వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

‌నాడూ, నేడూ..ట్యాంక్‌బండ్‌ ఉద్యమాల ల్యాండ్‌మార్క్

November 9, 2019

‌తెలంగాణ వస్తే ఏమొస్తదన్న ప్రశ్న పద్నాలుగేళ్ళ ఉద్యమకాలంలో ప్రధాన చర్చనీయాంశంగా ఉండింది. తెలంగాణ వొచ్చినా ఏమీ రాలేదన్నది ఇప్పుడు తెలంగాణవాదుల్లో నలుగుతున్న మాట. నాటి సీమాంధ్ర పాలనకూ, నేటి స్వరాష్ట్ర పాలనకు ఏమాత్రం తేడా లేదనడానికి ట్యాంక్‌బండే ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. నేటికి సరిగ్గా ఎనిమిదేళ్ళ కింద 2011 మార్చ్ ‌పదవ తేదీన తెలంగాణ జెఏసి ఇచ్చిన మిలియన్‌ ‌మార్చ్ ‌పిలుపుకు ఈ ట్యాంక్‌ ‌బండే ప్రత్యక్ష సాక్షి. ఉవ్వెత్తున లేచిన నాటి ఉద్యమంలో భాగంగా లక్షలాది మంది ట్యాంక్‌బండ్‌కు తరలివొస్తుంటే ఆ నాటి పాలకులు, దాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ఎన్ని ప్రయత్నాలైతే చేశారో, ఇవ్వాళ స్వరాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకేమాత్రం తీసిపోని విధంగా ప్రవర్తించింది. ట్యాంక్‌బండ్‌ ‌చుట్టూ వేలాది పోలీసు బలగాలను మోహరించింది. అడుగడుగున ఏర్పాటుచేసిన పోలీసుల వలయాలతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తతగా మారింది. ట్యాంక్‌బండ్‌కు వచ్చే నలువైపుల మార్గాలన్నీ పోలీసు పికెటింగ్‌లతో నిండిపోయాయి. నాడు ఏర్పాటు చేసినట్లే బ్యారికేడ్స్, ఇనుప ముళ్ళ కంచెలతో ఉద్యమకారులను అడ్డుకునేందుకు అష్టదిగ్బంధం చేశారు. ఆర్టీసి జెఏసి ఇచ్చిన ఛలో ట్యాంక్‌బండ్‌ ‌పిలుపునందుకుని తరలివొస్తున్న కార్మికులు, ప్రజలను అదేతరహాలో మూడంచెల వలయాలను ఏర్పాటుచేసి నిలిపివేసే ప్రయత్నం చేసింది తెలంగాణ సర్కార్‌. ‌ముందురోజు నుండే ఆర్టీసీ నాయకులను, రాజకీయ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. ట్యాంక్‌బండ్‌ ‌పరిసరాల్లోకి ఎవరూ రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. బస్సుల్లో, రైళ్ళలో, ఇతర వాహనాల్లో వచ్చేవారిపైన నిఘా పెట్టారు. కాని. ఆనాడు అంతవొత్తిడిలో కూడా ఉద్యమకారులు ట్యాంక్‌బండ్‌ ఎక్కినట్లే ఈ రోజుకూడా కొందరు ట్యాంక్‌బండ్‌వరకు చేరుకోగలిగారు. విగ్రహాల వరకు చేరుకుని తమ నిరసన తెలిపే ప్రయత్నంలో పోలీసులు వెంటనే వారిని అరెస్టు చేశారు. అరెస్టు అయినవారిని నగరంలోని విభిన్న పోలీసు స్టేషన్‌లకు తరలించారు. ఎవరు ఎక్కడున్నది తెలియని పరిస్థితి. