ఎవరూ వద్దంటున్న ఆ పదవి రేవూరినే వరించనుందా ?
అవినీతి రహితుడిగా…వివాద రహితుడుగా స్పీకర్ పదవికి సమర్థుడని ప్రచారం
మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి
హైదరాబాద్, డిసెంబర్ 05 : తెలంగాణ శాసన సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు రోజుల వరకు సిఎం అభ్యర్థిపైన రాష్ట్ర స్థాయి నుండి దిల్లీ వరకు అనేక పరిణామాలు జరిగాయి. అయితే ముఖ్యమంత్రితో పాటు మిగతా పదవుల విషయంలో కూడా నాయకులు తీవ్రంగా పోటీ పడుతున్నప్పటికీ స్పీకర్ విషయంలో మాత్రం ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలువక ముందు నుండి కూడా ఆ పార్టీ బడానేతలు దాదాపు పది మందివరకు ఎవరికి వారే తామే సీనియర్ నేతలమని, సిఎం పదవికి అర్హులమని చెప్పుకుంటూ వొచ్చారు. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా జానారెడ్డి లాంటి నేతలుకూడా తమకే ఆ అవకాశం లభిస్తుందన్న ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. కాగా రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ ఇవ్వడంతో ఆ పదవి కోసం రెండు రోజుల పాటు రాష్ట్ర స్థాయి నుండి, దిల్లీ అదిష్టానం వరకు విడుత వారీగా సమాలోచనలు జరిగాయి. సిఎం పదవితో పాటు ముఖ్యమైన మంత్రి పదవులు, పార్టీ అధ్యక్షుడు, స్పీకర్ పదవులకు ఎవరిని ఎన్నుకోవాలన్న దానిపైన కూడా చర్చలు కొనసాగుతూ వొచ్చాయి. అయితే మిగతా పదవుల విషయం ఎలా ఉన్నా స్పీకర్ విషయంలో మాత్రం పెద్దగా పోటీలేక పోవడం గమనార్హం. స్పీకర్‌గా ఉంటే పబ్లిక్‌తో సంబంధాలు సన్నగిల్లి పోతాయన్నది ఒకటి కాగా, స్పీకర్ పదవి తీసుకున్నవారు ఆ తర్వాత ఎన్నికల్లో గెలువక పోవడమన్నది సంప్రదాయంగా మారటంతో ఆ పదవి పట్ల నాయకుల్లో భయం ఏర్పడింది. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆ సంప్రదాయ ఆనవాయితీకి బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మంగళం పాడారు. ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ ఆయన బాన్సువాడ నియోజకవర్గం నుంచి ఎన్నికైనారు. అయినప్పటికీ కాంగ్రెస్ ఎంఎల్‌ఏలు ఆ పదవిని అలంకరించేందుకు వెనుకాడుతుండగా, అందుకు పరకాల ఎంఎల్‌ఏ రేవూరి ప్రకాశ్‌రెడ్డి సమర్థుడన్న ప్రచారం జరుగుతున్నది. ప్రకాశ్‌రెడ్డి దాదాపు మూడు దశాబ్ధాలుగా రాజకీయాల్లో ఉన్నవ్యక్తి. అన్నిటికీ మించి వివాహరహితుడిగా, ముక్కుసూటిగా వెళ్తాడన్న పేరుండడంతో ఆయనైతే స్పీకర్ పదవికి న్యాయం చేస్తారనుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముప్పై ఏండ్లుగా కీలక నేతగా ప్రజల మన్ననలను పొందిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. 