ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,అక్టోబర్ 2 : మధ్యాహ్న భోజన పథకం కార్మికులు తమ సమస్యలను పట్టించుకోకుండా మొండిగా వ్యవరిస్తున్న ప్రభుత్వానికి నిరసనగా మంచాల మండలంలో సమ్మె శిబిరంలో మహాత్మ గాంధీ జయంతి పురస్కరించుకొని గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి వారు సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ జిల్లా కార్యదర్శి ఏలమొని స్వప్న,సీఐటీయూ మండల కన్వీనర్ పోచమోని కృష్ణలు మాట్లాడుతూ,మధ్యాహ్న భోజన కార్మికులు ఆరు నెలలుగా బిల్లులు రాక సంవత్సర కాలంగా వేతనాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అప్పులు చేసి స్కూళ్లలో పేద పిల్లలకు వంటలు చేసి పెడుతున్నారని అన్నారు.ప్రభుత్వం మధ్యాహ్న భోజనం ఎక్కడలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుందని,నాణ్యమైన భోజనం పెట్టాలని హుకుం వేస్తుంది కానీ బిల్లులు ఇవ్వడంలొ విఫలం అవుతుందని తెలిపారు.గత రెండు సంవత్సరాల క్రితం కేసీఆర్ ప్రస్తుతం ఇస్తున్న వెయ్యి రూపాయలకు అదనంగా రెండు వేలు ఇస్తానని మొత్తం మూడు వేల జీతాన్ని ఇస్తానని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని,కానీ ఇప్పటివరకు జీతాలు కార్మికుల అకౌంట్లో పడ్డ పాపాన పోలేదన్నారు.నాలుగు నెలలకు ఐదు నెలలకు ఒకసారి మెస్‌చార్జీలు వేస్తున్న పరిస్థితి,పెరిగిన ధరలకు అనుగుణంగా మేస్చార్జీలు పెంచాలని వారు డిమాండ్ చేశారు.ప్రస్తుతం కోడుగుడ్డుకు ప్రభుత్వం ఐదు రూపాయలు ఇస్తుంటే మార్కెట్లో ఆరు రూపాయలకు ఒక గుడ్డు చొప్పున దొరుకుతుంది కావున వాళ్లు వంట చేసి పెడితే గుడ్ల బిల్లులు కార్మికుల మీద పడుతున్న పరిస్థితి కాబట్టి మధ్యాహ్న భోజన కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి ప్రభుత్వమే గుర్తింపు కార్డులు ఇవ్వాలని అన్నారు.మేస్చార్జీలు పెంచాలని కోడిగుడ్డు ధర ఏడు రూపాయలుగా ఇవ్వాలన్నారు.ఈఎస్ఐ,పీఎఫ్ సౌకర్యాన్ని కల్పించవలసిందిగా ప్రమాద భీమ 5 లక్షల ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ నాయకులు సి.హెచ్. సరిత,జి.అలివేలు,సంతోష,మధ్యాహ్న భోజన కార్మికులు శారద,జంగమ్మ, అలివేలు,పద్మ,భారతమ్మ,రాణి, యదమ్మ,లక్ష్మి,మశ్రు తదితరులు పాల్గొన్నారు.