అవినీతి విషవృక్షం మూలాలెక్కడ?

నేడు అంతర్జాతీయ అవినీతి  వ్యతిరేక దినోత్సవం

అవినీతి విష వృక్షానికి ఎన్నో కొమ్మలున్నాయి, కొమ్మల మాటున ఎన్నో అవినీతి పక్షులు ఒదిగి పోయి, హాయిగా సేద తీరుతున్నాయి.  కోట్ల కొద్ది ధనం కేవలం కొంత మంది స్వంతం. అది స్వార్జితం కాదు. ప్రజాధనం.  21వ శతాబ్ధంలో కూడా ఇంకా కోట్లాది మంది ప్రజలు ఈ ప్రపంచంలో  ఆకలితో అలమటిస్తున్నారు. ఆర్ధిక అంతరాలు జనజీవితాలను శాసిస్తున్నాయి. 810 కోట్ల మంది ప్రపంచ జనాభా కు చెందవలసిన సంపద కేవలం కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కావడం  దేనికి సంకేతం?అవినీతి పెరుగుదల ఆర్ధిక ప్రగతి కాబోదు.ప్రపంచ ప్రజలంతా బాగుండాలనే భావన కార్యరూపం దాల్చడమే నిజమైన విశ్వమానవ కల్యాణం.ప్రపంచ ప్రజలంతా ఆర్ధికంగా అభివృద్ధి చెందాలి. అన్ని దేశాలు ఆర్ధికంగా పురోగామి పథంలో పయనించాలని వాంఛించాలి. ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ప్రదర్శించాలి. ధనిక దేశాలు బీద దేశాలను వాటి ఆర్ధిక అవసరాల మాటున భయపెట్టి లొంగదీసుకోవడం, ఆక్రమించుకోవడం వంటి చర్యల వలన ప్రపంచంలో అశాంతి తలెత్తుతుంది. దేశాల మధ్య, ప్రజల మధ్య హద్దులు లేకుండా పెరిగిపోతున్న ఆర్ధిక అంతరాల వలన  అనేక విపత్కర పరిణామాలు సంభవిస్తున్నాయి. కుల,మత విబేధాల కంటే ఆర్ధిక అంతరాలే అత్యంత ప్రమాదకరం. శ్రమ వలన సంపద పెరుగుతుంది. పూర్వీకుల కృషివలనో, స్వీయ శక్తి వలనో సంపద చేకూరడంలో తప్పులేదు. న్యాయబద్దమైన సంపాదనతో ఉన్నత శిఖరాలకు ఎదగడం హర్షించదగ్గ పరిణామం. అలా కాకుండా అనైతిక మార్గంలో కోట్లు కూడబెట్టి తరతరాలకు తరగని సంపదను రాశులుగా పేర్చుకుంటూ, సమాజానికి ఉపకరించని విధంగా ఆకాశమే హద్దుగా ఆర్ధిక సౌధాలను నిర్మించుకుంటూ పోతే, ఆర్ధిక అంతరాలు పెరిగి, సామాన్య ప్రజలకు బ్రతుకు దెరువు కరువై, అసహనం,అశాంతి  ప్రబలి అంతిమంగా అరాచకానికి దారి తీస్తుంది. కూటికోసం కోటి విద్యలు అన్నట్టు ఉదరనిమిత్తం బహూకృత వేషధారణ అసహజమేమీ కాదు.

