‘‘శ్రీలంకలో ఆర్థిక పరిస్థితి ఘోరంగా దిగజారి పోవడం దృష్ట్యా మన రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని ఆర్బిఐ ఒక వ్యాసంలో విశ్లేషించింది. ఈ వ్యాసం ప్రకారం ముఖ్యంగా దేశంలో పది రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అతి దయనీయంగా ఉందని.. వాటి పరిస్థితి శ్రీలంకతో పోల్చవచ్చు అని చెప్పింది. కానీ ఆ పది రాష్ట్రాలలో తెలంగాణ లేదు. అనగా ఆర్థిక మంత్రి చేసిన విమర్శకు, సాక్షాత్తు దేశ ఆర్థిక పరిస్థితిని విశ్లేషించేందుకు కావలసిన సమాచారము, సామర్థ్యం ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిన సమాచారానికి ఎలాంటి పొంతన లేదు. కాబట్టి ఆర్థిక మంత్రిగా చేసిన ఈ విమర్శ రాజకీయం కోణంలో ముఖ్యంగా మునుగోడు అసెంబ్లీ ఎలక్షన్ నేపథ్యంలో చేసిందిగా భావించాల్సివస్తుంది.’’
గురువారం మనదేశ ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ కామారెడ్డి లో మాట్లాడుతూ దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ అప్పుల పాల అయిందని అసెంబ్లీ నిర్ణయించిన పరిమితి కన్నా ఎక్కువ అప్పు చేసిందని ప్రకటించారు. శ్రీలంకలో ఆర్థిక పరిస్థితి ఘోరంగా దిగజారి పోవడం దృష్ట్యా మన రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని ఆర్బిఐ ఒక వ్యాసంలో విశ్లేషించింది. ఈ వ్యాసం ప్రకారం ముఖ్యంగా దేశంలో పది రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అతి దయనీయంగా ఉందని.. వాటి పరిస్థితి శ్రీలంకతో పోల్చవచ్చు అని చెప్పింది. కానీ ఆ పది రాష్ట్రాలలో తెలంగాణ లేదు. అనగా ఆర్థిక మంత్రి చేసిన విమర్శకు, సాక్షాత్తు దేశ ఆర్థిక పరిస్థితిని విశ్లేషించేందుకు కావలసిన సమాచారము, సామర్థ్యం ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిన సమాచారానికి ఎలాంటి పొంతన లేదు. కాబట్టి ఆర్థిక మంత్రిగా చేసిన ఈ విమర్శ రాజకీయం కోణంలో ముఖ్యంగా మునుగోడు అసెంబ్లీ ఎలక్షన్ నేపథ్యంలో చేసిందిగా భావించాల్సివస్తుంది.
గణాంకాలతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యాసాన్ని వివరించడమే ఈ వ్యాసం ఉద్దేశం.,ఆర్బిఐ వ్యాసం ప్రకారం దేశంలో అత్యంత దయనీయమైన ఆర్థిక పరిస్థితి ఉన్న రాష్ట్రాలు పంజాబ్ రాజస్థాన్,కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ ,హర్యానా బీహార్, ఆంధ్ర ప్రదేశ్, వెస్ట్ బెంగాల్ మరియు జార్ఖండ్.. వీటిల్లో తెలంగాణ లేదు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి వివరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముఖ్యంగా కొన్ని ఆర్థిక అంశాలని పరిగణలోనికి తీసుకుంది. వాటిలో ముఖ్యమైనవి రాష్ట్ర అభివృద్ధిలో అప్పు శాతం, టాక్స్ రూపంలో రాష్ట్రాల ఆదాయం, మొత్తం ఖర్చులో రెవెన్యూ ఖర్చు శాతం, ఉచితాలు,సబ్సిడీల మీద ఖర్చు, పాత పెన్షన్ విధానాన్ని అవలంబించడం.. విద్యుత్ పంపిణీ సంస్థల అప్పులు.
