నేడు అబ్దుల్ కలాం జయంతి, ప్రపంచ విద్యార్ధుల దినోత్సవం
క్షిపణి పితామహుడు ‘‘అబ్ధు ల్ కలాం’’ సార థ్యంలో రాజ స్థాన్ లోని ఫోఖ్రాన్ లో రెండవదశ అణు పరీక్షలు జరగడం, ఐదు న్యూక్లియర్ శ్రేణుల ప్రయోగం విజయ వం తంగా నిర్వహించడంతో భారతదేశం అణ్వస్త్ర దేశాల సరసరచేరింది. ‘‘న్యూక్లియర్ క్లబ్ ‘‘లో చేరిన 6 వ దేశంగా భారతదేశం చరిత్ర పుటల్లో స్థానం సంపాదించింది. ప్రపంచమంతా భారత్ సాహసానికి ఉలిక్కిపడింది. అణు పరీక్షలు నిర్వహించినందుకు భారతదేశంపై అనేక దేశాలు ఆర్ధిక,సాంకేతిక పరమైన ఆంక్షలు విధిం చాయి.ప్రపంచదేశాల ద్వంద్వ ప్రమాణాలను ఎదురించి ఫోఖ్రాన్-2 అణుపరీక్షలను అత్యంత విజయవంతంగా నిర్వహించడం వలన అబ్దుల్ కలాం పేరు మారు మ్రోగిపోయింది. అప్పటి వరకు ఒక శాస్త్రవేత్తగా,భారతీయ క్షిపణి వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన సాహసిగా పేరొందిన కలాం భారత రాష్ట్రపతిగా నిర్వర్తించిన రాజ్యాంగ విధులు,నిష్ఫక్షపాత వైఖరి, విద్యార్ధుల కోసం,యువత భవిష్యత్తు కోసం పడిన తపన దేశ ప్రజలను విశేషంగా ఆకర్షించింది. అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయన జీవితాన్ని రేఖామాత్రంగా నైనా స్ఫృశించాలి. ఆ మహనీయుని స్ఫూర్తిని, ఆశయాలను ముందుకు తీసుకుపోవాలి.
ఏదో విధంగా జీవించి,తరతరాలకు తరగని ఆస్తిని గడించి,బ్రతుకు చాలించడం వలన ఫలితమేమి? బ్రతికున్నంత వరకు జనం గుర్తించడం,మరణించిన తర్వాత మరచి పోవడం వలన జీవితానికి సార్ధకత చేకూరదు. మరణించినా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా జీవించగలగడం కొందరికే సాధ్యం.అలాంటి జీవితాలు ఆదర్శప్రాయం. భౌతిక దేహాన్ని త్యజించినా, తరాలు మారినా తరగని ఖ్యాతితో మరణమంటూ లేని మహనీయులెందరో ఈ భరత భూమి పై జన్మించారు. లాల్ బహదూర్ శాస్త్రి, గుల్జారీ లాల్ నందా వంటి నిజాయితీ పరులు, నిస్వార్థ దేశభక్తులు జన్మించిన భరత భూమిపై నేటి తరం జనానికి తెలిసిన ఆణిముత్యం‘‘అబ్దుల్ కలాం’’.పేదరికంలో జన్మించి,అంచెలంచెలుగా ఎదిగి,ఎంతగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినా, ఎన్ని అవార్డులు పొందినా,ఎన్ని పదవులు అధిరోహించినా అత్యంత నిరాడంబరంగా జీవించి ప్రజల మన్ననలు పొంది, మరణించినా భరతజాతి గుండెల్లో సజీవంగా నిలిచిన అబ్దుల్ కలాం ఖ్యాతి చిరస్మరణీయం.విజ్ఞాన సాగరాన్ని మధించి, యువ విద్యార్థుల్లో తన ప్రసంగాల ద్వారా, రచనల ద్వారా చైతన్యాన్ని రగిలించి, భారత దేశ ఔన్నత్యాన్ని శిఖరాగ్ర పథాన నిలబెట్టిన అబ్ధుల్ కలాం ఒక మానవతావాది,నిగర్వి. అతనొక విజ్ఞానపు వింధ్యామర- చైతన్య స్వరం. కలాం ఆశయాలకు, ఆదర్శాలకు విశ్వమంతా సలాం కొడుతుంటే, భారత జన హృదయాలు ఉప్పొంగిన కెరటంలా ఉల్లాస భరితమై,గర్వంగా తలెత్తుకుని, జయజయధ్వానాలు సమర్పిం చాయి.
