అభ్యాస అనుభవాన్ని పొందిన ఆవిష్కార్ విద్యార్థులు

పటాన్ చెరు, ప్రజాతంత్ర, నవంబర్ 17:  ఆవిష్కార్ జూనియర్ కళాశాల విద్యార్థులు, వారి అధ్యాపకులతో పాటు  హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయాన్ని శుక్రవారం సందర్శించి విలువైన అభ్యాస అనుభవాన్ని పొందడంతో పాటు నాణ్యమైన విద్య, పరిశోధన, కార్యనిర్వాహక శిక్షణ ప్రపంచాన్ని అన్వేషించే అవకాశాన్ని పొందారు. గీతం విద్యా సంస్థ సామాజిక బాధ్యతలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థులు, అధ్యాపకుల నైపుణ్యాలు, జ్ఞానాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.మూడు బృందాలుగా విభజించిన సుమారు 275 మంది 12వ తరగతికి చెందిన ఎంపీసీ విద్యార్థులు గీతమ్లోని వివిధ విభాగాలు, మౌలిక సదుపాయాలు, అధునాతన ప్రయోగశాలలు, అత్యాధునిక గ్రంథాలయం వంటి వాటిని సందర్శించారు. ఇందులో భాగంగా ఏరో క్లబ్, జీ ఎలక్ట్రా, నెహ్రుణ్యాభివృద్ధి కేంద్రం, సివిల్, మెకానికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ల్యాబ్లను కూడా చూసి, పలు వివరాలు తెలుసుకున్నారు.కోర్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ వి. రామశాస్త్రి గీతం, దాని విభిన్న కార్యక్రమాల గురించి వివరించారు. ఆయా విభాగాలపై లోతైన అవగాహనను అందించడంతో పాటు ప్రతి విభాగంలోని ప్రత్యేకతలు, కెరీర్ అవకాశాలను వివరించారు. ఈఈసీఈ విభాగానికి చెందిన ప్రొఫెసర్ కె. మంజునాథాచారి వందన సమర్పణ చేశారు. డాక్టర్ ఆరిఫ్ మహ్మద్ అబ్దుల్, డాక్టర్ కె.ప్రవీణ్ కుమార్, హెచ్. రవి తదితరులు ప్రయోగాత్మక అనుభవ కార్యకలాపాలను ఈ సందర్భంగా నిర్వహించారు. లిబరల్ ఎడ్యుకేషన్పై సెన్స్డ్ అధ్యాపకులు చర్చాగోష్ఠిని నిర్వహించి, చక్కటి విద్య ప్రాముఖ్యత, వ్యక్తిగత-వృత్తిపరమైన వృద్ధిపై దాని ప్రభావాలను విడమరిచి చెప్పారు.గీతం హైదరాబాద్ అడ్మిషన్స్ విభాగాధిపతి డాక్టర్ కె. శివకుమార్, ఆయన సహోద్యోగి ఎన్.శివమల్లికార్జున రావు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. ఆవిష్కార్ విద్యార్థులను గీతము స్వాగతించడం ఆనందంగా ఉందని, నాణ్యమైన విద్య, వివిధ రంగాలలోని అపార కెరీర్ అవకాశాలు జూనియర్ కళాశాల విద్యార్థులకు తెలియజేశామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page