హరిత షాపింగ్‌తో పర్యావరణ పరిరక్షణ!

అంతర్జాల ఆవిష్కరణతో భూమి కుగ్రామంగా మారింది. క్రెడిట్‌ కార్డులు, ఆన్‌లైన్‌ షాపింగ్స్‌, అమెజాన్‌/ఫ్లిప్‌కార్ట్‌ షాపింగ్‌ ఆర్డర్స్‌, పండుగ డిస్కౌంట్స్‌, ఆకర్షణీయ ఆఫర్లు, ఒకటి కొంటే రెండు ఉచితాలు లాంటి వ్యాపార జిమ్మిక్కులతో అనాలోచిత వినియోగదారులు తెలియకుండానే పర్యావరణానికి తీవ్రమైన విఘాతం కలిగిస్తున్నారు. ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌ ఆర్డర్ల ద్వారా బండెడు అవసర/అనవసర వస్తువుల కొనుగోళ్లు చేస్తూ కాలర్లు ఎగిరేస్తున్నాం. క్రెడిట్‌ కార్డులు గీకి అవసరం లేని వస్తువులను గుట్టలు గుట్టలుగా కొంటూ ఇంటిని చెత్త బుట్ట చేస్తున్నాం. ఆఫర్ల వలలో చిక్కి చవకైన వస్తువులను కొని కొద్ది రోజులకే బయట పడేస్తూ వ్యర్థాల గుట్టలను పెంచుతున్నాం. మెగా మాల్స్‌లోకి వెళ్లి విద్యుత్‌ వెలుగుల్లో ఒకటి కొనడానికి వెళ్లి 10 ప్రాధాన్యం లేని వినియోగ వస్తువులను కొంటున్నాం. పెద్ద పెద్ద మాల్స్‌ లోపల వెంటిలేషన్‌ సక్రమంగా లేనందున గాలి కలుషితం అవుతూ అనారోగ్యాల పాలవుతున్నాయి. టైంపాస్‌ షాపింగ్‌తో వాహన కాలుష్యం, ట్రాఫిక్‌ రద్దీ పెంచుతున్నాం. మనం చేసే ప్రతి షాపింగ్‌ వెనక పర్యావరణానికి ముప్పు అంటగడుతున్నాం. షాపింగ్‌ చేసిన నాలుగు వస్తువులకు నాలుగు ప్లాస్టిక్‌ కవర్స్‌ డిమాండ్‌ చేస్తూ భూమాత ఒడిని గరళ ప్లాస్టిక్‌తో నింపుతున్నాం. షాపింగ్‌ చేసే ముందు అత్యవసర సరుకులు లేదా ఐటమ్స్‌ లిస్టులను విచక్షణతో తయారు చేసుకోలేక పోతున్నాం.

అందమైన ప్యాకేజీల్లో కనిపిస్తున్న అనవసర వస్తువులను ఆప్యాయంగా తెచ్చుకుంటున్నాం. వ్యాపార ప్రకటనలే మనల్ని దుకాణం వరకు లేదా ఆన్‌లైన్‌ ఆర్డర్ల వరకు తీసుకెళుతున్నాయి. న్యూ ఇయర్‌, క్రిస్‌మస్‌, దీపావళి, దసరా, సంక్రాంతి లాంటి పర్వదినాల్లో కంపెనీలు, వ్యాపార దిగ్గజాలు, దుకాణాదారులు పలు అసంబద్ధ ఆఫర్లతో వినియోగదారులను బుట్టలో వేసుకుంటున్నారు. అనవసర వస్తువులు, ఆహార పదార్థాలు, వస్త్రాలు కొంటూ డబ్బును వృధా చేయడమే కాకుండా పర్యావరణ కాలుష్యానికి ఊతం ఇస్తున్నాం. దుస్తులు ఖరీదు చేయడానికి ముందే మన అవసరాలను బేరీజు వేసుకుందాం. తక్కువ ధర లేదా ఆఫర్లలో కొన్న బట్టలు రెండుసార్లు వాడిన తర్వాత బయట పడేస్తూ తేలికగా తీసుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా అవసరం కన్న 60 శాతం అధికంగా దుస్తులను కొంటున్నట్లు తేల్చారు. వస్తు రవాణారంగ కాలుష్యం 29 శాతం ఉంటున్నది. 2030 నాటికి వస్తు రవాణాకు మాత్రమే 36 శాతం వాహనాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఆర్డర్‌ చేసిన లేదా వండిన వంటల్లో 30 – 40 శాతం వరకు వ్యర్థం చేస్తూ డస్ట్‌బిన్‌లో వేస్తున్నాం. కాలక్రమంలో కొత్త కొత్త వస్తువులను తయారు చేస్తున్నారు, అమ్ముతున్నారు. సాలీనా 70 మిలియన్ల ప్లాస్టిక్‌ బాటిల్స్‌ను బయట పడేస్తున్నాం. ఒక జత జీన్స్‌ తయారీకి 998 గ్యాలన్ల నీటిని వాడుతున్నాం. ఫ్యాషన్‌ ఇండస్ట్రీతో 10 శాతం కార్బన్‌ ఉద్గారాలు పెరుగుతున్నాయి.లాండ్రీల ద్వారా మిలియన్ల మైక్రో ఫైబర్లను విడుదల చేస్తున్నాం. వాడదగిన వస్త్రాలను సహితం బయట పడేస్తూ కాలుష్యానికి కారణం అవుతున్నాం. వస్త్ర పరిశ్రమలు 10 – 20 శాతం పెస్టిసైడ్స్‌ను వాడుతున్నారు. ఏడాదికి 80 మిలియన్లకు పైగా ప్యాకేజ్‌ వస్తువులను చెత్తలో వేస్తున్నాం. అవసరం లేకపోయినా ఆకర్షణీయ ప్లాస్టిక్‌ వస్తువులను కొని వాడకుండా చెత్త బుట్టలో వేస్తూ వందల ఏండ్ల నేల/జల కాలుష్యానికి కారణం అవుతున్నాం. పర్యావరణ హిత సంచులను డిమాండ్‌ చేయడం లేదు, స్వంత బ్యాగులను తీసుకుపోవడానికి అలవాటు పడడం లేదు. హరిత షాపింగ్‌ చేయాలనే ఆలోచన కూడా రావడం లేదు.

