అవినీతికి పరాకాష్ట..

  • పదేళ్లలతో దోపిడీ చేయని రంగం లేదు
  • గొర్రెల స్కీమ్‌, కేసీఆర్‌ కిట్లు, బతుకమ్మ చీరలు…అనీ స్కామ్‌లే
  • గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి
  • ఇంకా అబద్ధాలతో సభను తప్పుదోవ పట్టించలేరు
  • అసెంబ్లీలో హరీష్‌ రావు వ్యాఖ్యలపై సిఎం రేవంత్‌ ఘాటుగా సమాధానం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 27 : పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ అన్ని రంగాల్లో అవినీతి చేసిందని అసెంబ్లీ సాక్షిగా సిఎం రేవంత్‌ మండిపడ్డారు. గొర్రెల స్కీమ్‌, కేసీఆర్‌ కిట్లు, ఆఖరుకు ఆడ బిడ్డలకు ఇచ్చే బతుకమ్మ చీరల్లోనూ స్కామ్‌ చేశారని తీవ్రంగా విమర్శించారు. ఇంత జరిగినా సభలో మాజీ మంత్రి హరీష్‌ రావు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని కౌంటర్‌ ఇచ్చారు. ఇలా తప్పుడు లెక్కలు చెప్తేనే ఎంపీ ఎన్నికల్లో ప్రజలు గుండుసున్నా ఇచ్చారని ఎద్దేవా చేశారు. రంగారెడ్డి జిల్లాలో భూములను కొల్లగొట్టి..చేవెళ్ల ప్రాజెక్టును నిర్వీర్యం చేసి..సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని రేవంత్‌ ఫైర్‌ అయ్యారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా హరీష్‌ రావు వ్యాఖ్యలకు సిఎం రేవంత్‌ రెడ్డి ఘాటుగా స్పందించారు. గత బిఆర్‌ఎస్‌ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అప్పుల లెక్కలు చెప్పిన హరీష్‌ రావు అమ్మకాల లెక్కలు చెప్పట్లేదని, బీఆర్‌ఎస్‌ హయాంలో రూ.లక్షల కోట్ల విలువైన ఓఆర్‌ఆర్‌ను రూ.7 వేల కోట్లకు అమ్మారని, పదేళ్లలో పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేయలేదని విమర్శించారు. కేసీఆర్‌ పాలనలో రంగారెడ్డి జిల్లాలో భూములు అమ్ముకున్నారని, బతుకమ్మ చీరలు అని చెప్పి సూరత్‌ నుంచి కిలోల లెక్క తీసుకువచ్చి పంపిణీ చేశారన్నారు. బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధంగా ఉన్నారా అని రేవంత్‌ రెడ్డి ఈ సందర్భంగా హరీష్‌ రావును ప్రశ్నించారు. హరీష్‌ నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నిండు సభలో అబద్ధాలు మాట్లాడితే సహించబోమన్నారు.

మోటార్లకు విూటర్లు పెడుతామని 2017లో అప్పటి ప్రభుత్వం ఒప్పుకుంది నిజం కాదా..అని ప్రశ్నించారు. ఆధారాలతో సహా డాక్యుమెంట్లను హరీష్‌కు ఇస్తున్నామని చెప్పారు. అబద్ధాలను రికార్డ్‌ల నుంచి తొలగించకుంటే కొత్త సభ్యులు నిజమనుకుంటారని అన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. సభలో సభ్యులు తప్పు మాట్లాడితే సరిదిద్దాల్సిన బాధ్యత సభానాయకుడిగా తనపై ఉందన్నారు రేవంత్‌. ప్రతిపక్షానికి తగిన సమయం ఇచ్చామని, మంత్రి కోమటిరెడ్డి అన్నట్లు హాఫ్‌ నాలెడ్జ్‌..కెసిఆర్‌ది ఫుల్‌ నాలెడ్జ్‌ అంటూ చేయిచూపుతూ ఎద్దేవా చేశారు. హరీష్‌ రావు సభను, సభ్యుaశ్రీఱ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, మోటార్లకు విూటర్ల విషయంలో వాళ్లేదో కేంద్రంతో నిలబడి కొట్లాడినట్లు మాట్లాడుతున్నరని, ఇది అబద్ధమని, వారి తప్పులను కప్పి పుచ్చుకోవడానికి సభలో బుకాయించడం సరికాదని అన్నారు. ఈ విషయంలో రికార్డులను సవరించాల్సిన అవసరం ఉందని, విూటర్ల విషయంలో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను సభ ముందు ప్రవేశపెడుతున్నానని, ఆరు నెలల్లో డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్స్‌ వద్ద విూటర్లు బిగిస్తామని 4 జనవరి 2017న ఒప్పందం చేసుకున్నారని, ఈ ఒప్పందంపై అధికారులు అజయ్‌ మిశ్రా, రఘుమా రెడ్డి, ఏ.గోపాల్‌ రావు సంతకం పెట్టారని, మోదీ ప్రభుత్వంతో ఆనాడు ఆరు నెలల్లోగా డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్ఫార్మర్స్‌కు విూటర్లు బిగిస్తామని కేసీఆర్‌ ఒప్పందం కుదుర్చుకున్నారని రేవంత్‌ స్పష్టం చేశారు.

