నేడు దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ వర్ధంతి
ఆమె ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి. దేశభక్తు రాలిగా, సామాజిక సేవా తత్పరు రాలుగా … మరెవరూ చూపని ధైర్య సాహసాలను, ప్రజ్ఞను చూపి చరిత్రలో నిలిచి పోయారు. తెలుగు ప్రజలు గర్వించ దగిన ఉన్నత భావాలు కలిగిన మహోన్నత వ్యక్తి. వ్యక్తి మాత్రమే కాదు, ఒక వ్యవస్థ. మేధావిగా, న్యాయ కోవిదు రాలుగా, మానవతా వాదిగా, ఆంధ్ర మహిళాసభ వ్యవస్థాపకురాలిగా.. బహుముఖ ప్రజ్ఞను కనబరిచి చరిత్రపుటల్లో మహామనిషిగా నిలిచిన ఆ ఉక్కు మహిళ దుర్గాబాయ్ దేశ్ ముఖ్. ఒక బాలికగా జాతీయోద్యమానికి ప్రేరేపితురాలై, జాతిపిత, చాచా నెహ్రూ లాంటి జాతీయోద్యమ నేతల మన్ననలను అందు కున్నారు.
గాంధీజీ ఆంధ్ర రాష్ట్ర పర్యటనకు విరాళాల సేకరణ కోసం కాకినాడ వచ్చినపుడు ఆయన ప్రసంగాన్ని తెలుగులో చేసిన అనువాదానికి గాంధీజీ అభినందనలకు పాత్రు లైనారు. ఆ సందర్భంలో విరాళాలు సేకరించడమే కాక, మహాత్ముడు అడిగితే తన చేతి బంగారు గాజులు కూడా సమర్పించిన త్యాగమయి. కాకినాడలో 1923లో జరిగిన కాంగ్రెసు మహాసభలకు టికెట్టు లేకుండా వచ్చిన జవాహర్లాల్ నెహ్రూను అనుమతి లేదని వెనక్కి పంపిన ధీశాలి. దుర్గాబాయ్ చిన్ననాటి నుండే స్వాతంత్య్ర పోరాటంలో పాలుపంచు కున్నారు. తన 12 యేండ్ల వయసులో ఆంగ్ల విద్యపై పోరాటం చేశారు. ఆమె రాజమండ్రిలో బాలికలకు హిందీలో విద్యను అందించడానికి బాలికా హిందీ పాఠశాలను ప్రారంభించారు.
దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ మద్రాసు ప్రెసిడెన్సి (ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్) లోని రాజమండ్రిలో, 1909 జూలై 15 న సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రామారావు, కృష్ణవేణమ్మ దంపతులకు జన్మించారు. పది సంవత్సరాల వయస్సులోనే హిందీలో పాండిత్యాన్ని సంపాదించి, హిందీ పాఠశాలను నెలకొల్పి అన్ని వయసుల వారికీ విద్యాబోధన అందించారు. బెనారస్ విశ్వ విద్యాలయం నుండి మెట్రి క్యులేషన్, ఆంధ్ర విశ్వ విద్యాలయం నుండి ఎం.ఏ (పొలిటికల్ సైన్స్), 1942లో ఎల్. ఎల్.బి పూర్తిచేసింది. న్యాయశాస్త్ర చదువు పూర్తయ్యాక మద్రాసులో హైకోర్టులో సాధన ప్రారంభించారు. న్యాయ కోవిదురాలిగా, ప్రఖ్యాత క్రిమినల్ లాయర్‌గా పేరుగాంచారు.
ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు జైలు శిక్ష కూడా అనుభవించారు.
భారతదేశ రాజ్యాంగ సభ, ప్రణాళికా సంఘ సభ్యురాలు. ఆమె నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్ కు మొదటి చైర్ పర్సన్ గా వ్యవహరించారు.1953 ఆగస్టులో భారత ప్రభుత్వంచే నెలకొల్పబడిన కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డుకు వ్యవస్థాపక అధ్యక్షురాలిగా, ఢిల్లీలో బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్‌కు అధ్యక్షురాలిగా పని చేశారు.
