక్కడ ఉండటం గజ్వేల్ ప్రజల అదృష్టం అన్నారు. వొచ్చే ఎన్నికల తర్వాత సిఎం కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గ ప్రజలతో నెలకు ఒక రోజు గడుపుతామనీ గొప్ప విషయం చెప్పారన్నారు. కోమటిబండ ప్రధానమంత్రి మోదీ వచ్చి మిషన్ భగీరథ ప్రారంభించడానికి వచ్చారంటే గజ్వేల్ నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ లేకుంటే అయ్యేదా అని ఆలోచించాలన్నారు. నేతలు అందరూ సమన్వయం, కష్టపడి కలిసి పని చేస్తే గజ్వేల్‌లో ప్రత్యర్ధి పార్టీలకు చెందిన అభ్యర్థులకు డిపాజిట్స్ కూడా దక్కవన్నారు. గజ్వేల్ ప్రజలు నియత్ గల్లోళ్లలనీ, కేసీఆర్ చేసిన మంచి పనులే వారినే గెలుపిస్తాయన్నారు. సిద్ధిపేట కంటే మంచి మెజార్టీ గజ్వేల్ ప్రజలు ఇవ్వాలని ఈ మెజారిటీ కోసం నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కేసీఆర్ కోసం పనిచేయాలనీ, సద్ది తిన్న రేవు తలవాలని సూచించారు. ఈసారి మీరు కచ్చితంగా కష్టపడి పని చేస్తే రెండు పార్టీల డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయం అన్నారు. మనం అందరం ప్రజా జీవితం గడుపుతున్నామనీ, నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి పని చేసి పెట్టాననీ, ఎటువంటి పైరవీలకు తావు లేకుండా మీరు చెప్పిన పనులన్నీ చేసి పెట్టానని గుర్తు చేశారు. వొచ్చే ఎన్నికల్లోనూ కేసీఆర్ సర్కార్ వందకు వంద శాతం వస్తుందనీ, ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని స్థానాలు కచ్చితంగా గెలుస్తామన్నారు. ప్రజలలో బిఆర్ఎస్ పార్టీకి మంచి పేరు ఉందనీ, దానిని ఆలోచించి వారికి సంక్షేమ పథకాలు వివరించి మనకు వోట్లు పడేలా చూసుకోవాలన్నారు. ప్రజలందరూ బిఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారనీ, రైతుబంధు డబ్బులు 69 లక్షల మందికి ఇస్తున్నామనీ, ఈసారి రైతుబంధు డబ్బులు పెంచుతామనీ సిఎం కేసీఆర్ చెప్పారనీ, ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. కరెంట్, ఎరువులు, చెరువులు అన్ని పనులు చేశామనీ, ఇప్పుడు ఏ ఊరిలో కూడా బోర్లు వేసే పరిస్థితి లేదన్నారు. కాలువలకు భూమి శిస్తూ, కరెంట్ బిల్లును రైతుల వద్ద నుండి వసూలు చేయడం లేదఆ్నరు. 29 లక్షల నుండి 47 లక్షల వరకు పెన్షన్లు పెంచామనీ, పెన్షన్లు ఈసారి 5వేల రూపాయలు ఇస్తామని కేసీఆర్ చెప్పారన్నారు. ఇంటికి పెద్ద కొడుకుగా కేసీఆర్ ఉన్నారనీ, రేషన్ కార్డు ద్వారా వచ్చే దొడ్డు బియ్యం లేకుండా వచ్చేసారి సన్నబియ్యం ఇస్తామని కేసీఆర్ చెప్పారన్నారు. కేసీఆర్ బీమా, రైతుబీమా ద్వారా 5లక్షల రూపాయలు ఇచ్చిన కేసీఆర్ రైతు పేరుమీద ప్రీమియం చెల్లించి రైతుబీమా పథకం తీసుకువచ్చారు. ఈసారి ఎటువంటి దరఖాస్తు లేకుండా మంచి పథకం తీసుకొస్తున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవరెడ్డి, ఎఫ్డిసి ఛైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పాతూరి, బిఆర్ఎస్ పార్టీ నాయకుడు వేలేటి రాధాకృష్ణశర్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, గజ్వేల్ ఏఎంసి ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్, ములుగు డివిజన్ ఆత్మ కమిటీ ఛైర్మన్ గూండా రంగారెడ్డితో పాటు నియోజకవర్గంకు చెందిన ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.