ఆకలి మహా చెడ్డది. నీతి పరులను సైతం అవినీతి పరులుగా, అసాంఘిక శక్తులుగా మార్చే ఆయుధం క్షుద్భాధ.  వర్తమాన ప్రపంచంలో జరిగే అనేక అలజడులకు, అరాచకాలకు,అసాంఘిక కార్యకలాపాలకు కారణం ఆర్ధిక నేపథ్యమే. ఆర్ధిక ఒడిదుడుకుల మధ్య నలిగి పోయే అభాగ్యులు అరాచకశక్తులకు ఆలంబనగా మారుతున్నారు. ఉద్యోగాలు లేక, ఉపాధి దొరకక అసాంఘిక శక్తులుగా మారుతున్న యువతను సంస్కరించాలంటే ముందు వారిని ఆర్ధిక పరిపుష్ఠం చేయాలి. సమాజంలో తలెత్తే ఆర్ధిక అంతరాలను కనీస స్థాయికి తగ్గించాలి. ఆర్ధిక అంతరాల పెరుగుదలకు ప్రధాన కారణం  అవినీతి. ప్రపంచ వ్యాప్తంగా హద్దు అదుపు లేకుండా పెరిగి పోతున్న  ఆర్ధిక అసమానత్వం  పోవాలంటే అవినీతికి అంతిమ యాత్ర ఘనంగా జరగాలి. ప్రపంచంలో కుబేరుల సంఖ్య పెరిగిపోతున్నది. కుబేరుల పెరుగుదల పరుగులు పెట్టడంలో తప్పులేదు.అందులో నిజాయితీ ఉంటే ఫర్వాలేదు. అక్రమదారుల్లో,అడ్డదిడ్డంగా సంపాదిం చడం మాత్రం  సామాన్య ప్రజల జీవితాలను చిందరవందర చేసే అసహజ,అనాగరిక, అనైతిక చర్యగానే భావించాలి. కోవిడ్‌ సంక్షోభం వలన, ప్రపంచంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం వలన పలు దేశాలు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అయినప్పటికీ కొన్ని రంగాలు, ఆ రంగాలలోని వ్యక్తులు కొంత మంది వ్యక్తులు ఇబ్బడి ముబ్బడిగా  సంపదను పెంచు కుంటున్నారు. రష్యా, మెక్సికో, ఇండియా మరియు బ్రెజిల్‌ దేశాలు ఆర్ధికంగా బలోపేతమవుతున్నాయి. భారత్‌ 5 వ శక్తివంతమైన ఆర్ధిక వ్యవస్థ గా అవతరించిందనే అంచనాలున్నాయి.  ఆర్ధిక మాంద్యం నుండి తేరుకుని ప్రపంచ సంపద 267 ట్రిలయన్‌  డాలర్లకు  చేరుకుంటుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అమెరికాలో 69 శాతం సంపద కేవలం 10 శాతం మంది చేతుల్లో కేంద్రీకృతమైనది. చైనా లో 62 శాతం జాతీయ సంపద  10 శాతం మంది అనుభవిస్తున్నారు.భారత దేశంలో 77 శాతం సంపద కేవలం 10 శాతం మంది చేతుల్లో ఉంది. కోవిడ్‌ సంక్షోభంలో ప్రపంచంలో పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయినా,కొన్ని దేశాల ఆదాయం బాగా పెరిగింది.ప్రపంచ సంపద పెరిగింది. ప్రపంచంలో బిలియనీర్ల సంఖ్య పెరుగుతున్నా,ఇంకా చాలామంది ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువనే ఉన్నారు.ఆర్ధిక అసమానతలు ఈనాటివికావు.
శతాబ్ధాల తరబడి విశ్వవ్యాప్తంగా కొనసాగుతున్న ఈ అసహజ ప్రక్రియకు మూలకారణం అవినీతి. కూటికి గతిలేని వారు స్వల్ఫకాలంలో కుబేరులుగా మారిపోవడం వెనుక ఎలాంటి మతలబు ఉందో ఊహించడం కష్టం. సంపన్నులు ఇంకా సంపన్నులు కావడం, పేదలు పేదలుగా  మారడం అభివృద్ధికి చిహ్నం కాదు. ఒక దేశ ఆర్ధిక వ్యవస్థ ముందంజలో ఉండడానికి కేవలం కొద్ది మంది వ్యక్తులే కారణం కావడం విచిత్రం. ప్రజలంతా ఆర్ధిక స్వావలంబన సాధించి,ఆర్ధిక అసమానతలు లేని జీవనాన్ని కొనసాగిస్తే అదే నిజమైన అభివృద్ధి.   కొద్ది మంది బిలియనీర్ల ఆర్ధి క ఎదుగుదల ‘‘ఆర్ధిక అభివృద్ది’’ కాజాలదు. నడుస్తున్న ప్రపంచ చరిత్ర పుటలు అవినీతి మరకలతో నగుబాటు పాలౌతున్నాయి. సూర్యోద యాన్ని  కారు మబ్బులతో కప్పేసి, నిశిరాతిరి అమావాస్య చీకట్లలో కృత్రిమ కాంతులను సృష్టించి, అవే  నిజమైన వెలుగు రేఖలుగా  భ్రమింపచేసే ఆర్ధికతత్వం  ప్రపంచాన్ని తన్వయత్వంలో ముంచెత్తు తున్నది.

