అప్నే పైర్‌ ‌పర్‌ ‌కులాఠీ మార్‌నా…అప్నే పైర్‌ ‌పర్‌ ‌కులాఠీ మార్‌నా…

కొందరికి లోక జ్ఞానం లేకనో లేక సంబంధిత• విషయంపైన అవగాహన లేకనో తప్పులు చేస్తుంటారు. కాని, అన్నీ తెలిసి, తన వాక్‌చాతుర్యంతో ఎదుటివారిని నమ్మించగల నేర్పరితనం ఉండీ, రాజకీయాల్లో అపర చాణిక్యుడిగా, మాయల మరాఠీగా పేరుతెచ్చుకుని కూడా పప్పులో కాలువేసే వ్యక్తికి ..అప్నే పైర్‌ ‌పర్‌ ‌కులాఠీ మార్‌నా’ అన్న హిందీ నానుడి సరిగ్గా సరిపోతుంది. అంటే తాను ఫలానా పని చేయడం వల్లనో లేదా ఇతరు వేలెత్తి చూపే మాట మాట్లాడటం వల్ల తనకు నష్టం వాటిల్లుతుందని తెలిసికూడా అలానే ప్రవర్తించడమన్నది నష్టాన్ని కావాలని కొని తెచ్చుకోవడమే అవుతుంది. ఎదో తత్తర పాటులోనో, ఆవేశంలో నోరుజారితే సరిపెట్టుకోవచ్చు. కాని, ఎలాంటి తొణుకుబాటు లేకుండా మూడు భాషల్లో అనర్గళంగా ఏకధాటిగా గంటల కొద్ది మాట్లాడగల నేర్పరితనంతోపాటు, తాను ఏ మాట్లాడుతున్నది, ప్రజల్లోకి ఎలాంటి సందేశాన్ని తీసుకు వెళ్ళాలన్న పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి తననే వేలెత్తి చూపించే విధంగా మాట్లాడమన్నది అందరినీ ఆశ్చర్యంలో ముంచింది. అదునుకోసం ఎదురు చూసే ప్రతిపక్షాలకు ఉన్న ఆయుధాలకు మరో కొత్త ఆయుధం తోడైనట్లైంది. అసలు విషయానికొస్తే.. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బిఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తమ పార్టీ ప్రజాప్రతినిధులను హెచ్చరించే క్రమంలో మాట్లాడిన తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. చాలాకాలంగా బిఆర్‌ఎస్‌ను ఏకాకిని చేస్తూ దాదాపు రాష్ట్రంలోని విపక్షాలన్నీ కెసిఆర్‌పైన, ఆయన కుటుంబంపైన అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ వొస్తున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం నుండి ఆర్థిక పరిపుష్టిగల రాష్ట్రంగా చెబుతూ వొచ్చిన కెసిఆర్‌ ‌గత తొమ్మిదేళ్ళలో అప్పుల కుప్పగా తయారుచేశారని ప్రతిపక్షాలు గొంతు చించుకుంటున్నాయి. ఈ తొమ్మిదేళ్ళలో చేపట్టిన పథకాలవల్ల రాష్ట్రం స్వర్ణ తెలంగాణగా మారిందంటున్న ప్రభుత్వ అవినీతిపైన ఆ పక్షాలు నిత్యం గగ్గోలు పెడుతూనే ఉన్నాయి. దేశంలోనే వింతైన ప్రాజెక్టుగా చెప్పుకుంటున్న కాళేశ్వరాన్ని కెసిఆర్‌ ఏటిఎంగా వర్ణిస్తున్న ఆ పక్షాలకు ఇప్పుడు మరో ఆయుధాన్ని స్వయంగా కెసిఆరే అందించడమన్నది పైన చెప్పుకున్నట్లు ‘అప్నే పైర్‌ ‌పర్‌ ‌కులాఠీ మార్‌నా’ అన్న సామెత సరిగ్గా సరిపోయింది. ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం అమలులో తమ పార్టీ ఎమ్మెల్యేలే• లంచం తీసుకుంటున్నారని స్యయంగా ముఖ్యమంత్రి హోదాలో కెసిఆర్‌ ‌మాట్లాడటమన్నది తమది అవినీతి ప్రభుత్వంగా ఆయనకు ఆయనే చెప్పుకున్నట్లు అయింది. తాను ఎలాంటి అవినీతిని సహించనని నిగూడంగా హెచ్చరించాల్సిందిపోయి ఏ మేరకు లంచాలు తీసుకుంటున్నారన్న విషయాన్ని కూడా ఆయన విపులీకరించారు. ఎంత లంచం తీసుకుంటున్నారన్న సంఖ్య కూడా చెప్పిన విధానమేమైతే ఉందో అది తనపైన దాడికి విపక్షాలకు ఆయనే అవకాశాన్నిచ్చినట్లైంది.
