నేడు జాతీయ కుటుంబ సౌహార్ద్ర దినోత్సవం
కుటుంబం అనగా ఒకే గృహంలో నివసించే కొంత మంది మానవుల సమూహం. వీరు సాధారణంగా పుట్టుకతో లేదా వివాహముతో సంబంధమున్నవారు. సమాజంలో వివిధ మతపరమైన వివాహ చట్టాలు కుటుంబ వ్యవస్థను గుర్తించాయి. ‘‘రక్త సంబంధము, సహచరత్వము, ఒకే నివాసం అంశాల విషయంలో కుటుంబ నైతిక, సామాజిక సూత్రాలు కుటుంబ సమైక్యత, సంఘటితం గురించి ప్రజలందరికీ అవగాహన కలిగించడం, జాతీయ అంతర్జా తీయ స్థాయిలో సుస్థిర కుటుంబాలకు దోహదం చేయడం, నైపుణ్యాన్నీ, అనుభవాలను, సామాజిక విలువలను పరస్పరం పంచుకుంటూ కుటుంబ సమస్యల విషయంలో సరైన సమాచారాన్ని, సహకారాన్ని అందించడం, కుటుంబాలలో నెలకొన్న విభేదాలను తొలగించి ఆయా కుటుంబాలలో సుఖశాంతులు నెలకొల్పడం వంటి లక్ష్యాలతో నవంబర్ 12ను జాతీయ కుటుంబ సౌహార్ద్ర దినోత్సవంగా జరుపు కుంటారు.
భారతీయ సంస్కృతికి, సంప్రదాయాలకు, నాగరికత పురోగతికి మూలమైనది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. నాగరికత విస్తరణకు పూర్వమే మనదేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉందని వివిధ గ్రంథాలలో పొందు పరచబడి ఉంది. నాగరి ప్రపంచంలోనూ మన దేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మూడుపువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లింది. ప్రాచీన కాలం నుండి ఉమ్మడి కుటుంబాలు సిరి సంపదలతో తూల తూగాయ నడంలో సందేహం లేదు. ఒక కుటుంబంలో తాత మొదలు వారి పిల్లలు వారి పిల్లలు ఇలా మూడు నుంచి నాలుగు తరాలు ఉమ్మడి అనే గొడుగు కింద ఒదిగి పోయేవి. ఇంటి లోని పెద్దకు అందరూ గౌరవం ఇవ్వాల్సిందే. ఆయన మాటే వేదవాక్కు. అందరిదీ ఉమ్మడి వ్యవసాయమే. సమష్టి సంపదనే, సమష్టి భోజనాలే ఉండే వంటే ఆత్మీయత అనురాగం, ఉట్టి పడేలా చేసేవి. తల్లిదండ్రులు, అత్త మామలు, అక్క చెల్లెళ్లు, అన్నదమ్ములు, బావా మరదళ్లు, బంధు మిత్రులు, తాతలు, బామ్మలు, మనవలు, మనవ రాండ్రతో కళకళలాడే ఉమ్మడి కుటుంబాలు సిరి సంపదల నిలయాలు. పిల్లలు చిన్న వయస్సులో ఉన్నపుడు తల్లిదండ్రుల చెంతనే ఉంటారు.
వారు పెద్దవారై పెళ్ళిళ్ళు అయిపోతే ఎవరి కుటుంబాలు వారివే. అంటే ఒక కుటుంబం నుంచి మరిన్ని కుటుంబాలు ఉదయిస్తాయి. ఒక కుటుంబం మరెన్ని కుటుంబాలను సృష్టించినప్పటికీ వంశవృక్షపు వేళ్ల మూలాలు మాత్రం మొదటి కుటుంబంను అల్లుకునే ఉంటాయి. అందుకే సంవత్సరంలో ఒక రోజైనా అందరూ కలుసు కోవాలని సరదాగా గడపాలని కోరుకోవడం అత్యంత సహజం. ఆధునిక యుగంలో ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ ఒకరినొకరు పలుక రించుకునే సమయం చిక్కని కుటుంబాలు ఎన్నో.విదేశీ పాలకుల పాలనలో ఉమ్మడి కుటుంబాలుగా చెలామణి అయిన ఎన్నో కుటుంబాలు నవనాగరిక ప్రపంచంలో విచ్ఛిన్న మయ్యాయి. ఆధునికత పెరగడం, నాగరికత పురోభివృద్ధి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వెరసి ఉమ్మడి వ్యవస్థ మీదా తీవ్ర ప్రభావాన్ని చూపింది. నవ నాగరిక ప్రపంచంలో రెండు కుటుంబాలు కాదు కదా రెండు మనసులు కూడా కలసి జీవించ లేని పరిస్థితి నెలకొంది.
ఆధునిక యుగంలో ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ ఒకరినొకరు పలుకరించుకునే సమయం చిక్కని కుటుంబాలు ఎన్నో. కేవలం ఫోన్ లోనో, మొబైల్ లోనో యోగ క్షేమాలు కనుక్కునే కుటుంబాలు కూడా లేకపోలేదు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలకు మనదేశం పుట్టి ల్లు. ఇప్పుడు ఆ సంస్కృతి భూతద్దం పెట్టి వెతికినా దొరకదంటే అతిశయోక్తి కాదు. అనేక కుటుం బాలు వ్యక్తిగత కారణాలతో విచ్ఛిన్నం కావడం మనం రోజూ చూస్తూ ఉన్నదే. అయినప్పటికీ మన దేశంలో అనేక కుటుంబాల మధ్య కనిపించే అన్యోన్యతా భావం మరే దేశంలోనూ కనిపించదు. డబ్బు సంపాదన కోసం కనీసం భార్యభర్తలు కూడా ఒక చోట కూర్చుని ఒకరినొకరు పలక రించుకునే సమయం చిక్కడం లేదంటే కుటుంబాలు ఎంతగా విచ్ఛిన్న మయ్యాయో అర్థం చేసు కోవచ్చు. ఉమ్మడి కుటుంబాలలో కలిసి మెలిసి మనగలిగే మనస్తత్వాలు లోపించి పెళ్లయిన మరు నాడే వేరు కాపురాలు పెట్టుకుని జంటలుగా ఒంటరై పోతున్నారు. దీంతో సలహాలిచ్చే పెద్ద దిక్కులు లేకపోవడం, ఆపదలో ఆదుకునే ఆత్మీ యులు దూరం కావడం, కనీసం మనసు లోని బాధలను పంచుకునే బంధువులు కరువవ్వడం నేటి సమాజంలో మనకు నిత్యం కనిపించే దృశ్యం.
కుటుంబ దౌర్జన్యం చట్టం 498-ఎను దుర్వినియోగం చేయడం ద్వారా కొందరు భార్యలు, భర్తలతో పాటు వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు బనాయించి వారిని వేధింపులకు గురి చేస్తున్నారు. బోగస్ వరకట్న కేసులు బనాయించడం ద్వారా దేశవ్యాప్తంగా 57 వేల మంది పురుషులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే పురుషులు వివాహం చేసుకోవడానికి వెనుకంజ వేసే పరిస్థితి వస్తుంది. భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న విభేదాలు న్యాయస్థానం వెలుపలనే పరిష్కరించు కోవడం సముచితంగా ఉంటుందని నవంబరు 12 ను జాతీయ కుటుంబ సౌహార్ద్ర దినోత్సవంగా జరుపు కోవాలని నిర్ణయించారు.
– రామ కిష్టయ్య సంగన భట్ల….
9440595494