- సబ్ కా సాథ్ అంటూ టోపీ పెట్టారు
- నల్లధనం అరికట్టడంలోనూ విఫలం
- దేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోయేలా చేశారు
- ఆదానీ ఆస్తులను పెంచడంలో మాత్రం విజయం
- అసెంబ్లీ వేదికగా బిజెపిపై ధ్వజమెత్తిన మంత్రి హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని ఆర్థిక మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏ ఒక్క రంగంలోనూ పురోగతి లేదని, ఇచ్చిన హావి•లను బుట్టదాఖలు చేశారని, విభజన హావి•లను తుంగలో తొక్కారని మండిపడ్డారు. శాసనసభలో బడ్జెట్‌కు సమాధానంగా మాట్లాడిన సందర్భంగా హరీష్ రావు బీజేపీని దుయ్యబట్టారు. గతంలో బడ్జెట్లను ప్రవేశపెట్టేటప్పుడు ఒక దశ దిశ ఉండేది. ఆర్థిక సర్వేలకు దగ్గరగా కేంద్ర బడ్జెట్ ఉండేదన్నారు. దానికి తగినట్టు దేశ ప్రగతి కూడా ఉండేదన్నారు. కానీ బీజేపీ అధికారంలోకి వొచ్చిన తొమ్మిదేండ్లలో బడ్జెట్‌లో చెప్పేది ఒకటి, ఆచరణలో చేసేది మరొకటి అని హరీష్ రావు పేర్కొన్నారు. మోదీ మొదటి బడ్జెట్‌లో చెప్పిన థీమ్…సబ్ కా సాత్.. సబ్ కా వికాస్. కానీ ఆ ఏడాదంతా మాబ్ లించింగ్‌లు జరిగాయి. రెండో బడ్జెట్‌లో నల్లధనాన్ని అరికడుతామని చెప్పారు. కానీ మరుసటి సంవత్సరమే పెద్ద నోట్లను రద్దు చేశారు. ఆర్థిక వ్యవస్థ చితికి పోయిందని గుర్తు చేశారు.
దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజల బతుకులు రోడ్డున పడ్డాయని మంత్రి తెలిపారు. నల్లధనం తెచ్చి, ప్రజల ఖాతాల్లో వేస్తామని మోదీ చెబితే..ప్రజలు జన్‌ధన్ ఖాతాలు తెరిచి ఎదురుచూస్తున్నారు. ఇప్పటికి కూడా ఒక్క పైసా డిపాజిట్ కాలేదన్నారు. మూడో బడ్జెట్‌లో రైతులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రకటించారు. కానీ రైతులను పట్టించుకోకుండా, 2020లో మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చారని తెలిపారు. 750 మంది రైతులు ఉసురు పోసుకున్నారని గుర్తు చేశారు. ఈ దేశ ప్రజలను మోదీ ప్రభుత్వం మోసం చేసిందని హరీష్ రావు మండిపడ్డారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు.. ఇవ్వలేదు. అర్హులైన వాందరికి ఇండ్లు అని ప్రకటించారు.. అది అడ్రస్ లేదు. రైతుల ఆదాయం రెట్టింపు చేయలేదు. నదుల అనుసంధానం కాలేదు. అంతే కాదు.. బీజేపీ విజయాలు కూడా కొన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. జీడీపీని మంటగలపడంలో బీజేపీ సక్సెస్ అయింది. ఫుడ్ సెక్యూరిటీని నాశనం చేయడంలో, రూ. 160 లక్షల కోట్ల అప్పులు చేయడంలో, సెస్సుల రూపంలో అడ్డగోలుగా పన్నులు వేయడంలో, సిలిండర్ ధరలు పెంచడంలో, పసి పిల్లలు తాగే పాలవి•ద కూడా జీఎస్టీ విధించడంలో, ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలగొట్టడంలో, ప్రతిపక్షాలపై ఈడీ, సీబీఐ దాడులు చేయించడంలో, రాజ్యాంగ వ్యవస్థల విశ్వసనీయతను కాలరాయడంలో, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడంలో, అదానీ ఆస్తులు పెంచడంలో, మతపిచ్చి మంటలు రేపడంలో బీజేపీ ప్రభుత్వం సక్సెస్ అయిందని హరీష్ రావు చురకలంటించారు.
బిజెపి పాలకుల ఇది అమృత్ కాలమైతే..దేశ ప్రజలకు మాత్రం కనీసం తాగునీరు దొరకని ఆపద కాలమని మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకంతో దేశం ముందు ఓ మోడల్‌ను పెట్టింది. దీన్ని చూసి కూడా మిగతా రాష్ట్రాలు ఎందుకు చేయలేకుపోతున్నయ్. నిధులు లేకనా? నీళ్లు లేకనా? అసలు విషయం ప్రజల పట్ల ప్రేమ, మమకారం లేకపోవడం. ఏ రాష్ట్రంలోనూ తెలంగాణ తరహాలో పథకాలు అమలుకావడం లేదని హరీష్ రావు అన్నారు.