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు, అవరోధాలు సృస్టించినా ప్రజల నిరసనముందు అవేవీ నిలువవన్న విషయాన్ని ఈ మార్చ్ ‌ద్వారా మరోసారి నిరూపించినట్లైంది. ఎనిమిదేళ్ళకింద తెలంగాణ రాష్ట్ర సాధన కోసం యావత్‌ ‌తెలంగాణ అంతా ఒకటై తలపెట్టిన మిలియన్‌మార్చ్, ఉద్యమ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచి పోయింది. అది ప్రజల ఐక్యతకు, ఐక్య ఉద్యమానికి ప్రతీకగా నిలిచింది. ఇవ్వాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నపార్టీ రాష్ట్ర సాధనపై మాట్లాడినప్పుడల్లా మిలియన్‌మార్చ్ ‌పేరెత్తకుండా ఉండలేదు. అలాంటిది ఆర్టీసీ ఇచ్చిన ఛలో ట్యాంక్‌బండ్‌ను పోలీసు బలగాలతో ప్రభుత్వం అడ్డుకోవడంపై ఉద్యమకారులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. విచిత్రమేమంటే ఆనాటి మార్చ్‌లో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. ఈనాటి మార్చ్‌లో అధికార పార్టీ టిఆర్‌ఎస్‌ ‌తప్ప మిగతా అన్ని పార్టీలు, ప్రజలు బాగస్వాములవడం చూస్తుంటే ప్రజలంతా ఒకవైపుంటే, ప్రభుత్వం ఒక్కటి ఒకవైపు ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఆర్టీసీ జెఏసీ ఇచ్చిన ఈ సకల జనుల సామూహిక దీక్షలో పాల్గొనడానికి వచ్చిన కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా పోలీసులు వదలలేదు. మహిళలని కూడా చూడకుండా పోలీసులు లాఠీఛార్జీ చేశారు. బరబరా ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి వాహనాల్లో కుదేయడంతో ఆ ప్రాంతమంతా హాహాకారాలు, అక్రందనలు, అరుపులు, కేకలతో రణరంగంగా మారింది. పోలీసుల లాఠీలు ప్రయోగించడంతో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. కాళ్ళపై, వీపులపైన పడిన లాఠీదెబ్బలకు ఎర్రగా కలిమిపోయాయి. కొందరు నడువలేని పరిస్థితిలో ఉంటే, మరికొందరు స్రృహకోల్పోయారు. ఆర్టీసి వాళ్ళంతా తన కుటుంబ సభ్యులని, తన తోబుట్టువులని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులపట్ల ప్రవర్తించే తీరిదేనా అని, గాయపడిన పలువురు మహిళలు ప్రశ్నిస్తున్నారు. తమ డిమాండ్ల సాధనకోసం ప్రశాంతంగా దీక్ష చేసుకునేందుకు వస్తే బట్టలూడిపోయేట్లులాగి వ్యానుల్లో ఎక్కించారని, వెంటాడి నిర్బంధించారని వారు ఆక్రోశిస్తున్నారు. తమను అరెస్టుచేసి ఏంచేస్తారో చెప్పాలంటూ వారు ప్రశ్నిస్తున్నారు. అరెస్టు చేసినంత మాత్రాన సమస్య సమస్య కాకుండా పోతుందా అని ప్రశ్నిస్తున్నారు. సమ్మెపై అధికారులతో తొమ్మిదేసి గంటలపాటు ఏకధాటిగా చర్చలు జరిపిన ముఖ్యమంత్రికి తొమ్మిది నిమిషాలపాటు తమతో చర్చించే సమయం లేకపోవడమేంటంటున్నారు. చివరకు కోర్టులు కూడా ప్రభుత్వ విధానాన్ని తప్పుపడుతున్న క్రమంలో ప్రభుత్వం తన మొండితన•ం వీడకపోవడం పట్ల వారు విచారం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంమీద ఉద్యమ ల్యాండ్‌మార్క్ ‌ట్యాంక్‌బండ్‌పై ఉద్యమకారులెవరు పిలుపిచ్చినా అది విజయవంతం అవుతుందనడానికి ఛలో ట్యాంక్‌బండ్‌ ‌విజయవంతమవడమే నిదర్శనంగా నిలుస్తున్నది.