కవిత్వాన్ని ఒక ప్రపంచంగా నిర్మించుకొని జీవజలంగా భావజాలాన్ని ప్రసరింపజేయడం కవికి ఒక సాహసమే. కవిత్వంతో విస్తరిస్తూ పోవడం కవికి మాత్రమే దక్కే అద్భుత అవకాశం. హృదయం దృవీభవిస్తే అశ్రువంత స్వచ్ఛంగా కవిత్వం వెలువడుతుందన్నది కవి విశ్వాసం. అక్షరం అశ్రువులను తుడిచి స్వాంతన చేకూర్చే పరమావధి అని నమ్మి కవిత్వాన్ని తపస్సుగా కొనసాగిస్తున్న కవి దండమూడి శ్రీచరణ్. నిరంతరాన్వేషణతో గవేషణను ఆవిష్కరించిన శ్రీచరణ్ ఆలోచనామృత ధారగా, ఆత్మావిష్కరణ, ఆత్మాన్వేషణతో కూడిన తనలోని అంతర్వేదనగా ఈ కవిత్వాన్ని రక్తి కట్టించారు. తన కవితాక్షరాలు కన్నీరును తుడిచి చిరునవ్వులు పూయించి కొత్త ఊపిరుల నాట్లను వేస్తాయని భరోసా ఇస్తారు. కవిత్వం,సంగీతం తన గుండెగూటిలో గురుతుగా నిలిచిపోతాయని చెప్పుకున్నారు. శకలమైన హృదయాన్ని కన్నీళ్లతో కడిగి జీవితమంటే మంచు సంకెల కరిగే దాకా వీడని ఒక వల మృత్యువు అని చెప్పారు. తన కలంపాళీకి ముక్కలుగా జీవించడం ఇష్టముండదన్నారు.
సూర్యుడిని పరిగెత్తే వీరుడు, కర్షకుడిని తన ఊహల పొలం దున్నే శ్రామికుడిని చేశారు. ఎర్ర గులాబీని పగిలిన గుండె లోతుల్లోంచి చూశారు. పరిమళించిన అక్షరంతో పరవశించే పాటగా మారి సహవాసం చేశారు. వెలుగు నీడలో బాలుడై, భావుకుడై విహరించారు. అక్షరాలే ఆనవాళ్లుగా ఆత్మావిష్కరణ చేశారు. ఏది సత్యమో చెప్పమని మహాత్ముణ్ని అడిగాడు. శిథిలాలలో మధుర పరిమళాల స్వరాలను వినే ప్రయత్నం చేశారు. చివరికంటా తాను చిరునవ్వుతో నిలవాలని ఆకాంక్షించారు. ఒంటరిగా ఉన్నా గీతికనై మోగుతానన్నారు. కవిని లక్షల మనస్సుల్లో ఆక్షరంగా మార్చి చేర్పించారు. నిశ్శబ్దంలో మౌనరాగమయ్యారు. ఏకాంతపు రేయిలో జాలితో కరుణించిన నిదురను గుర్తు చేసుకున్నారు. జీవితాన్ని ఒక సాగరంగా భావించి చివరి వరకు పోరాడి విజేతగా నిలువమన్నారు. కవీశ్వరుడి అక్షర క్షేత్ర వ్యవసాయాన్ని విపులీకరించారు. జీవిత భ్రమనాల మధ్య కవిత్వాన్ని సాక్షిగా నిలుపుకున్నారు. బొమికలగూడులోని కదలికలను చూసి కన్నీరై కురిశారు. వర్షంలో మేఘాల సోపానాల తనివారే ధారలను గమనించారు. ఏది వాస్తవమో, ఏది కల్పనో చెప్పారు. అక్షర శిఖరాలు శిబిరాల్లా వెలుస్తాయన్నారు. కన్నీళ్లే సంకెళ్లా అని ప్రశ్నించారు. క్షమించమని నేస్తాన్ని అర్థించారు. తలపు, మెరుపు, పిడుగు అయితేనేం జలజల వానగా కురిసి నవ్వై మెరవాలని అన్నారు. మౌనాన్ని వీడి మదిలో ఆలోచనై మెదలమన్నారు. వాక్యం లోతు అర్థమై గుండెను తాకాలని చెప్పారు. అక్షర రుణం తీరదన్నారు. చెరపలేని గురుతులను జ్ఞాపకం చేసుకున్నారు.