వర్తమాన ప్రపంచంలో కోవిడ్‌ మహమ్మారి నైనా ఏదో విధంగా జయించి, మృత్యుంజయులై తిరిగొస్తున్న   యోధులను చూస్తున్నాం. కరోనాకు విరుగుడుగా వ్యాక్సిన్లను శరీరాలకు ఎక్కించుకుని యుద్ధంలో గెలిచిన మహాయోధులుగా బాహ్య ప్రపంచంలో నిర్భయంగా తిరుగుతున్నాం. ప్రపంచం లో కరోనా కంటే అత్యంత భయంకరంగా మారిన అవినీతి అనే మహమ్మారి పై వ్యతిరేకంగా పోరాడలేక, పోరాడే శక్తియుక్తులున్నా నేటి సమాజంలో శిఖండుల్లా అడ్డు వచ్చే వారితో యుద్ధం చేయలేక, కారణాంతరాలతో, కలహాలను కొని తెచ్చుకోలేక అర్ధాంతరంగా అస్త్రసన్యాసం చేసిన  భీష్మాచార్యుల్లా వెనుదిరిగి అవినీతి అనే అంపశయ్యపై తనువు చాలించడానికే సంసిద్ధత వ్యక్తం చేసే పరిస్థితులకు నెట్టబడ్డాం. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ అవినీతి పోరాటంలో సహకరించి, పోరాడడానికి  ఐ.రా.స  2005 వ సంవత్సరం నుండి ప్రతీ ఏటా డిసెంబర్‌ 9 వ తేదీని ‘‘అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం’’ పేరుతో  ప్రపంచ ప్రజలకు అవినీతిపై పోరాడడానికి అవగాహన,చైతన్యం,భవితవ్యం అనే పాశుపతాస్త్రాలను అందించి పోరాటయోధులుగా మలచా లని ప్రయత్నం చేస్తున్నది.పదిహేను సంవత్సరాలుగా ఐ.రా.స చేస్తున్న ‘‘అవినీతిపై పోరాటం’’ ఒక విఫల ప్రయత్నం గానే మిగిలిపోతున్నది. ఓడిపోయే యుద్ధంలో గెలవాలని విశ్వప్రయత్నం చేస్తూ పలువురు వ్యక్తులు, వక్తలు, అంతర్జాతీయ సంస్థలు పద్మవ్యూహంలో చిక్కుకుపోతామని తెలిసినా అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నారు. కర్ణుని సహజ కవచకుండలాలను మాయతో కాజేసే ఇంద్రుల మాయాజాలంలో ఇరుక్కుని హతులై,పరాజితులుగా చరిత్ర పుటల్లో నిలిచేవారు కోకొల్లలు. చాణిక్యనీతిని మరపించే  అత్యంత కుటిలమైన ఎత్తుగడలకు చిత్తయి పోయి, గమ్మత్తుగా కిమ్మనకుండా నిశ్శబ్ధాన్ని ఆహ్వానించే వారిని అడుగడుగునా వీక్షిస్తున్నాం. అవినీతి పై పోరాటమంటూ ఉవ్వెత్తున లేచిన కెరటంలా విజృంభించి, లేచి పడి,తిరిగి లేవకుండా సముద్రం గర్భంలో దాక్కునే అలల నిస్సహాయతను చూస్తూ కాలం పరుగెడుతూనే ఉంది. పాత నీరును పోనిచ్చి,కొత్త నీటికి తోవ ఇచ్చిన చందంగా  అవినీతి  ఆగదని తెలిసినా మరికొంతమంది బయలు దేరి ‘‘అయిననూ పోయిరావలె హస్తినకు…’’ అంటూ మరో తరంగమై విజృంభిస్తూ  కొన్నాళ్లు వరదగోదారిలా చెలరేగి, ఆ తర్వాత కొన్నాళ్లకు నెరలు తీసి ఎండిన నేలల్లా ,స్వాతి చినుకు పడితే చాలు సంద్రం నిండు నన్నట్టుగా ఎవరో వస్తారు…ఏదో జరుగుతుందని మరో కొత్త దేవుడికోసం ఎదురుచూస్తూ నిరీక్షణలో కాలం వెళ్ళదీసి,కాలగర్భంలో కలిసి పోతున్నారు. ‘‘గరికను తిన్న గాడిద పోతుంది,కాని గరిక చావదు’’ అనే విధంగా అవినీతి  అప్రతిహతంగా చిరాయువుగా ‘‘మూడు పువ్వులు- ఆరుకాయలు గా వర్ధిల్లుతూనే ఉంది’’. ఆద్యంతాలు కానరాని అవినీతికి చరమగీతం పాడేదెప్పుడు? సామాన్యప్రజల ఆర్ధిక పునాదులు పటిష్ఠమయ్యేతరుణమెప్పుడు? అవినీతి పై పోరాటంలో  గెలుపెప్పుడు?  ఈ పోరాటంలో అంతిమ పరాజితులు సామాన్య ప్రజలా?  అవినీతి పరులా? ఈ ప్రశ్నకు  సమాధానం ఎక్కడ దొరుకుతుంది?

  – సుంకవల్లి సత్తిరాజు
(సామాజిక విశ్లేషకులు)
తూ.గో.జిల్లా, ఆం.ప్ర,
సెల్‌ : 9704903463. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page