కొనుగోలుతో ముడిపడిన కార్బన్‌ కాలుష్యం
మనం కొనుగోలు చేస్తున్న ప్రతి వస్తువు వెనక కార్బన్‌ కాలుష్యం ఇమిడి ఉంది. నాణ్యతలేని చవక వస్తువులను కొనుగోలు చేస్తూ ధరణిని చెత్తబుట్టగా చేస్తున్నాం. వస్తువులు/సరుకులు దుకాణానికి చేరడానికి రవాణా రూపంలో కార్బన్‌ ఉద్గారాలను గాలితోకి వదులుతున్నాం. నాణ్యమైన, అత్యవసరమైన షాపింగ్‌ను మాత్రమే చేయడం ద్వారా వ్యర్థాల గుట్టలు ఇంట్లో/నేలలో/నీటిలో తగ్గించడానికి ప్రయత్నం చేద్దాం. హరిత షాపింగ్‌ కళను నేర్చుకుంటూ డబ్బు ఆదా చేయడం, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి కృషి చేద్దాం, అవగాహన కూడా కల్పిద్దాం. నిషేధిత ప్లాస్టిక్‌ లేదా పాలిథీన్‌ కవర్స్‌ను వాడవద్దు, వాడిన వారిని వదలవద్దు. మినరల్‌ వాటర్‌ బాటిల్స్‌, చాకొలేట్‌ లేదా తినుబండారాల ప్యాకేజీలు, స్టేషనరీ, సిథటిక్‌ వస్త్రాలు, లగ్జరీ ఐటమ్స్‌, సాండల్స్‌, రెడీమేడ్‌ దుస్తులు, బ్యాగులు, అలంకార వస్తువులు వంటి వస్తువుల కొనుగోలు విషయంలో బాధ్యతగల పౌరులుగా నడుచుకొందాం.

తెలివైన హరిత షాపింగ్‌..
వస్తువుల రవాణా, షిప్పింగ్‌, ఆన్‌లైన్‌ గూడ్స్‌ డెలివరీ రంగాల ద్వారా ప్రతి ఏట 4 శాతం ఉద్గారాలకు కారణం అవుతున్నది. రవాణారంగంలో శిలాజ ఇంధనాల వాడకంతో పర్యావరణానికి, ముఖ్యంగా గాలి కాలుషితం అవుతుందని మరువరాదు. వస్తువుల తయారీలో పరిశ్రమలు అతి ప్రధానమైన విద్యుత్‌, చమురు, నీరు లాంటి వనరులను వాడతారని మరువరాదు. పండుగ సీజన్లలో 25 శాతం వ్యర్థాలు పుట్టుకొస్తున్నాయి. 241 మిలియన్‌ టన్నుల ప్యాకేజ్‌ కార్టన్స్‌ తయారీకి 3 బిలియన్ల చెట్లను నరుకుతున్నాం. ప్యాకేజ్‌ పరిశ్రమతో కార్బన్‌-డై- ఆక్సైడ్‌ ఉద్గారాలను పెరుగుతూ భూతాప మంటలకు ఆజ్యం పోస్తున్నాం. ప్రతి ఏట తయారు చేయబడే 86 మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌లో కనీసం 14 శాతం కూడా రీసైక్లింగ్‌ చేయడం లేదు. షాపింగ్‌ చేయుటకు పరిమిత బడ్జెట్‌ కేటాయిద్దాం. స్థానిక ఉత్పత్తులను కొందాం. సెకండ్‌ హాండ్‌ షాపింగ్‌ను ప్రోత్సహిద్దాం. మనకు అక్కరలేని వస్తువులను పేదలకు పంచుదాం. ప్లాస్టిక్‌కు బదులు క్లాత్‌ డైపర్స్‌ వాడుదాం. కొనే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచిద్దాం. బాధ్యతతో అత్యవసరాలను మాత్రమే ఖరీదు చేద్దాం. రీసైక్లింగ్‌ చేయగల వస్తువులను మాత్రమే కొందాం. మన డబ్బును విచక్షణతో ఖర్చు చేద్దాం. వ్యర్థాలను బయట పడేయడమంటే డబ్బును చెత్తలో వేయడమే అని గుర్తుంచుకోవాలి. డబ్బు మనది, భూమి మనది, గాలి/నేల/జలం మనది, మొత్తంగా పర్యావరణమే మనది. అలాంటి పర్యావరణాన్ని అడుగడుగున కాపాడాల్సిన కనీస ధర్మం ప్రతి పౌరుడిది. అందరం చేయి చేయి కలిపితేనే పర్యావరణ పరిరక్షణకు మానవ హారం సాధ్యపడుతుంది. హరిత షాపింగ్‌ చేస్తూ తెలివైన వినియోగదారుడిగా రుజువు చేసుతుందాం.

-బిఎంఎస్‌రెడ్డి
9949700037

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page