సభలో నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్న హరీష్‌ రావు..వారి హయాంలో జరిగిన ఒప్పందాలను చదువుకుని మాట్లాడాలని సూచించారు. అబద్ధాలతో ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలను మభ్య పెట్టాలని చూస్తే వారు నమ్మడానికి సిద్ధంగా లేరని చెప్పారు. ప్రజలు శిక్షించినా వాళ్ల ఆలోచన మారలేదని, అదే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని, లక్షల కోట్ల విలువైన ఔటర్‌ రింగ్‌ రోడ్డును రూ.7వేల కోట్లకే తెగనమ్మారని, గొర్రెల స్కీమ్‌ పేరుతో కోట్ల రూపాయలు దండుకున్నారని, గొప్ప పథకమని చెప్పిన బతుకమ్మ చీరల్లోనూ అవినీతికి పాల్పడ్డారని, ఆడబిడ్డల సెంటిమెంట్‌నూ దోపిడీకి ఉపయోగించుకున్నారని రేవంత్‌ మండిపడ్డారు. కురుమ, యాదవుల సోదరులను అమాయకులను చేసి కోట్లాది రూపాయలు దోచుకున్నారన్నారు. కాళేశ్వరం ఖర్చు విషయంలోనూ గతంలో ఒకటి చెప్పి…ఇప్పుడు రూ.94వేల కోట్లు అని చెబుతున్నారని పైర్‌ అయ్యారు.

తెలంగాణ వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని భూములు అమ్మిందో లెక్కలు తీద్దామా అని రేవంత్‌ హరీష్‌ రావుకు సవాల్‌ చేశారు. వారు ఎన్ని వేల కోట్ల విలువైన భూములు అమ్మారో లెక్క తీద్దాదమని అన్నారు. అప్పుల లెక్కలు చెబుతున్నారు…కానీ అమ్ముకున్న లెక్కలు చెప్పడంలేదని దుయ్యబట్టారు. పదేళ్లయినా పాలమూరుకు చేసిందేం లేదని, 20 వేల కోట్లకు పైగా ఖర్చుపెట్టినా పాలమూరు ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం వాళ్లు కాదా..అంటూ ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లాను ఎడారిగా మార్చారని, గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నా… రంగారెడ్డి జిల్లాపై నిర్లక్ష్యం వహించారని, రంగారెడ్డి జిల్లా ఆస్తులు అమ్ముకున్నారు కానీ జిల్లాకు సాగు నీరు ఇవ్వలేదని రేవంత్‌ విమర్శించారు. ప్రజలు బీఆరెస్‌కు గుండుసున్నా ఇచ్చినా బుద్ధి మారకుండా ఇలా మాట్లాడటం సరైంది కాదని రేవంత్‌ సూచించారు. బీఆర్‌ఎస్‌ నిజాయితీ పాలన అందించి ఉంటే… బతుకమ్మ చీరలు, కేసీఆర్‌ కిట్స్‌, గొర్రెల పంపిణీ పై విచారణకు సిద్ధంగా ఉన్నారో లేదో చెప్పాలని రేవంత్‌ రెడ్డి సవాల్‌ చేశారు. ఇక తెలంగాణలో లా అండ్‌ ఆర్డర్‌ దెబ్బతిందని, 8 నెలల్లో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయని, నిరుద్యోగ భృతికి బడ్జెట్‌లో కేటాయింపులు లేవని, హైదరాబాద్‌ సహా రాష్ట్రంలో మర్డర్లు, రేప్‌ లు జరిగాయని..లా అండ్‌ ఆర్డర్‌ ను కాపాడాలన్న హరీష్‌ రావు వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్‌ బాబు ఘాటుగా స్పందిస్తూ..పట్టపగలు పెద్దపల్లి జిల్లాలో లాయర్‌ దంపతులను చంపితే దిక్కు లేదని, అలాంటి వారా శాంతిభద్రతల గురించి మాట్లాడేదని మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page