ఆంధ్రాలో వేధనకు గురౌతున్న బ్యూరోక్రాట్లు

బ్యూరోక్రాట్లు చట్టానికి లోబడి స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో ప్రభుత్వానికి, ప్రజలకు వారథులుగా ఉండాలి. అంతేకాని కీలుబొమ్మలుగా ఉండరాదు. అదే సమయంలో పాలకులు చేసిన తప్పిదాలకు తానా అంటే తందానా అంటూ ముందుకు వెళితే తప్పనిసరిగా బాధ్యతలను విస్మరించినట్లవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో బ్యూరోక్రాట్లలో  ఐపీఎస్‌,  ఐఏఎస్‌ అధికారులను అపహాస్యం చేసే విధంగా అధికారంలోకి వొచ్చిన చంద్రబాబు సర్కార్‌ తీసుకున్న నిర్ణయాలు అభాసుపాలవుతున్నాయి. ప్రభుత్వానికి ఉక్కు కవచంలా బ్యూరోక్రాట్లు వ్యవహరించాలి. కానీ ఇటీవల కాలంలో ప్రభుత్వాలకు వంధిమాగదులుగా తయారు కావడం వల్ల బ్యూరోక్రాట్ల వ్యవస్థ భ్రష్టుపట్టింది. రాజకీయాధికారంలోకి వొచ్చిన పార్టీ అధినేతల ద్వంద్వ వైఖరులు, నియంతృత్వ పోకడలకు బ్యూరోక్రాట్లు కుదేలవుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ లో చంద్రబాబు సర్కార్‌ అధికారంలోకి వొచ్చి 70 రోజులైంది. పెద్ద సంఖ్యలో ఐఎఎస్‌, ఐపీఎస్ లను బదిలీ చేశారు. కాని వారిలో చాలా మందికి పోస్టింగ్‌లు ఇవ్వకుండా వేధిస్తున్నారు. డీజీపీ ఆఫీసు ఇటీవల ఒక వివాదస్పద మెమోను జారీ చేసింది. 16 మంది ఐపీఎస్ లు తప్పనినరిగా రోజూ ఉదయం డీజీపీ ఆఫీసుకు వొచ్చి సంతకం చేసి మళ్లీ వెళ్లే ముందు సాయంత్రం రిజిస్టర్లో సంతకాలు చేసి వెళ్లాలని , వీరందరూ డీజీపీ ఆఫీసులో వెయిటింగ్‌ హాలులో కూర్చొవాలని ఆదేశాలు జారీ చేశారు. దేశ వ్యాప్తంగా ఈ మెమో వివాదస్పదంగా మారింది. దేశ చరిత్రలో ఈ తరహాలో మెమోను ఏ ప్రభుత్వం జారీ చేయలేదంటున్నారు. ఏ ప్రాతిపదికన ఈ తరహాలో మెమో జారీ చేశారో తెలియదు. కాని ఎవరి హస్తముందో అందరూ కచ్చితంగా ఊహించగలరు. ప్రస్తుతం పోస్టింగ్‌లు దక్కని ఐపీఎస్ బాబులు ఇళ్లలో కూర్చుంటున్నారు. వీరిలో జిల్లా ఎస్పీ స్థాయి నుంచి డీజీపీ కేడర్‌ స్థాయి వరకు అధికారులు ఉన్నారు.

