అజాగ్రత్తతోనే స్వప్నలొక్‌ ‌కాంప్లెక్స్ అగ్ని ప్రమాదం

షార్ట్ ‌సర్క్యూటే ప్రధానకారణం….
పూర్తిగా కాలిపోయిన 5, 7 అంతస్తుల్లోని దుకాణాలు
ఆరుగురు మృతి….లోపల చిక్కుకుపోయిన 12 మందిని కాపాడాం
అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి వివరణ
ఘటన పట్ల సిఎం కేసీఆర్‌ ‌తీవ్ర దిగ్భ్రాంతి
మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ ‌గ్రేషియా ప్రకటన
కేసు నమోదు చేసిన మహంకాళి స్టేషన్‌ ‌పోలీసులు

 సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్‌ ‌కాంప్లెక్స్‌లో గురువారం జరిగిన అగ్ని ప్రమాదానికి షార్ట్ ‌సర్క్యూటే కారణం అని ప్రాథమికంగా భావిస్తున్నట్లు అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి తెలిపారు. ఎప్పుడూ రద్దీగా ఉండే స్వప్నలోక్‌ ‌కాంప్లెక్స్ అగ్నిప్రమాదంలో 5, 7 అంతస్తుల్లో ఉన్న దుకాణాలు పూర్తిగా కాలిపోయాయాని తెలిపారు. గురువారం రాత్రి 7 గంటల సమయంలో మంటలు చెలరేగినట్లు తమకు సమాచారం అందిందని అగ్నిమాపక శాఖ డీజీ వెల్లడించారు. సమాచారం అందిన తర్వాత హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని భవనం లోపల చిక్కుకుపోయిన 12 మందిని కాపాడామని, కానీ దురదృష్టవశాత్తు అందులో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు నాగిరెడ్డి తెలిపారు. స్వప్నలోక్‌ ‌భవన యజమానులకు ఫైర్‌ ‌సేఫ్టీ గురించి చెప్పినా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని నాగిరెడ్డి తెలిపారు. స్వప్నలోక్‌ ‌కాంప్లెక్స్‌లో ఫైర్‌ ‌సేఫ్టీ ఉన్నప్పటికీ, అవి ఏమాత్రం పని చేయడం లేదని అగ్నిమాపక శాఖ డీజీ వెల్లడించారు. అగ్నిప్రమాద ఘటనలో షాపు కీపర్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ప్రస్తుతం భవన పరిస్థితి బాగానే ఉందని చెప్పారు. ఫైర్‌ ‌ఫైటింగ్‌ ‌సిస్టమ్‌ ‌ప్రతి కమర్షియల్‌ ‌కాంప్లెక్స్‌లో తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ఫైర్‌ ‌సేఫ్టీ పెట్టుకుంటే సరిపోదని వాటి నిర్వహణ సరిగ్గా చూసుకోవాలని తెలిపారు. ప్రధానంగా కమర్షియల్‌ ‌కాంప్లెక్స్‌లు లాక్‌ ‌చేయకూడదన్నారు. తాళాలు వేసి ఉండటంతో కొంత మంది బయటకు రాలేక ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వ్యాపార లావాదేవీలు నిర్వహించే వారు నిర్వహణ విషయంలో నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు. ఈ విషయంపై గతంలో స్వప్నలోక్‌ ‌కాంప్లెక్స్ ‌యాజమాన్యానికి నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. ప్రతి కాంప్లెక్స్‌లో మెట్ల దారి కూడా తెరిచే ఉంచాలని, ఏ కాంప్లెక్స్ ‌లోనైనా.. మెట్ల దారి లాక్‌ ‌చేస్తే 101 కు ఫోన్‌ ‌చేయాలని నాగిరెడ్డి తెలిపారు. సికింద్రాబాద్లో మరో భారీ అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. కాంప్లెక్స్‌లోని 7,8 అంతస్థులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దట్టంగా పొగ వ్యాపించడంతో పలువురు ఆఫీసుల్లోంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఈ కాంప్లెక్స్ ‌లో పలు కార్యాలయాలతో పాటు వాణిజ్య సముదాయాలు ఉండడంతో పదుల సంఖ్యలో ఉద్యోగులు చిక్కుకున్నారు. సహాయం కోసం ఫోన్‌ ‌టార్చ్ ‌చూపిస్తూ ఆర్తనాదాలు చేశారు. మంటల్లో చిక్కుకున్న వారు పొగతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. మరోవైపు ఆరుగురు నిరుపేద యువతీ యువకుల కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని మిగిల్చింది స్వప్నలోక్‌ ‌కాంప్లెక్స్ అగ్నిప్రమాద ఘటన! ఈ ఫైర్‌ ‌యాక్సిడెంటుపై కేసు నమోదు చేశారు మహంకాళి పోలీసులు. భద్రతా చర్యలు తీసుకోవడంలో విఫలమైన స్వప్నలోక్‌ ‌సూర్యకిరణ్‌ ఎస్టాబ్లిష్మెంట్‌ అసోసియేషన్‌, ‌కేడియా ఇన్ఫోటెక్‌ ‌లిమిటెడ్‌, ‌వికాస్‌ ‌పేపర్‌ ‌ఫ్లెక్సో ప్యాకేజింగ్‌ ‌లిమిటెడ్‌, ‌క్యూనెట్‌, ‌విహాన్‌ ‌డైరెక్ట్ ‌సెల్లింగ్‌ ‌ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌ ‌సంస్థలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇక అగ్నిప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణనష్టం జరగటంతో పాటు, పలువురు గాయపడటం పట్ల సీఎం విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుబాలకు కేసీఆర్‌ ‌తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ ‌గ్రేషియాను ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్‌. ‌వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. క్షేత్రస్థాయిలో వుండి పరిస్థితులను పరిశీలిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా మంత్రులు మహమూద్‌ అలీ, తలసానిని సీఎం కేసీఆర్‌ ‌సూచించారు. ఘటనపై హోంమంత్రి మహమూద్‌ అలీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాత్రి నుంచి ఆయన అక్కడే ఉండి సహాయక చర్యలు ఎప్పటికప్పుడు పరిశీలించారు. స్వప్నలోక్‌ అగ్ని ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు అండగా ఉంటామని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ ‌రెడ్డి భరోసా ఇచ్చారు. మృతుల్లో ముగ్గురు ఆయన నియోజకవర్గానికి చెందినవారే కావడంతో, ఎమ్మెల్యే పెద్ది వారికి బాసటగా నిలిచారు. పోస్ట్ ‌మార్టం అనంతరం మృతదేహాలను స్వగ్రామానికి తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి, ఓదార్చి, ధైర్యం చెప్పారు. ఒక్కో కుటుంబానికి వ్యక్తిగతంగా పెద్ది సుదర్శన్‌ ‌రెడ్డి రూ. 50 వేల ఆర్థికసాయం ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page