ఆ సమావేశంలో ఆయన ఏమన్నారన్నది ఒకసారి పరిశీలిస్తే.. ‘దళిత బంధు పథకం అమలులో కొందరు ఎంఎల్యేలు లబ్ధిదారుల వద్ద మూడు లక్షల రూపాయల వరకు డబ్బులు తీసుకున్నారు. అలా అవినీతికి పాల్పడిన వారి చిట్టా నా దగ్గర ఉంది. ఇది రిపీట్‌ అవుతే భవిష్యత్‌లో టికట్‌ ఇవ్వకపోవడమేకాదు, అలాంటివారు పార్టీలోనే ఉండరు. మీరే కాదు, మీ అనుచరులెవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడ్డా అందుకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. నేను ఇప్పటికే చాలా సార్లు చెప్పిన .. అయినా వైఖరి మార్చుకోవడంలేదు. సరిగ్గా పనిచేయని వారి తోక కత్తిరిస్తా’ అంటూ ఆయన చేసిన ప్రసంగం ఒక విధంగా రాజకీయ రంగంలో పెద్ద దుమారాన్నే లేపింది. ప్రతిపక్షాలన్నీ ఒక్కసారే ఆయనపై విరుచుకు పడ్డాయి. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాల్లో అవినీతి జరుగుతున్నదని తాము మొదటినుండీ మొత్తుకుంటూనే ఉన్నామంటున్నాయి ఆ పక్షాలు. అవినీతిపై ఇప్పటికే అనేకసార్లు హెచ్చరించినట్లు చెబుతున్న ముఖ్యమంత్రి అలాంటి ఎమ్మెల్యేలను ఇంతకాలం ఎందుకు ఉపేక్షిస్తున్నట్లు, వారిపైన ఇంతకాలంగా ఎందుకు చర్య తీసుకోవడంలేదని వారు నిలదీస్తున్నారు. తన వద్ద వారి జాబితా ఉందని చెబుతున్నప్పుడు వారి పేర్లను బయటపెట్టడంతోపాటు, వారిని పార్టీనుండి వెంటనే బర్త్‌రఫ్‌ ‌చేయాలని వారు డిమాండ్‌ ‌చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న దాదాపు అన్ని పథకాల్లోనూ అవినీతి చోటుచేసుకుందని, ప్రతీ పథకంలో ప్రజా ప్రతినిధులు వాటాలు పంచుకుంటూనేఉన్నారు. చిన్న పథకాల్లో క్రింద స్థాయి నాయకులు వసూళ్ళకు పాల్పడుతుంటే డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌, ‌కల్యాణ లక్ష్మీ, దళిత బంధు లాంటి వాటిల్లో ఎమ్మెల్యేలు పర్సంటేజీలు తీసుకుంటున్నారని బిజెపి ఎమ్మెల్యేలు రఘనంథన్‌రావు, ఈటల రాజేందర్‌, ‌వైఎస్‌ఆర్‌టిపి అధినేత్రి షర్మిల, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క తదితరులు ఆరోపిస్తున్నారు. సొంత ఎమ్మెల్యేలు లంచం తీసుకుంటున్నారని తెలిసికూడా వారిపై చర్య తీసుకోకపోవడమన్నది ఈ ప్రభుత్వ చాతగాని తనానికి నిదర్శనమని, ఇప్పటికైనా వారిని బయటపెట్టి వారు వసూలు చేసిన డబ్బును తిరిగి లబ్ధిదారులకు ఇప్పించాలని వారు డిమాండ్‌ ‌చేస్తున్నారు. సుమారు 17 లక్షల దళిత కుటుంబాల అభివృద్ధికోసం ప్రవేశపెట్టిన ఈ పథకంలో కెసిఆర్‌ ‌చెప్పినట్లు ముప్పై శాతం కమీషన్‌ ‌తీసుకుంటున్నారంటే ఎన్ని కోట్ల రూపాయలను ప్రతినిధులు పంచుకుంటున్నారన్నది అర్థమవుతున్నది. ఇంతకాలం ప్రతీ పథకంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవముందన్న విషయాన్ని కెసిఆర్‌ ఒక్క మాటతో ఒప్పుకున్నట్లైంది. తమ ఎమ్మెల్యేల అవినీతిపైన తానే స్వయంగా ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని, కాని పక్షంలో న్యాయస్థానం దీన్ని సుమోటోగా స్వీకరించి విచారణ జరిపించాలని విపక్షాలు డిమాండ్‌ ‌చేస్తున్నాయి. మాయల మరాఠీగా, రాజకీయ దురంధరుడిగా పేరున్న కెసిఆర్‌ ‘ అప్నే పైర్‌ ‌పర్‌ ‌కులాఠీ మార్‌నా అన్న సామెతకు అద్దం పట్టే రీతిలో తాను మాట్లాడే ప్రతీ మాట ప్రజల్లోకి వెళ్తుందని తెలిసికూడా తమ ప్రభుత్వంపైన తానె నిందవేసుకుని ఎందుకు నష్టాన్ని కొని తెచ్చుకున్నాడన్నది అంతుపట్టని విషయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page