తొలితరం ఖ్యాతి గాంచిన పాత్రికేయులలో, సంపాదకులలో పండితారాధ్యుల నాగేశ్వరరావు ఎన్నదగిన వారు. గుంటూరు జిల్లా, ఇంటూరు గ్రామంలో 1912, మార్చి 26న మల్లయ్య, భైరవాంబ దంపతులకు జన్మించారు. గుంటూరు లోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో విద్యాభ్యాసం చేశారు. అనంతరం పత్రికా రచయితగా ప్రసిద్ధి గాంచారు. పిఠాపురం మహా రాజా వారి దేశబంధు పత్రికలో కొన్నాళ్లు పనిచేసి, ఆచార్య రంగా నెలకొల్పిన వాహిని పత్రికలో 1932లో చేరారు. 1943 నుంచి 1959 వరకూ ఆంధ్రపత్రికలో పని చేశారు. 1960లో ఆంధ్రభూమి సంపాదకునిగా విశేషమైన సేవలందించారు. ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో వెలువడిన ఆంధ్ర జనతకు 1965లో ఏడాదిపాటు సంపాదకత్వం వహించారు. 1966 నుంచి మరణించే(1976) వరకూ ఆంధ్రప్రభ బెంగళూరు రెసిడెంట్ ఎడిటర్‌గా పని చేశారు. ఆ పత్రికలతో పాటుగా గోభూమి, క్రాంతి, సంజయ, ప్రజాప్రభ వారపత్రిక, •వ•వ••తీఱ•అ పత్రికలలో సంపాదకునిగా పని చేశారు.
1969-72 మధ్య కాలంలో రాష్ట్రంలో తలెత్తిన వేర్పాటు వాద ఉద్యమ సందర్భాలలో సమన్వయానికి, సంఘటితత్వానికి దోహదం చేయడంలో ప్రముఖపాత్ర నిర్వహించారు. పండిత పాత్రికేయులుగా ప్రఖ్యాతి గాంచిన పండితారాధ్యుల నాగేశ్వర్ రావు 1976 నవంబరు 13న తుదిశ్వాస విడిచారు.
పదునైన పదజాలంతో చెప్ప దలుచుకున్న తన భావాన్ని సూటిగా చెప్పంలో ఆయన కాయనే సాటి. రచనలో పటుత్వం, భాషలో పట్టు, ఆయన ప్రతిభను ఇనుమడింప చేస్తాయి. 19 వ శతాబ్దపు తొలి దశకంలో రచనలు ప్రజలలో చైతన్యాన్ని రగిల్చాయి. ఆనాటి పత్రికలూ, వారి చైతన్యాన్ని ఇనుమడింప చేసాయి. నాటి పత్రికాధిపతులు, పత్రికల దారా సామాజిక న్యాయాన్ని కాంక్షించి ప్రచురణ సాగించే వారు. ప్రధానంగా స్వతంత్రం పోరాటంలో ఉద్యమ స్ఫూర్తిని ప్రబోధించే రచనలను, రచయితలను, ప్రోత్సహించే స్పందన సాంప్రదాయానికి గట్టి పునాది వేసారు. ఫలితంగా ముద్రణారంగం ఒక పరిశ్రమగా ఆవిర్భవించింది. ఆ పరిశ్రమ ఎందరికో ఉపాధి కల్పించడంతో పాటు సామాజిక ప్రగతికి సోపానాలుగా దినదినాభివృద్ధి చెందుతూ వచ్చాయి. నాగేశ్వరరావు పాత్రికేయ వృత్తికి ఒక గౌరవ ప్రదమైన స్థానాన్ని సంతరింప చేశారు. పత్రికా రంగంలో అలనాటి మేటి పాత్రికేయుల జాబితాలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని స్వంతం చేసుకున్నారు. వర్ధమాన పాత్రికేయులకు నాగేశ్వరరావు సంపాదకీయాలు, రచనలు ఎంతగానో తోడ్పడ గలవనేది నూటికి నూరుపాళ్లు నిజం.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494