అధికారంలోకి వొచ్చేది..హ్యాట్రిక్‌ ‌కొట్టేది కేసీఆరే గొప్ప నాయకుడు ఒకే ఒక్కడు కేసీఆర్‌

  • రాష్ట్రానికి కాంగ్రెస్‌ ‌చేసింది ఏం లేదు
  • ఉద్యమ స్ఫూర్తిని కించపరచేలా మాట్లాడుతున్న రేవంత్‌ ‌రెడ్డికి, కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి
  • కర్నాటక మోడల్‌ అని చెప్పి ఇప్పుడు తోక ముడుచుకున్నారు
  • మంత్రి హరీష్‌ ‌రావు సమక్షంలో గట్లు సహా పెద్ద ఎత్తున బిఆర్‌ఎస్‌లో చేరిన వైఎస్‌ఆర్‌టిపి నేతలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 13 : ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ వాళ్లు పార్టీ పెట్టగలుగుతారా.. పార్టీ నడపగలుగుతారా..  తెలంగాణ వాళ్లకు అంత సీను ఉందా? అనే అవహేళన మాటలు ఎన్నో విన్నామని..ఇలాంటి అనేక ఒడిదుడుకులు ఎదుర్కుని 14 సంవత్సరాలు పార్టీని నిలబెట్టి, రాష్ట్ర సాధన కోసం చావు అంచుల వరకు వెళ్లి  రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు ఒకే ఒక్కడు కేసీఆర్‌ అని మంత్రి హరీష్‌ ‌రావు పేర్కొన్నారు.  సోమవారం వైయస్‌ఆర్టిపి పార్టీ నుండి గట్టు రాంచందర్‌ ‌రావు అధ్వర్యంలో ముఖ్య నాయకులు, అన్ని జిల్లా కోఆర్డినేటర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మంత్రి హరీష్‌ ‌రావు సమక్షంలో బిఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ ‌రావు మాట్లాడుతూ…వైయస్‌ఆర్టిపి పార్టీని బిఆర్‌ఎస్‌ ‌పార్టీలో విలీనం చేయడానికి వొచ్చిన నాయకులు, కార్యకర్తలకు స్వాగతం పలికారు. ఆనాడు సమైక్య నాయకులు పార్టీ పెట్టడమంటే పాన్‌ ‌డబ్బా పెట్టడం కాదని అవహేళన చేశారని, కిరణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి తెలంగాణ చీకటి మయమైతుందని చెప్పారని, అలాంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పే లాగా ఈరోజు రాష్ట్రాన్ని సాధించి కెసిఆర్‌ ‌దేశానికి ఆదర్శంగా నిలిపాడని అన్నారు.

తెలంగాణ పథకాలను దేశమే ఆదర్శంగా తీసుకుని అమలు చేసేలా చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్‌ అని, తండ్రి సమానులైన కేసీఆర్‌ని రాజకీయం కోసం నానా మాటలు తిట్టి ఈరోజు రాజకీయాల కోసం పార్టీని గాలికి వదిలేసిన నాయకురాలు షర్మిల అని హరీష్‌ ‌రావు విమర్శించారు. కాంగ్రెస్‌ ‌పార్టీ తెలంగాణలో అమలు చేస్తామని చెప్తున్న కర్ణాటక మోడల్‌ ‌ప్రజలకు అర్థమైందిన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం మూడు గంటల కరెంటు ఇచ్చి రైతుల ఉసురు పోసుకుంటుండడంతో రైతులు రోడ్డు మీదకు వొచ్చారని, దాంతో ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్‌ ‌మోడల్‌ ‌తెలంగాణలో పనికిరాదని తెలంగాణలో పార్టీ తోక ముడ్చుకుందని ఎద్దేవా చేశారు. రైతులకు ఇస్తున్న రైతుబంధు దండగ అని కాంగ్రెస్‌ ‌నాయకులు అంటున్నారని,  తెలంగాణ ఉద్యమాన్ని కూడా అవహేళన చేసేలా మాట్లాడుతున్నారని, నీళ్లు, నిధులు, నియామకాల ఉద్యమ నినాదాన్ని కూడా అవహేళన చేసే విధంగా రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడుతున్నారని, తెలంగాణ అమరవీరులను అవహేళన చేసి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కించపరచేలా మాట్లాడుతున్న రేవంత్‌ ‌రెడ్డికి కాంగ్రెస్‌ ‌పార్టీకి బుద్ధి చెప్పాలని హరీష్‌ ‌రావు పిలుపునిచ్చారు.

సీమాంధ్ర నాయకుల సూట్కేసులు మోయడానికి అలవాటు పడ్డ వెన్నెముక లేని నాయకులు అధికారంలోకి వొస్తే తెలంగాణని సమైక్య పాలకుల పాదాల దగ్గర పెట్టుతారని దుయ్యబట్టారు. ఈరోజు కాంగ్రెస్‌ ‌పాలిస్తున కర్ణాటక రాష్ట్రానికి బియ్యం కావాలని తెలంగాణ రాష్ట్రాన్ని అడుగుతున్నారంటేనే అక్కడి పరిస్థితి అర్ధం చేసుకోవచ్చునన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ‌చేసింది ఏం లేదని,  ఈరోజు దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణను మార్చింది మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని అన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీకి 50 పైన  స్థానాల్లో అభ్యర్థులు లేని పరిస్థితి ఉందని,  తెలంగాణలో అధికారంలోకి వొచ్చేది, హ్యాట్రిక్‌ ‌కొట్టేది కేసీఆర్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌పార్టీనేనని అన్నారు.  వ్యవసాయం గురించి తెలవని రేవంత్‌ ‌రెడ్డికి ఎంత హార్స్ ‌పవర్‌ ‌మోటర్‌ ‌రైతులు ఉపయోగిస్తారో కూడా తెలియదని,  10 హెచ్‌పి మోటర్‌ ‌పెట్టి మూడు గంటలు కరెంట్‌ ఇస్తే చాలని చెప్పే అవగాహన లేని అధ్యక్షుడు ఉన్న కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్రానికి, రైతులకు ఏం చెప్పాలని అనుకుంటున్నారని హరీష్‌ ‌రావు విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం వైఎస్‌ఆర్‌ ‌టిపి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.  వైయస్‌ఆర్టిపి లో ఎదుర్కున్న సూటిపోటి మాటలు, అవహేళనలు బీఆర్‌ఎస్‌ ‌పార్టీలో ఉండవని, ముఖ్యమంత్రి కేసీఆర్‌  ‌నాయకత్వంలో అందరం కలిసి పనిచేసి మరోసారి పార్టీ విజయానికి తోడు పడదామని, అందరికీ మరోసారి పార్టీలోకి ఆహ్వానిస్తూ మంత్రి హరీష్‌ ‌రావు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page