సాంద్రత, గాఢత, సూటిదనం, వస్తు వైవిధ్యం కలిగిన కవిత్వాన్ని గత మూడు దశాబ్దాలకు పైగా రాస్తున్న నిరంతర కవి విపి చందన్‌రావు. నిత్య నూతనత్వంతో ఆయన కవిత్వం విరాజిల్లుతుంది. పరిమళాల గుబాళింపే కాదు నిబిడీకృతమైన అంతరాగ్నితో ఈ కవి కవిత్వం దీపించడం కూడా మరొక ప్రత్యేకత. తన పేరుకు అగ్నికి అనుసంధానించి చందనాగ్ని పేరుతో కవితాసంపుటిని ఆయన వెలువరించారు. కవిత్వాన్ని ఒక యజ్ఞంలా, తపస్సులా కవి భావించారనడానికి సాక్ష్యంగా 171 కవితలు ఈ సంపుటిలో ఉన్నాయి.

నా బతుకు నాది /  నా యాతన నాది/  ఎప్పటికప్పుడు ఏ పూటకాపూట దొరికిందేదో / ముక్కున కరుచుకోవడమే తప్ప/  రేపటికో మరునాటికో /  నేనే నాడూ దాచుకోను అని పిట్టపిల్ల వేదనను తొలి కవితలో హృదయద్రావకంగా అక్షరీకరించి మేం పిట్టలం /  మా వారసత్వం /  రెక్కాడిరచి డొక్కనింపుకోవడం అని వాటి జీవనతత్వాన్ని స్పష్టపరిచారు. నిరంతరం యుద్ధం చేస్తున్న /  అగ్నిపుల్లని చూస్తున్న వాడ్ని/  విధించిన నిషేధాజ్ఞల/ అగ్నుల్లోంచి వీధులకు /  విముక్తి ప్రసాదించండి అన్న చీకటి దండెం మీద  వెలుతురు వస్త్రం అన్న కవితలోని వాక్యాలు వ్యవస్థీకృత జీవన దృశ్యాన్ని దృశ్యమానం చేశాయి. లోకం తనలో విడిచిపోతున్న పాప పంకిలాన్ని ప్రక్షాళన గావించుకోవడానికి నది తలారా స్నానం చేసిందన్నారు.

రక్తికి విరక్తికి అక్షరమే తేడా అని చెప్పారు. మా నాయన సి. నారాయణ శీర్షికతో రాసిన కవితలో సినారెను తండ్రిగా భావించి ఆయనను తెలుగు జాతికి తరతరాలకు  నీవు తరగని స్థిరాస్తి చరాస్తి అని తెలిపారు. మాకు నిత్యం ఒక పొద్దే అని ఆకలితో అల్లాడే అన్నార్తులను గురించి చెప్పారు. 1968 – 2014 మధ్య తెలంగాణ తొలి, మలిదశల పోరాటాన్ని గుర్తు చేసేందుకు అప్పటి ఉద్యమంలో తగిలిన  లాఠీదెబ్బ నొప్పి ఇప్పుడు మానిందంటూ రాష్ట్ర ఆవిర్భావాన్ని కూడా సంకేతిస్తూ తెలిపారు. ఋణానుబంధాలు ఇక్కడే ఖతమవుతాయన్న  సత్యాన్ని  లోపలి శ్మశానం అన్న కవితలో చెప్పారు. ఇల్లంటే జీవన సాఫల్య పురస్కారమేనన్నారు. గొంగట్లో తింటూ వెంట్రుకలేరే అవస్థమనదని  నిర్మోహమాటంగా చెప్పారు. కలుసుకోవడానికి, మాట్లాడుకోవడానికి, తలచుకోవడానికి ఇష్టపడని వీళ్లు ఏం మనుషులని ప్రశ్నించారు. అన్నీ కోల్పోయాక కళ్లల్లో తడితడిగా / ఒక దాని వెనుక /  ఒక యాది వస్తుందని ఖేల్‌ఖతం కవితలో తెలిపారు.

కాలం చరిత్రగా /  అనగనగా ఒక కథగా /  అలా ఆగక సాగిపోతుందన్నారు. సీతాకోక చిలుకలకు ఈర్ష్యపు గోడల హద్దుల్లేవని చెప్పారు. కొన్ని కృతజ్ఞతలు, క్షమాపణలు, శబ్దాలు, నిశ్శబ్దాలు జీవిత అవసరాలని  తెలిపారు. నా నిజామాబాదు కవితలో నా ఇందూరు నాకు చంద్రమండలం అనడం కవి స్వాభిమానానికి పరమోదాహరణ. పసిబింబం, అమృతాక్షరాలు, పగలు, చెట్టు కనపడనన్ని పూలు, నా దారి నాది… లాంటి వాళ్లు, విషప్పండు, క్యాలెండర్‌ ఒక అలెగ్జాండర్‌, లాభమా… నష్టమా.. ఎంత శాతం,  చిన్న ధైన్యం – పెద్ద ధైర్యం, తెల్ల శాలువా – నల్లతేలు వంటి కవితల్లో అనేక సామాజిక అంశాలను లోతుగా ప్రస్తావించారు. కవిత్వమంటే ప్రాణవాయువు అన్నారు. మనసంతా /  శవం కాలుతున్న/  కమురు వాసన అని వేదన చెందారు.

