హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 16 : సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ పి.హెచ్.సి ఎన్.అన్నాపురం సబ్ సెంటర్ లో అక్రమంగా సస్పెండ్ చేసిన ఆశా వర్కర్ కవితను విధుల్లోకి తీసుకోవాలని ఎఐటియుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం.నర్సింహా డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తమ సమస్యల పరిష్కారానికై పోరాటాలు నిర్వహించిన కార్మికులపై కెసిఆర్ ప్రభుత్వం, వారి అనుబంధ కార్మిక సంఘం వారు కక్షసాధింపు చర్యలకు పూనుకొని కార్మికులకు తీవ్ర అన్యాయాన్ని చేస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బాధితురాలు కవితతో కలసి ఆయన మాట్లాడుతూ ఎన్నికల కంటే ముందు రాష్ట్రంలో తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని, జీతాలను పెంచాలని కోరుతూ రాష్ట్ర వ్యాపితంగా కార్మికవర్గం పోరాటాలు నిర్వహించటం జరిగిందన్నారు. అందులో భాగంగా ఆశా వర్కర్లు సైతం సమ్మె చేయటం జరిగిందని వారు వివరించారు. ఆ సమ్మె జరుగుతున్న సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఫార్వర్డ్ చేయటం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అక్టోబర్ 9 మధ్యాహ్నం 12 గంటల నుండి అమలులోకి వచ్చిందని కానీ ఆ ఆశా వర్కర్ అక్టోబర్ 7 ఫార్వర్డ్ చేసిఉన్నదన్నారు. ఎన్నికల కోడ్ కంటే ముందు ఫార్వర్డ్ చేసిన దాన్ని కోడ్ పరిధిలోకి రాదనే విషయాన్ని గ్రహించకుండా అధికారులు ప్రభుత్వ అనుబంధ యూనియన్ వారు ఇచ్చిన ఫిర్యాదునే సక్రమైనదిగా భావించి సస్పెండ్ చేయటం అన్యాయం అమన్నారు. సమ్మెకంటే ముందు కవిత అధికార కార్మిక సంఘంలో ఉన్నప్పటికి కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని అధికార కార్మిక సంఘం ఎదురించి పోరాటం చేయనందుకు నిరసనగా ఆ యూనియన్ కు రాజీనామ చేయటంతో వారు ఆమెపై వ్యక్తిగతంగా కక్ష పెంచుకొని తప్పుడు కంప్లెయింట్ చేయటం జరిగిందన్నారు. అధికారులు సైతం ప్రభుత్వానికే వత్తాసు పలుకుతూ ఆశా వర్కర్ కు అన్యాయం చేసి సస్పెండ్ చేశారని అన్నారు. అన్ని ఆధారాలతో ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. అవసరమైతే కోర్టుకు సైతం వెళ్ళనున్నట్లు చెప్పారు.