ఆర్బిఐ తయారుచేసిన ఒక పట్టిక ద్వారా అర్థమయ్యే విషయం ఏమిటంటే రాష్ట్ర వార్షిక అభివృద్ధిలో మొత్తం అప్పు విషయంలో, మొత్తం ఖర్చులో అప్పు శాతం విషయంలో, వచ్చే ఆదాయంలో ప్రతి సంవత్సరం తీర్చవలసిన అప్పు శాతం విషయంలో మన రాష్ట్రం పై ఎర్ర మార్కు పడనేలేదు. అంటే మన రాష్ట్రం ఆర్థిక పుష్టి క్లిష్ట పరిస్థితుల్లో లేదని సాక్షాత్తు ఆర్బీఐ చెప్తుంది. ఉదాహరణకి పంజాబ్ మొత్తం వార్షిక అభివృద్ధిలో అప్పు 50.3%, రాజస్థాన్ లో 39.3 ,వెస్ట్ బెంగాల్లో 38 శాతం, కేరళలో 38.3 శాతం, ఆంధ్రప్రదేశ్లో 37.6 శాతం ఉండగా మన రాష్ట్రంలో 25 శాతం ఉంది. అయినా మన రాష్ట్రంపై ఎందుకింత కన్నెర్ర. ఇది కన్నెర్ర కాదు ఈర్షతో కండ్లు పచ్చపడడం. ఆర్బిఐ తన విశ్లేషణలో ప్రచురించిన ఇంకొక పట్టిక ప్రకారం కూడా తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో అప్పు శాతం మరియు 15వ ఫైనాన్స్ కమిషన్ నిర్ణయించిన స్థాయి కన్నా ఇతర పది రాష్ట్రాల కన్నా తక్కువే ఉందని నిరూపితమైంది.
ఈ మధ్యకాలంలో దేశం మొత్తం మీద ఉచితల మీద జరుగుతున్నటువంటి చర్చ అందరికీ తెలిసింది. దీనికి సంబంధించిన ఒక పట్టిక కూడా ఆర్బిఐ తమ వ్యాసంలో ప్రచురించింది. ఈ పట్టికలో తమ రాష్ట్ర వార్షిక అభివృద్ధి లో, రాష్ట్ర మొత్తం ఆదాయంలో, రాష్ట్ర టాక్స్ ఆదాయంలో ఉచితల శాతం అత్యధికంగా ఉన్న పది రాష్ట్రాల వివరాలు పొందుపరచబడ్డాయి. అందులో మన రాష్ట్రం లేనే లేదు.
అయితే ఆర్బిఐ ఉచితలకు నిర్వచనం ఏ చట్టం చేయలేదని చెబుతూనే తన సొంత నిర్వచనం ఒకటి ఇచ్చింది. ఈ నిర్వచనం ప్రకారం ప్రజా ఉపయోగ వస్తువులు(పబ్లిక్ గూడ్స్), ప్రజా పంపిణీ విధానాల్లోని •రేషన్ కు పెట్టే ఖర్చు, ఉపాధి కోసం పెట్టే ఖర్చులు, విద్యా వైద్యం మీద పెట్టే ఖర్చులు ఉచితాలు కావని, ప్రజలకు ఉచితంగా ఇచ్చే విద్యుత్తు, తాగునీరు, రవాణా సౌకర్యం, అంతేకాకుండా ఇదివరకే పై సౌకర్యాలు కై ప్రజలు దగ్గర రావలసిన బాకీలు,వ్యవసాయదారుల అప్పుల మాఫీ ఇవన్నీ కూడా ఉచితాలని నిర్వహించింది. కానీ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయదారులకు బీమా విషయంలో మరియు ప్రతి సంవత్సరం అందజేసినటువంటి డబ్బు విషయంలో మాత్రం ఎలాంటి అభిప్రాయం వ్యక్తపరచలేదు.