అలాంటి మహనీయుడు భారతీయ గడ్డపై జన్మించడం మహద్భాగ్యం.కనురెప్పలు కంటికి కాపలా,సైనికులు దేశానికి కాపలా, యువశక్తి దేశానికి ఆలంబన, విద్యార్ధుల నైపుణ్యం దేశాభ్యు దయానికి బాసట. విద్యార్ధిలోకం విజ్ఞానంతో వికసిస్తే, దేశానికి వినియోగ పడే నవ్యమైన ఆలోచనలు పురివిప్పి నాట్యమాడితే,సంధ్యా సమయం కూడా సూర్యోదయం లా గోచరిస్తుంది. నిండుజాబిల్లి వెలుగు జిలుగులతో కారుచీకటి సైతం కానలకు పారిపోగలదు. జాతికి జవసత్వాలు కల్పించే విద్యార్థులను అన్నిరంగాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దినప్పుడే ప్రగతి పరుగులు పెడుతుంది. ప్రపంచ పటంలో భారతదేశం అగ్రగామిగా సగర్వంగా నిలబడుతుంది. విద్యార్ధులు కేవలం పట్టాల కోసం యత్నించరాదు. విజ్ఞాన గంధంతో పరిమ ళించాలి. వ్యక్తిత్వంతో వికసించాలి. నైపుణ్యం కొరవడిన విద్యార్ధుల చదువులు, వ్యక్తిత్వం, వికాసం, వెన్నెముక లేని యువశక్తి దేశానికి బరువే తప్ప, పరువు కాదు.విద్యార్ధుల్లో విజ్ఞాన పిపాస ఉత్తుంగ తరంగంలా ఎగసిపడాలి. పడిన కెరటం మరింత శక్తిలో లేచి, ఆకాశాన్ని అంటాలి. యువశక్తి సకారాత్మకంగా స్పందించాలి. దేశాభ్యున్నతి కోసం తపించాలి.
దేశభక్తి జ్వలించాలి.అలాంటి తపనతో, ఉన్నతమైన,ఉత్తమమైన ఆలోచనలతో విద్యార్ధి లోకాన్ని జ్వలింప చేయాలని అహరహం శ్రమించిన నిత్య శ్రామికుడు, స్వాప్ని కుడు,యువత స్వప్న సౌధాల సాకారానికి తుదిశ్వాస వరకు యత్నించిన తపస్వి,యశస్వి, భారతీయ గడ్డకు మహోజ్వలమైన కీర్తిని కల్పించి,ఖండాంతర ఖ్యాతి నార్జించిన విజ్ఞాన గని ఎ.పి.జె అబ్దుల్ కలాం. కలాం ఒక శాస్త్రవేత్తగా, ప్రజల మనిషిగా, రాష్ట్రపతిగా, క్షిపణి పితామహుడిగా వేనోళ్ళ కొనియాడబడి, చరిత్రలో శాశ్వత అధ్యాయంగా నిలిచి పోయాడు. కలాం రచనలు నేటి యువతకు ఉత్ప్రేరకాలు.కలాం రచనలు, వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, ఆయన సందేశాలు నేటి యువతరానికి ఎంతగానో ఉపయుక్తకరంగా ఉంటాయి.కలలు ఆలోచనలు గా పరివర్తన చెంది, ఆలోచనలు ఆచరణ సాధ్యం కావడానికి శ్రమించాలనే కలాం ఆశయాలు విద్యార్ధులకు స్ఫూర్తిదాయకం. కలాం కు విద్యార్థులంటే ఆసక్తి,ఆప్యాయత మెండు.తాను ఆశించిన స్పప్నసౌధాల సాకారానికి విద్యార్ధులే పునాదులని నమ్మిన ‘‘అబ్ధుల్ కలాం’’ ఆలోచనలకు గౌరవ సూచకం గా ఐక్యరాజ్య సమితి ఆయన జన్మదినమైన అక్టోబర్ 15 వ తేదీని ‘‘ప్రపంచ విద్యార్ధుల దినోత్సవం’’ గా ప్రకటించింది.
ఈ ప్రపంచంలో ఎంతో మంది మహనీయులు ఎంతో శ్రమించి తమ తరువాతి తరాల సుఖమయ జీవనానికి బాటలు వేసారు. థామస్ ఆల్వాఎడిసన్, ఐజాక్ న్యూటన్, ఆల్బర్ట్ ఐన్ స్టీన్, స్టీపెన్ హాకింగ్, జగదీష్ చంద్రబోస్, సి.వి.రామన్, హోమీ జహంగీర్ బాబా వంటి శాస్త్రవేత్తల అవిరళ కృషి కారణంగా ప్రపంచం పలు రంగాల్లో ముందంజలో దూసుకు పోయింది. ఈ ఆధునిక కాలంలో మనముందు నడయాడిన, మనకు తెలిసిన,మనం చూసిన మహా ప్రజ్ఞావంతుడైన శాస్త్రవేత్త, మానవతా వాది,క్షిపణి పితామహుడు,భారత రత్న అబ్ధుల్ కలాం జీవితం అన్ని రంగాలలోని ప్రజ్ఞావ ంతులకు ఆదర్శప్రాయం కావాలి. ప్రతిభ స్వార్ధ ప్రయోజ నాలకు కాకుండా,దేశ ప్రయోజనాలకు వినియోగపడాలని చాటి చెప్పి,అంతిమ శ్వాస వరకు, ఆశయాలకోసం,ఆదర్శాలకోసం జీవించి, భౌతికంగా గతించినా భారత ప్రజల హృదయాల్లో సజీవ స్థానం సంపాదించిన భారతరత్న ఎ పి.జె. అబ్ధుల్ కలాం ప్రాతః స్మరణీయుడు.
సుంకవల్లి సత్తిరాజు,
సంగాయగూడె, ఏపీ
9704903463.