వరంగల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 05 : తెలంగాణ రాష్ట్ర 3వ అసెంబ్లీ స్పీకర్ పదవికి ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం నుండి కొత్తగా ఎంఎల్‌ఏగా ఎన్నికైన రూవూరి ప్రకాష్ రెడ్డి పేరు వెలుగులోకి వొచ్చింది. కాంగ్రెస్ నుంచి ప్రస్తుత ఎంఎల్‌ఏలలో సీనియర్లు స్పీకర్ పదవిని చేపట్టడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్ పదవిని చేపట్టిన వారికి రాజకీయంగా పెద్దగా ఎదుగుదల లేకపోవడం, ఒక్క పోచారం మినహా స్పీకర్ పదవిని చేపట్టి వారందరూ తదుపరి ఎన్నికలలో వోటమి పాలయ్యారనే ఉద్దేశ్యంతోనే వారు స్పీకర్ పదవిపై ఆసక్తి కనబరచడం లేదనేది సమాచారం.
కాగా 1994, 1999, 2009 ఎన్నికలలో నర్సంపేట నియోజకవర్గం నుంచి టిడిపి ఎంఎల్‌ఏగా గెలుపొందిన రేవూరి వివాద రహితుడిగా, నిజాయితీపరుడిగా పేరున్నవాడు. 2023 ఎన్నికలలో పరకాల ఎంఎల్‌ఏగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ప్రకాష్ రెడ్డి 30 ఏళ్ల సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగి ఉన్నారు. తెలంగాణ మొదటి స్పీకర్‌గా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లి నుంచి ప్రాతినిధ్యం వహించిన సిరికొండ మధుసూదనా చారి పని చేశారు. ఇక రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రస్తుత పిసిసి అధ్యక్షడు రేవంత్ రెడ్డికి రాజకీయ గురువు కావడం విశేషం.