రహస్యాల రహస్యం, అగ్నిలో చేతులు కడుక్కుంటూ, ప్రపంచ కవిత, సినిమా  ఇంటర్వెల్‌, మధ్య తరగతోడి పండుగ, సుచిత్రాల సురారం, పాఠాలు, సినిమా, సీలింగ్‌ ఫ్యానోపదేశం, ఉత్త నాటకం, బతుకు బాలశిక్ష, గోడ పత్రిక, శవం పెడుతున్న కూడు, జీవన గణితం, వాడు బాలుడు, తమలపాక మీద చంద్రుడు వంటి ఆలోచింపజేసే కవితలు ఇందులో ఉన్నాయి. విఖ్యాత కవి కందాళై రాఘవాచార్యతో ఉన్న జంట కవిత్వ స్నేహానుబంధాన్ని తెలిపిన ఇందులోని కవిత శిఖరమై ఎదిగిన గొప్ప అనుబంధానికి ప్రతీకగా మారింది. ఖాళీ కాగితాలే బతుకులో తుపానుల్ని సృష్టిస్తాయని చెప్పారు. ప్రవహిస్తున్న నీళ్లల్లో పయనిస్తున్న పడవనే  జీవితమని తెలిపారు. ఓ శుక్లపక్షాన్ని చూడాలంటే /  ఓ కృష్ణపక్షాన్ని దిగమింగాలని చెప్పారు. స్నేహాన్ని విరజిమ్మమన్నారు. పూల భాషని డీకోడ్‌ చేసుకుని సీతాకోక చిలుకలు సంతృప్తిగా, సరికొత్త ఆనందావరణం మధ్య  వింటున్నాయన్న వినూత్న  ప్రతిపాదన చేశారు. రేపటి ఏడుపంతా నేడే ఏడ్వమన్నారు. మనసును మెల్లిగా మచ్చిక చేసుకుని మనిషిని మనుగడ సాగించమని చెప్పారు.

అర్థమైతే/ గజల్‌/  లేదా/  అంతుచిక్కని ఫజిల్‌ అని జీవితాన్ని నిర్వచించారు. నువ్వు చస్తే /  ఊరికో దేశానికో నష్టమా/  అది ఎంత శాతమో ప్రశ్నించుకొమ్మని సూచించారు. కవి దుఃఖమే కవిత్వమన్నారు. మనిషిని జీవన జాలరి అని సంబోధించారు. స్పీకర్‌లో పోలింగ్‌ వివరాలు ఆతృతతో వింటున్న కోళ్ళు ఆ ఎన్నికల రణంలో ఎవరు గెలిచినా రాత్రి దావత్తుకు తెగేది అమాయకమైన తలలే అని బిత్తర పోతున్నాయన్నారు. ఆకలివాణి డొక్కల్లోంచి ప్రసారమవుతున్న బృందగానం అన్న  కోరస్‌ కవితలోని వాక్య ప్రయోగం  కదలిస్తుంది. చెక్కిలిని తుడిచి ఓదార్చేది చూపుడు వేలేనని చెప్పారు. ఫోటోలు దిగేప్పుడు చేతులు కలిసినా మనసులు ఎందుకో కలవవు అన్నారు.

