స్వరాష్ట్రంలో సుపరిపాలన ….

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు..
సుపరిపాలన దినోత్సవం జూన్‌ 10 ‌సందర్భంగా…

33 జిల్లాలు… 74 రెవెన్యూ డివిజన్స్ …612 ‌మండలాలు…
ప్రభుత్వ పథకాలు సమర్ధవంతంగా అమలు….
సుపరిపాలనలో ఎన్నో అవార్డులు… రివార్డులు….

ప్రభుత్వ పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం అత్యంత సాహసోపేతంగా పరిపాలనా సంస్కరణలు అమలు చేసింది. ఏకకాలంలోనే పరిపాలనా విభాగాల పునర్విభజన చేపట్టింది. కొత్త పరిపాలనా విభాగాలను కూడా ఏర్పాటు చేసింది.

కొత్త జిల్లాల ఏర్పాటు
2016 అక్టోబర్‌ ‌కు ముందు తెలంగాణలో 10 జిల్లాలుండేవి. ఒక్కో జిల్లాలో సగటున 35 లక్షలకు పైగా జనాభా ఉంది. దీనివల్ల పరిపాలన కష్టతరమయ్యేది. కొన్నిచోట్ల జిల్లా కేంద్రాలకు, కార్యాలయాలకు పోవాలంటె 200 నుంచి 250 కి.మీ.ల దూరం వుండేది. దీంతో జిల్లా కేంద్రాల అధికారులు గ్రామాలకు పోవాలన్నా, ప్రజలు జిల్లా కేంద్రాలకు వెళ్లాలన్నా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. జిల్లాలో కుటుంబాల సంఖ్య 10 లక్షలుండేది. దీంతో ఎవరి పరిస్థితి ఏంటో తెలుసుకోవడం అధికారులకు కష్టం అయ్యేది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ కష్టం అయ్యేది. దీంతో అధికారులకు ప్రజల సమస్యలపై దృష్టి కేంద్రీకరించడం కష్టంగా వుండేది. ఈ సమస్యలను అధిగమించటానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చట్టం-1974 ప్రకారం తెలంగాణలో మరో 23 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి, జిల్లాల సంఖ్యను 33 వరకు పెంచింది. దీంతో చిన్న పరిపాలనా విభాగాలతో సమర్దవంతమైన పాలన జరుగుతున్నది. కొత్త జిల్లాలను 2016 అక్టోబర్‌ 11‌న ప్రారంభించారు. రెవెన్యూ డివిజన్ల సంఖ్యను 43 నుంచి 74 వరకు, మండలాల సంఖ్యను 459 నుంచి 612 వరకు, గ్రామ పంచాయతీల సంఖ్యను 12,769 వరకు పెంచింది.
నూతన జిల్లాల ఏర్పాటుతో పరిపాలనా సౌలభ్యం, ప్రయోజనాలు:
ప్రభుత్వ శాఖలన్నింటి నూతన విభాగాలను ఆ జిల్లాల్లో ప్రభుత్వం ఏర్పరిచింది. దీంతో ప్రజలు గంట సేపట్లోనే తమ జిల్లాలోని ఏ ప్రదేశానికైనా వెళ్లే అవకాశం కలిగింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు, పర్యవేక్షణ అధికారులకు సులువవుతున్నది. స్థానిక పరిస్థితులు, వనరులు, ప్రత్యేకతలు, ప్రజల అవసరాలు, సామాజిక స్థితిగతులపై అధికారులకు పూర్తి అవగాహన కలుగుతున్నది. స్థానిక వనరులను గుర్తించి, అభివృద్ధి నమూనాల రూపకల్పన చేయడం సులువవుతుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే కొన్ని కార్యక్రమాలను కూడా జిల్లా యూనిట్‌ ‌గానే నిర్వహిస్తారు. దీని వల్ల ఎక్కువ జిల్లాలున్న రాష్ట్రాలకు మేలు కలుగుతుంది.

కొన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను జిల్లా కేంద్రాల్లో పెడతారు. ఒక్కో జిల్లా కలెక్టర్‌ ‌పరిధిలో రెండు, మూడు లక్షల కుటుంబాలు మాత్రమే వుండడం వల్ల పేదరిక నిర్మూలన కార్యక్రమాలు చేపట్టడానికి  వీలవుతున్నది.రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఏజన్సీ, అటవీ ప్రాంతాలు వున్నాయి. అటవీ రక్షణ, గిరిజనుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేయడం అధికారులకు సులువవుతుంది. కొన్ని జిల్లాల్లో ఎస్సీ జనాభా ఎక్కువ వుంది. అక్కడ ఎస్సీల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. పట్టణ ప్రాంత అవసరాలకు తగ్గ కార్యక్రమాలు చేస్తున్నారు. ముస్లిం, మైనారిటీలపై ఎక్కువ దృష్టి పెట్టడానికి వీలవుతున్నది. అటవీ శాతం తక్కువ వున్న జిల్లాల్లో పర్యావరణ సమతుల్యానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతున్నది.  ఉత్సాహవంతులైన యువ కలెక్టర్లను కొత్త జిల్లాలకు కేటాయించడంతో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయి. పోలీసు కమిషనరేట్ల పరిధి, పోలీస్టేషన్ల పరిధి తగ్గడం వల్ల నేర నియంత్రణ, నేర పరిశోధన సులువైంది. నేరం జరిగిన ప్రాంతానికి పోలీసుల త్వరగా చేరుకోగలుగుతున్నారు.

  – స్పెషల్‌ ‌కమిషనర్‌, ‌సమాచార పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్‌ ‌వారిచే జారీ చేయనైనది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page