1994లో నర్సంపేట శాసనసభ్యుడిగా టిడిపి పార్టీ నుండి నెగ్గినప్పటి నుండి ఆయన ఆ నియోజకవర్గ రూపురేకలనే మార్చారు. ఆనాడు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడికి సన్నిహితుడిగా తన నియోజకవర్గానికి అధిక నిధులను తెచ్చుకుని, అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. అయన రాజకీయ జీవితంలో ఎక్కడ అవినీతి మరక అంటనివ్వలేదు. తర్వాత 1999, 2009 ఎన్నికల్లో టిడిపి నుండి మరో రెండుసార్లు ఎన్నికైన రేవూరి వివిధ కమిటీలకు చేర్మన్‌గా తనవంతు సేవలు అందించిన వ్యక్తి. ఆనాడు ఎంతో వివాదస్పదంగా మారిన 610 జివోపై టిడిపి వేసిన కమిటీకీ చేర్మన్‌గా, విద్యుత్ కమిటీ చేర్మన్‌గా కొనసాగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా టిడిపి పక్షాన రెండు ఎన్నికల్లో(2014, 2018) పోటీచేసి ఓటమి చవిచూడాల్సి వొచ్చింది. తెలంగాణలో తెలుగు దేశం పార్టీ కనుమరుగు కావడంతో ఆయన 2019 సెప్టెంబర్ 4న బిజెపిలో చేరారు. అయినా నర్సంపేటను వీడకుండా ఆ పార్టీ పక్షాన మరోసారి పోటీకి సిద్ధమవుతున్న తనకు ఆ అవకాశం లభించడం లేదని గ్రహించి, 2023 అక్టోబర్ 18న కాంగ్రెస్‌లో చేరడమైంది. బిఆర్‌ఎస్ నుండి కాంగ్రెస్‌లోకి మారిన తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిల ప్రోద్భలంతో తాజా ఎన్నికల ప్రచారంలో భాగంగా ములుగులో నిర్వహించిన విజయభేరి సభలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువ కప్పుకున్న వెంటనే ఆయనకు పరకాల నియోజకవర్గం నుండీ పోటీ చేసేందుకు టికెట్ లభించడం, అప్పటి వరకు అక్కడ తిరుగులేని నాయకుడిగా ఉన్న చల్లా ధర్మారెడ్డిపై ఆయన విజయం సాధించారు.
జయశంకర్ పుట్టిన జిల్లాకు ప్రాధాన్యం..
తాజా ఎన్నికల ప్రచారంలో భాగంగా పరకాల సభలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్• డ్డి అన్న మాటలను రేవూరి అభిమానులు గుర్తు చేస్తున్నారు. నాలుగు విడుతల తెలంగాణ ఉద్యమ నేతగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్‌సార్ పుట్టిన పరకాల నుండి గెలిచిన శాసన సభ్యుడికి కాంగ్రెస్ ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యత ఇస్తామన్న మాటలను వారు గుర్తు చేస్తున్నారు. అంతే కాదు ఈ జిల్లా అభివృద్ధికి ప్రత్యేక నిధులను కూడా కేటాయిస్తామని ఆయన చెప్పిన విషయాన్ని ఎత్తి చూపుతున్నారు. అంతేగాక రేవూరి ప్రకాశ్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి అతి సన్నిహితుడు కూడా. తెలుగుదేశం పార్టీలో సహచరులే కాకుండా రేవంత్‌రెడ్డికి కన్నా సీనియర్. పరకాల ప్రచార సభలో రేవూరి తనకు పెద్దన్నలాంటి వాడని, మచ్చలేని నాయకుడని, నియోజకవర్గ ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకుంటాడంటూ రేవంత్‌రెడ్డి పేర్కొనడాన్ని బట్టి సౌమ్యుడిగా, అందరినీ కలుపుకుని పోయే స్వభావంగల రేవూరికి స్పీకర్ పదవి ఇవ్వడం న్యాయంగా ఉంటుందంటున్నారు. నిజంగానే రేవూరికి స్పీకర్ పదవి ఇస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాకు రెండవ సారి ఈ పదవి దక్కినట్లు అవుతుంది. తెలంగాణ ఏర్పడిన మొదటి సభలో సిరికొండ మధుసూదనాచారి స్పీకర్‌గా కొనసాగిన విషయం తెలియంది కాదు. అదే విధంగా సీతక్కకు ఉప ముఖ్యమంత్రి పదవి లభిస్తే జిల్లాకు ఆ పదవి మూడవసారి దక్కినట్లు అవుతుంది.