- ఇంగ్లీష్లోనే కోర్టు వ్యవహారాలు సరికాదు
- స్థానిక భాషలతోనే కోర్టులపై సామాన్యుల్లో విశ్వాసం
- న్యాయ సదస్సులో ప్రధాని మోడీ ఉద్ఘాటన
- చట్టాలు అమలయితే కోర్టుల జోక్యం ఉండదన్న జస్టిస్ ఎన్వీ రమణ
న్యూ దిల్లీ, ఏప్రిల్ 30 : న్యాయ భాష సామాన్యులకు అర్థమయ్యేలా ఉండాలని ప్రధాని మోదీ అన్నారు. కోర్టుల్లో న్యాయ వ్యవహారాలన్నీ ఇంగ్లిష్లోనే జరుగుతున్నాయని, అలాకాకుండా స్థానిక భాషలకు ప్రాధాన్యమివ్వాలని ప్రధాని సూచించారు. స్థానిక భాషలతో సామాన్యులకు న్యాయవ్యవస్థలపై విశ్వాసం పెరుగుతుందనన్నారు. దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరుగుతున్న సీజేలు, సీఎంల సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల సంయుక్త సదస్సు శనివారం విజ్ఞాన్ భనవ్లో జరిగిన సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజ్జూ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ప్రధాన సమస్యల పరిష్కారంలో న్యాయవ్యవస్థ పాత్ర కీలకమైనదని చెప్పారు. న్యాయవ్యవస్థ బలోపేతానికి మరిన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. సామాన్యులకు చట్టంలోని చిక్కులు కూడా తీవ్రమైన అంశమని చెప్పారు. సుప్రీమ్ కోర్టుతో పాటు హైకోర్టు, జిల్లా కోర్టులు బలోపేతమవ్వాలని ప్రధాని సూచించారు.
న్యాయవ్యవస్థలో ఖాళీలను భర్తీ చేస్తున్నామని వెల్లడించారు. అత్యాధునిక సాంకేతికత సాయంతో మరిన్ని సంస్కరణలు రావాలన్నారు. డిజిటల్ ప్రపంచంలో సాంకేతికత ప్రధాన వనరుగా మారిపోయిందని చెప్పారు. సీఎంలు, హైకోర్టు సీజేలు డిజిటల్ ఇండియా ప్రగతిలో కలిసిరావాలని కోరారు. దేశంలో డిజిటల్ లావాదేవీలు అసంభవమని చెప్పారు. కానీ నేడు దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా డిజిటల్ లావాదేవీలు నడుస్తున్నాయని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ లావాదేవీలు భారత్లోనే జరుగు తున్నాయన్నారు. న్యాయ వ్యవస్థ మౌలిక సదుపాయాలను కూడా డిజిటలైజ్ చేయాలని పేర్కొన్నారు. దేశంలో అసంబద్ధంగా మారిన సుమారు 1800 చట్టాలను గుర్తించామని, వాటిలో 1450 చట్టాలను రద్దుచేశామన్నారు. కానీ రాష్ట్రాలు మాత్రం 75 చట్టాలను మాత్రమే రద్దు చేశాయని వెల్లడించారు. అనవసరమైన చట్టాలను రద్దు చేయడంలో రాష్ట్రాలు కూడా కీలకంగా ఉండాలన్నారు. ఆరేండ్ల తర్వాత హైకోర్టు సీజేలు, సీఎంల సంయుక్త సమావేశం జరిగింది. ఈ సదస్సులో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం తరపున మంత్రి ఇంగ్రకరణ్ రెడ్డి హాజరయ్యారు.
అన్నీ చట్టానికి లోబడి జరిగితే..పరిపాలనా వ్యవస్థకు న్యాయవ్యవస్థ అడ్డు రాదు : చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ
ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ మాట్లాడుతూ…ప్రతి ఒక్కరూ తమ విధుల నిర్వహణలో లక్ష్మణ రేఖను గుర్తుంచుకుని పనిచేయాలని ఆయన సూచించారు. ఒకవేళ అన్నీ చట్టానికి లోబడే జరిగితే, అప్పుడు పరిపాలనా వ్యవస్థకు న్యాయవ్యవస్థ అడ్డురాదని ఎన్వీ రమణ అన్నారు. మున్సిపాల్టీలు, గ్రామ పంచాయితీలు సక్రమంగా డ్యూటీ నిర్వహిస్తే, పోలీసులు సరైన రీతిలో విచారణలు చేపడితే, అక్రమ కస్టడీ మరణాలను నిరోధిస్తే, అప్పుడు ప్రజలు కోర్టులకు వెళ్లాల్సిన అవసరం ఉండదని సీజే రమణ తెలిపారు. కోర్టులు ఇస్తున్న తీర్పును అనేక ఏండ్ల నుంచి ప్రభుత్వాలు అమలు చేయడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి హాని కలిగించే అంశాలపై కోర్టులు ఎన్ని తీర్పులు ఇచ్చినా.. కావాలనే ఆ తీర్పు అమలులో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. విధాన నిర్ణయాలు తమ పరిధిలోకి రావని, కానీ ఎవరైనా వ్యక్తి తమ వద్దకు ఫిర్యాదుతో వొస్తే, ఆ వ్యక్తిని కోర్టు తిరస్కరించదని ఎన్వీ రమణ తెలిపారు. ప్రజల ఆశయాలను, ఆందోళనలను అర్థం చేసుకుని, వాటినిపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత చట్టాలను చేయాలన్నారు. అధికారుల నిర్లక్ష్యం సహించేది లేదన్నారు. ప్రజా ప్రయోజన వాజ్యాలను.. వ్యక్తిగత వాజ్యాలుగా వాడుతున్నట్లు ఆరోపించారు. రాజకీయ, కార్పొరేట్ ప్రత్యర్థులను టార్గెట్ చేసేందుకు పిల్స్ వేస్తున్నారని రమణ విమర్శించారు.