ఆమెను భారతదేశంలో సోషల్ సర్వీస్ మదర్ గా పిలిచేవారు.
అనేక మహిళా సంస్థలు, సాంఘిక సంక్షేమ సంస్థలను ప్రారంభించి స్త్రీల అభ్యున్నతికి కృషిచేశారు. ఆమె ఆధ్వర్యంలో 1937లో చెన్నపట్నంలో (ప్రస్తుత చెన్నై లో) ఆంధ్ర మహిళా సభ స్థాపించ బడింది. హైదరాబాద్ లో ఆంధ్ర మహిళా సభను స్థాపించారు. ఇప్పటికీ పనిచేసే ఆసంస్థ పేరుతోనే ఆవీధిని పిలుస్తారు. అక్కడ వితంతువులకు,అనాధ స్త్రీలకు చదువు చెప్పించడం, రకరకాల పనులలో శిక్షణ ఇప్పించి వారి కాళ్ళమీద వారు నిలబడేటట్లుగా తయారు చేసేవారు. రాష్ట్ర మంతటా ఎన్నో కళాశాలలు, వసతిగృహాలు, నర్సింగ్ హోమ్‌లు, వృత్తి విద్యాకేంద్రాలు నెలకొల్పారు.
లిటిల్ లేడీస్ ఆఫ్ బృందావన్ అనే బాల సంఘాన్నికూడా స్థాపించారు. నర్సింగ్ కాలేజీ లను స్థాపించారు. ఆంధ్ర మహిళ పత్రికను స్థాపించి సంపాదకత్వం వహించారు.
1953 జనవరి 22న దేశ్‌ముఖ్ వివాహం దుర్గాబాయ్ తో జరిగింది. అది ద్వితీయ, అంతర్రాష్ట్ర, ఆదర్శ వివాహం అయినందున దేశంలో గొప్ప సంచలనం సృష్టించింది. వారి పెళ్లి పత్రంపై నెహ్రూ, ఆచార్య కృపలానీ దంపతులు సాక్షులుగా సంతకాలు చేశారు.
దుర్గాబాయ్తో వివాహం జరిగిన తర్వాత మొదటి జన్మదినాన్ని ఆయన తన ఇంట్లో చాలా నిరాడంబరంగా జరుపు కున్నారు. ఈ సంగతి నెహ్రూకు తెలిసి, తీరిక చేసుకొని నెహ్రూ వాళ్ల ఇంటికి వెళ్లారట. ‘ఏం దుర్గాబాయ్! దేశ్‌ముఖ్ నీ భర్తే కావచ్చు.. నా క్యాబినెట్ మంత్రి సుమా!’ అని చమత్కరించారట. ఆ దంపతులు ఇచ్చిన టీ బిస్కెట్ తీసుకుని నెహ్రూ మందహాసంతో వెళ్లిపోయారట. ఇలాంటి ఆప్యాయత ఈ రోజుల్లో కనిపించడం బహు అరుదు.
1971లో సాక్షారతా భవన్ ని ప్రారంభించారు. ఆంధ్ర విశ్వ విద్యాలయం దుర్గాబాయికి 1971లో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. 1975లో భారత ప్రభుత్వం పద్మ విభూషణ పురస్కారంతో సత్కరించగా, అదే సంవత్సరం ఆయన సతీమణి దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ కూడా పద్మ విభూషణ్ పొందడం, భార్యా భర్తలు ఇద్దరూ ఒకే ఏడాది పురస్కార గ్రహీతలు కావడం విశేషం. ఆంధ్ర విశ్వ విద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్, 1971 – నెహ్రూ లిటరసీ అవార్డు (వయోజన విద్యాసేవలకు గుర్తింపుగా), యునెస్కో నుండి పాల్ జి. హాఫ్మన్ అవార్డు పొందారు.
అసమాన ప్రజ్ఞా పాటవాతో చిర కాలం గుర్తుండే కార్యక్రమాలకు పురుడు పోసిన దుర్గాబాయ్ 1981 మే 9వ తేదీన హైదరాబాదులో మరణించారు.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494