అసలు ఆర్.బి.ఐ వ్యాసానికి స్ఫూర్తి శ్రీలంక ఆందోళన ఆర్థిక పరిస్థితి అనీ .. ఆ పరిస్థితికి కోవిడ్ వల్ల టూరిజం మీద ఆధారపడి ఉన్న శ్రీలంక ఆదాయం పడిపోవడం, టెక్స్టైల్ మరియు టీ ఎగుమతులు దారుణంగా పడిపోవడం మరియు ఒకేసారి దేశంలో మొత్తం వ్యవసాయదారులు ఆర్గానిక్ వ్యవసాయం చేయాలనే నిర్బంధ విధానం కారకాలని చెప్పింది. మరి ఇందులో ఏ పరిస్థితి కూడా మన దేశంలో లేవు. అయినా మరి ఈ విశ్లేషణ ఎందుకో అర్థం కావట్లేదు. ఒకవేళ ముందు చూపుగా రాష్ట్రాలకు హెచ్చరిక ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ అందులో దేశ మొత్తానికి సంబంధించినటువంటి గణాంకాలు కూడా పొందుపరచవలసి ఉండే. కానీ అవి లేవు. అయితే ఐఎంఎఫ్ లెక్కల ప్రకారం మన దేశంలో స్థూల ఆదాయం లో అప్పు 89% ఉంది. మరి మన రాష్ట్రంలో 25% ఉంది. ఇంకా రాష్ట్రాన్ని ఆడిపోసుకోవడం ఏంటో అర్థం కాదు..!
రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల విశ్లేషణ చేసేటప్పుడు వాటి అప్పులు ఖర్చులే కాకుండా ఆదాయాల పెరుగుదలను కూడా చూపాలి. కానీ ఆదాయ గణాంకాలు మాత్రం ఈ వ్యాసం లో లేవు. 2021 నవంబర్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురించిన వ్యాసం ప్రకారం ఆర్.బి.ఐ లెక్కల దృష్ట్యా తెలంగాణ రాష్ట్రం ఆదాయం 85 వేల కోట్లకు పెరిగింది. అలా ప్రతి సంవత్సరం ఆదాయం పెరిగిన ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. మరి ఆదాయాలు పెరిగితే ఖర్చులు కూడా పెంచుకోవాలి కదా. ఆదాయాలు పెరిగితే అప్పు తీర్చే సామర్థ్యం కూడా పెరుగుతుంది కదా.. ఆ విధంగానే అభివృద్ధి సాధ్యం కదా..!
ఆర్థిక శాస్త్రం ప్రకారం రకరకాల సంస్థలు చేసే అప్పులకు కూడా ప్రభుత్వాలు హామీ ఉంటాయి. అవి తీర్చలేని పక్షంలో ఆ ప్రభుత్వాలు వాటిని తీరుస్తుంటాయి. ఈమధ్య టాటా కంపెనీకి ఎయిర్ ఇండియా అమ్మినప్పుడు 50 వేల కోట్ల పైచిలుకు అప్పును తను భరించి అప్పు లేని వ్యవస్థను టాటా కంపెనీకు అమ్మింది మరి ఇది ఉచితం కాదా..! బ్యాంకులు ఇచ్చిన అప్పులు తిరిగి ఇవ్వకపోతే వాటిని నిరర్థక ఆస్తులు అంటారు. దేశంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ విధంగా బ్యాంకులకు తిరిగి రాలేదు. ఈ విధంగా వాటిల్లే ఆర్థిక నష్టం కూడా దేశ ఆర్థిక లోటుకు దారితీస్తుందని విషయం నిజం. మరి వీటి గురించి ఎలాంటి ప్రస్తావన ఈ వ్యాసంలో లేవు. కనీసం ఆర్థిక విషయంలోనైనా దేశస్థాయి నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు అయినటువంటి వారు, ప్రజలకు సరియైన మార్గదర్శకం చేయవలసినటువంటి సంస్థలు కూడా ప్రజలకు వాస్తవ పరిస్థితులను తెలియజేయడం ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉపయోగకరంగా ఉంటుంది. అంతా రాజకీయం చేయడం సముచితం కాదు.
– డాక్టర్ మండువ ప్రసాదరావు,హైదరాబాద్, 9963013078