కలివిడిగా కూడడమే తప్ప విడగొట్టడం తనకు రాదన్నారు. అనుభవాల సంపదను మనసారా మానుష వేదంగా ఆహ్వానించారు. సత్యమేవ జయతేను బతుకు సందేశమని చెప్పారు. పక్షి రెక్కలో సమన్యాయాన్ని చూశారు. మాయ ముడి విప్పితే జీవితం అర్థమౌతుందని స్పష్ట పరిచారు. ఎవడినో శత్రువుగా చూడకుండా మంచితనంతో ముందకు సాగమన్నారు. సదానందమే చివరకు సొంతమవుతుందని చెప్పారు. తరాల పునాది రాళ్లకు జోహార్లు అర్పించారు. కన్నీటిలో క్రుంగిపోయిన ఆశలను అక్షరమయం చేసి చూపి నీదినాది కన్నీరే అన్నారు. దారులెంట అక్షర తూణీరాల జయకేతనాలను ఎగరేశారు. బ్రతుకుకు అసలైన అర్థాన్ని దేహభాషలో చెప్పారు.
తూర్పు వెళ్లే రైలులో చీకటి కోణాలను చూపించారు. చెమట చుక్కల యోధత్వాన్ని అనుభూతి సంపుటిలో మొలకలెత్తించారు. జనావళికి గెలుపును ఆకాంక్షిస్తూ కవన గీతాన్ని ఆలపించారు. నిటారుగా వెన్నెముక గల ముసుగులు లేని వాళ్లు సమాజానికి అవసరమన్నారు. తొలి వేకువలోనే లక్ష్యాలను గుర్తు చేసుకొని లక్షణంగా సాగమన్నారు. కన్నీళ్లతో తడిసిన అక్షరాలు నక్షత్రాలుగా మెరిసాయని చెప్పారు. మృత్యువుపై రణభేరి మ్రోగించి మానవీయతత్వం ఎంతో గొప్పదని చాటిచెప్పారు. మనిషి కోసం, విలువల కోసం, ఆనందమయమైన జీవిత సాధన కోసం తపన పడ్డారు. శ్రమ ప్రవాహంలో కవిత్వ గడియారమై జీవిత కాలసూచికతో నడిచే ప్రయత్నం చేశారు. జీవన సంగీతంలో అనుభవాల దర్శనం చేసుకొని హృదయ కవాటాలలో ఆనంద కాంతులను నింపుకున్నారు.
కాగితాలపై ఒలికిన కన్నీరు కవిత్వ అక్షర నక్షత్రాలు అని, తాను ఎగరేసిన గవ్వలు అని చెప్పారు. హృదయాన్ని దోచుకొని దుఃఖాన్ని అరువిచ్చిన ప్రేమను నిలదీసి ప్రశ్నించారు. ఏదిరాత, ఏదిగీత అంటూ తన నుంచి తన వరకు సాగిన పరమార్థాలను లెక్కించి చివరి కానుకగా కవితను రాసి వెళ్లడమే మిగిలిందంటారు. రగిలే రాత్రులలో ఒంటరి తనం బాటన చక్రవాకమై విరచిత కావ్యాన్ని రచించానన్నారు. అనుభూతుల సంతకం, గుండెలో గరళం కవిత్వమని వివరించారు. మది గాయాలు మానేందుకు జీవిత కాలం సరిపోదంటారు. దాచుకున్న పాటను ఉషస్సులో కొత్తరాగం చేసుకొని విన్నారు. స్వప్నంలో కురిసిన అశ్రువులను కూడా తలచుకొని అక్షర జ్ఞాపకాలుగా, అస్తిత్వ నిధులుగా మార్చారు. హృదయంలో మల్లెల వానను కనుగొన్నారు. మెరీనా బీచ్లో చిరిగిన పాతచొక్కాలో విషాదపంక్తి వెలసిపోయి ఉండడం చూసి ఆవేదన చెందారు. ఎవరూ రాయని కథలో జీవన కోణాలను గమనించి నాలుగు అక్షరాలుగా మిగిల్చేందుకు అశ్రుస్వరమై ఆరాటపడ్డారు. వలసకూలీల రైలు ప్రమాద మరణాలకు తల్లడిల్లారు. బింబప్రతిబింబమై ఆత్మజ్ఞాన లోతులను తెలుసుకొని పశ్చాత్తాపం పొందాలని సూచించారు.
కవితకు చివరి వాక్యాన్ని రాసి సమిధై, కొలిమిలోంచి మరిగిన భావమై తపస్సులా సాగే జీవితంలో గాయపడి మోసిన వేదనలకు రాలిన కన్నీటి బొట్టు తడిని నిర్వచించారు. కవితై తరించడమే తనకు జీవన తృప్తి అని చెప్పుకున్నారు. స్వగతంగా సౌందర్య ప్రపంచపు ప్రవాసిగా ప్రేమలేఖై పురివిప్పారు. సహనం కలిగి జీవితాన్ని ఉన్న వ్యవధిలోనే పండిరచుకోమని సందేశించారు. పరిపూర్ణతతో కూడిన తాత్విక చింతన, కొత్త ఊహల కదంబంగా విలక్షణతతో ఈ కవిత్వం శ్రీచరణ్ కలంపాళీ నుండి వెలుగు చూసింది.
-డా.తిరునగరి శ్రీనివాస్
8466053933.