ప్రజాతంత్ర , హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా అవయవ మార్పిడి వంటి ఖరీదైన చికిత్సను ప్రభుత్వ దవాఖానాలలో అందిస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావు చెప్పారు. దేశంలో అవయవ దానాన్ని పారదర్వకంగా ప్రారంభించిన రాష్ట్రం తెలంగాణ అనీ, కేంద్ర ప్రభుత్వం ఇతర అనేక రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని తెలిపారు. శనివారం రవీంద్రభారతిలో జీవన్‌దాన్ ఆధ్వర్యంలో అవయవ దానం చేసిన వారి కుటుంబ సభ్యులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2020లో 88 కుటుంబాలు అవయవ దానం చేశాయనీ, తద్వారా వందల మందికి ప్రాణదానం చేశారని పేర్కొన్నారు.
అవయవ దానం చేయాలనేది కుటుంబ సభ్యుల గొప్ప నిర్ణయమనీ, తమ వాళ్లను కోల్పోయినా ఇతరులకు ప్రాణదానం చేయడం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. వీళ్లను చూసి ఇతరులు కూడా ముందుకు రావాలనీ, వైద్యరంగం ఎంతగా అభివృద్ధి చెందినా కిడ్నీ, లివర్, హార్ట్ వంటివి ఇంకా కృత్రిమంగా తయారు చేసుకోలేక పోతున్నామన్నారు. కాబట్టి అవయవ దానం చేయడం ఎంతో ఉత్తమమనీ, ఇప్పటి వరకు 1000 మంది అవయవ దానం చేశారనీ, వారి ద్వారా సుమారు 4 వేల మంది ప్రయోజనం పొందారని చెప్పారు. ప్రస్తుతం జీవన్‌దాన్‌లో 8 వేల మంది రిజిస్టర్ అయ్యారనీ, వారు నాలుడైదు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. గాంధీ, ఉస్మానియా దవాఖానాలలో 400 ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్లు జరిగాయనీ, ఇందుకు ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షలు అందజేస్తున్నామనీ, అంతే కాకుండా వారికి ప్రతీ నెలా ఉచితంగా రూ.20 వేల మందులు అందిస్తున్నట్లు ఈ సందర్భంగా హరీష్ రావు వెల్లడించారు.