అం‌దరి సహకారంతో పురోగమనంలో రాష్ట్రం

  • హైదరాబాద్‌ ‌పట్ల జస్టిస్‌ ‌రమణకు చాలా ప్రేమ
  • ఆయన చొరవతో హైకోర్టు బెంచీలు 42కు పెరిగాయి
  • రాష్ట్ర న్యాయాధికారుల సదస్సులో సిఎం కెసిఆర్‌

‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 15 : ఎనిమిదేండ్ల క్రితం అవతరించిన తెలంగాణ రాష్ట్రం అందరి సహకారంతో పురోగమిస్తున్నదని సిఎం కెసిఆర్‌ అన్నారు. చక్కటి ఆర్థిక క్రమశిక్షణతో అన్నిరంగాల్లో దూసుకుపోతున్నామని చెప్పారు. శుక్రవారం తెలంగాణ న్యాయధికారుల సదస్సులో ఆయన మాట్లాడుతూ..విద్యుత్‌ ‌రంగంలో అద్భుతమైన పురోగతి సాధిస్తున్నామని, వ్యవసాయ, పారిశ్రామిక రంగంలో ముందుకెళ్తున్నామన్నారు. పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చి 33 జిల్లాలు ఏర్పాటు చేశామన్నారు. ఆర్‌బీఐ లెక్కల ప్రకారం తెలంగాణ తలసరి ఆదాయం రూ.2.78 లక్షలు అని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ పరిపాలన విభాగం ఇంకా ముందుకెళ్లాలని, దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. హైదరాబాద్‌ ‌పట్ల జస్టిస్‌ ఎన్వీ రమణకు చాలా ప్రేమ ఉన్నదని చెప్పారు. సుదీర్ఘకాలం హైదరాబాద్‌లో పనిచేసినందున ఆయనకు అన్ని విషయాలు తెలుసున్నారు.

హైకోర్టు విడిపోయిన తర్వాత బెంచీల సంఖ్య పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ పెండింగ్‌లో పెట్టారని చెప్పారు. అయితే సీజేఐ రమణ చొరవతో హైకోర్టు బెంచీలను 24 నుంచి 42కు పెంచారన్నారు. న్యాయ వ్యవస్థలో గతంలో 780 పోస్టులు మంజూరు చేశామని సీఎం కేసీఆర్‌ ‌వెల్లడించారు. మరో 885 అదనపు పోస్టులు హైకోర్టుకు మంజూరు చేశామన్నారు. జిల్లా కోర్టులకు అదనంగా 1730 పోస్టులు మంజూరు చేశామన్నారు. జిల్లా కోర్టులలో పనిభారం ఉందని తెలిసిందన్నారు. 23 జిల్లాల్లో జిల్లా కోర్టు భవనాల నిర్మాణం చేపడతామని వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కోటి 52 లక్షల ఎకరాల భూములను డిజిటలైజ్‌ ‌చేశామన్నారు. రెవెన్యూ కోర్టులను ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. న్యాయమూర్తులు హోదాకు తగ్గట్లుగా 30 ఎకరాల్లో క్వార్టర్స్ ‌నిర్మిస్తామని, సీజేఐ రమణతో శంకుస్థాపన చేయిస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page