ఒక్కోసారి ఆలోచనలు స్వప్నాలై సర్పాలై/  రాత్రంతా ఒకటే గుసగుసలు అన్న కవితా వాక్యంలో ఎంతో నిగూఢత వ్యక్తమైంది. కోపం సింహానికే కాదు చిట్టి చీమకూ వస్తుందన్న మాటలు సామాన్యుని ఆగ్రహానికి సంకేతమయ్యాయి. నువ్వు చచ్చేంత వరకు ఏడుస్తారు /  నువ్వు చచ్చాకా ఏడేస్తారు అని లోకం పోకడను చెప్పారు. ఎగిరి దూకడాలు / ఎదుటి వారిని మింగెయ్యడాలు అని బి.పి కవితలో అన్నారు. తొలకరి చినుకులు పడగానే/  గుప్పుమంటూ పరిమళించే గోడలు అని ఇంటి గోడల స్వాభావికతను వివరించారు. వాయులీనం, ఒక మిగిలింది, కళారహితుడు, శిథిల జీర్ణ పర్ణశాల, భూమి, తర్పణం, హంపి, లైఫ్‌, పురుగు, పూలు వాలిన చెట్టు, వెతుకులాట, కాలసూచిక, పల్లకీసేవ, డీ కంపోజ్డ్‌ పార్టీ, ఏక వాక్యదండెం కవితలు కవిలోని నిశిత సామాజిక  పరిశీలనా దృష్టిని, మెండైన  కవితాత్మకతను వెల్లడిరచాయి. నిశ్శబ్దం కంటే /  నీ శబ్దమే నాకిష్టం అని నన్ను డిస్టర్బ్‌ చేయండి అన్న కవితలో అన్నారు. పునశ్చరం, గల్లీ టు ఢల్లీి, మరణీయం, ఆకాశమ్మీద ఆటోగ్రాఫ్‌, మనది కాకుంటే చాలు లో మారుతున్న పరిస్థితులు, మనిషి నైజాలు స్పష్టంగా వ్యక్తమయ్యాయి. జ్ఞాన స్నానం కవితలో కొత్త పుస్తకం కొనడమంటే/  ఆయువు పెంచుకోవడమేనన్నారు. ప్రగతికి ప్రశ్నే ఒక గొప్ప పునాది అని స్పష్టం చేశారు.

చిగురించడం /  పరిమళించడం నేర్చుకో / తీయగా పలుకరించడం నేర్చుకో అన్న ముందుమాటలోని కవితా వాక్యాలు ఆలోచింపజేస్తాయి. దస్తీని దోస్తీగా భావించి ఆ జ్ఞాపకమే తనకు మిగిలిన గొప్ప ఆస్తి అని చెప్పారు. కొన్నిసార్లు మౌనమే ఎంతగానో  మంచిదని తెలిపారు. వేగయోగం కవితలో ఏదో చెప్పాలన్న ఆరాటం/  విషయముండదు/ ఏదో పాడాలన్న తపన/  గొంతు పెగలదు అని పెదవి విరిచారు. ఎంత సేపు కూచున్నా/  ఎంత దూరం ప్రయాణించినా/  దిగపోక తప్పదు కదా అని ప్రస్థానం కవితలో జీవనయానంలో జరిగే తంతును  వివరించారు. కొందరంతే /  రసాస్వాదన తక్కువ/  రంధ్రాన్వేషణ ఎక్కువ అని అలాంటి వారి విపరీత నైజాల్ని వివరించారు. నరవాసన కవితలో కాలం మీద నాకింకా ఆశ ఉంది/  శూన్యపు దారిలో మనుషులు విరబూస్తారు అని అకుంఠితమైన ఆశా భావాన్ని వ్యక్తపరిచారు. ఊరమ్మ అన్న కవితలో మా ఊరంటే నాకు ఉగాదే/  పసిడి జ్ఞాపకాలు పండిన నిండు గాదే అని తన ఊరిని కమ్మని కాకెంగిలి, రామ చిలుక కొరికిన జాంపండుతో పోల్చారు.

కాగితానికీ కలానికీ మధ్య/  భూ మధ్య రేఖలా కన్నీటి పొర అని కవి తన అంతర్గత మధనాన్ని అక్షరీకరించారు. తనకు తెలిసింది మనసుని దులిపి గుండెను గుమ్మరించడమేనని తెలిపారు. కొన్ని తెలియకపోవడమే మంచిది చచ్చేదాకా  బతకాల్సిందేనని అన్నారు. వర్ణ నివేదన, లౌల్యం కవితలో కవిలోని ఆందోళనాత్మక ఆర్తిని వ్యక్తపరిచారు. గుండె చెరువైనప్పుడు కవితలో నేను పచ్చగుంటేనే కదా /  ఊరు పచ్చగుండేది/  నా కోసం కాదు/  మీ కోసం/ జర్రంత నన్ను పట్టించుకోండ్రి తండ్రీ అని ఊరి చెరువే స్వయంగా ఇప్పటి తరాన్ని  వేడుకున్న తీరును వివరించారు. సంపుటిలోని చివరి కవిత చందనాగ్నిలో బండెడు కట్టెల్లో నిలువెల్లా దహించుకుపోవడం తనకేమీ కొత్త కాదంటూ సహనం నా కవచం, పరిమళం పరమార్థమన్నారు. ఈ సంపుటిలోని అనేక కవితల్లో లయాత్మకతతో కూడిన ఆత్మాంకిత పదవిన్యాసం ఆకట్టుకుంటుంది. అపారానుభవంతో పఠన శ్రవ్యంగా  కవిత్వాన్ని జాగ్రత్తగా  అల్లడం  ద్వారా పరిమళింపజేసిన ఈ కవి అమేయమైన రసానందాన్ని అందించారు.
డా. తిరునగరి శ్రీనివాస్‌
9441464764

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page