ఐపీఎస్ అధికారులకు గత ప్రభుత్వ అండదండలు ఉన్నాయనే ఆరోపణలతో అనుమానించి వారికి పోస్టింగ్‌లు ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తోంది. వీరందరూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డితో అంట కాగారని ప్రస్తుత ప్రభుత్వం బలంగా అనుమానిస్తోంది. జగన్‌ సేవ లో ఈ ఐపీఎస్ లు తరించారని, వీరు టీడీపీ నేతలపై క్రిమినల్‌ కేసులు బనాయించడంలో కీలకపాత్ర వహించారని ప్రస్తుత పాలకులు శంకిన్తున్నారు. పైగా రెడ్‌ బుక్‌లో వీరందరి పేర్లు ఉన్నాయంట. రెడ్‌బుక్‌ మంత్రి నారా లోకేష్‌ వద్ద ఉంటుంది. గత ప్రభుత్వ హయంలో బహిరంగ సభల్లో నారా లోకేష్‌ ప్రభుత్వంలోని అవినీతి అధికారుల పేర్లను రెడ్‌బుక్‌లో రాసుకున్నానని, తమ పార్టీ అధికారంలోకి వొస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా లోకేష్‌ పదే పదే చెప్పారు. చివరకు అధికారం వొచ్చింది. తమకు గిట్టని ఐపీఎస్‌ల పేర్లను రెడ్‌బుక్‌లో రాసుకున్నారు. వారిని ఈ రోజు వేధిస్తున్నారు. ఈ రోజు 16 మంది ఐపీఎస్ లు డీజీపీ కార్యాలయానికి రోజూ వొస్తూ అక్కడ ఉదయం, సాయంత్రం సంతకాలు చేసి వెళుతున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన వెంటనే రాష్ట్రంలో వైకాపా కార్యకర్తలపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. ఆస్తి నష్టం జరిగింది. రోజులు గడుస్తున్నాయే కాని వీరికి పోస్టింగ్‌లు ఇవ్వలేదు. ఇవన్నీ వేధింపులే. రాష్ట్రంలో రాజకీయాలు, నేరాలు ఒకదానికొకటి పెనవేసుకుని పోయి ఉన్నాయి. వీరి మధ్య అధికారులు చిక్కి శల్యమైపోతు న్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మరి కొంత మంది నేతలపై అవినీతి కేసు నమోదైన విషయం విదితమే. ఇందులో చేర్చిన అంశాల తీవ్రతను తగ్గించాలని, సరిదిద్దాలని ప్రభుత్వం ఈ కేసుల దర్యాప్తు చేస్తున్న అధికారులపై వొత్తిడి వచ్చినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

పోలీసు ఉన్నతాధికారులపై వొత్తిళ్లు తేవడం వల్ల దర్యాప్తుకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఇంతకంటే అధికార దుర్వినియోగం మరొకటి ఉంటుందా ? తమ మాట వినకపోతే ఆ పోలీసు అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా వేధించడం సుపరిపాలన అవుతుందా ? అధికారంలోకి వొచ్చిన రాజకీయ పార్టీలు ఇలా దుర్వినియోగానికి పాల్పడడం మంచి పద్ధతి కాదు. దీని వల్ల బ్యూరోక్రసీ వ్యవస్థ కుప్పకూలుతుంది. ఇలా అధికారంలోకి వొచ్చిన పార్టీలు, చట్టాలను తమ చేతుల్లోకి తీనుకుని పాత కక్షలతో వేధిస్తూ తమకు కలిసి రాని అధికారులను వేధించడం నిజంగా శోచనీయం. ఇంతకంటే అరాచక విధానం మరొకటి ఉంటుందా ? ఈ ఘటన జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇది పెయిడ్‌ హాలిడేగా భావించవొచ్చు. అంతేకాని శిక్షించడం అవుతుందా?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పోలీసింగ్‌ వ్యవస్థ వివాదస్పదంగా తయారైంది. తమకు ఉపయోగపడని అధికారులను వేధించేందుకు ఈ తరహా పద్ధతులను అమలు చేయడం మంచి పరిణామం కాదు. రాజకీయంగా ఈ రోజు అధికారంలో ఉన్న వారు రేపు ఓడిపోవొచ్చు. ఈ రోజు ఓడిపోయిన వారు మళ్లీ రానున్న రోజుల్లో అధికారంలోకి రావొ చ్చు. అంతేకాని బ్యూరోక్రాట్లను వేధించడం, సతాయించడం వల్ల నిజంగా మంచి పరిణామం కాదు. రాష్ట్ర బ్యూరోక్రసీ చరిత్రలో ఇది మాయని మచ్చలా మిగిలిపోతుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అప్పుడు పనిచేసిన చాలా మంది డీజీపీలు చంద్రబాబు సర్కార్‌ పనిని ఏవగించుకున్నారు. పోలీసింగ్‌పై రాజకీయ పార్టీలు తమ స్వప్రయోజనాలకు అనుగుణంగా దెబ్బతీయడం నిజంగా దురదృష్టకరం. కొన్ని రాష్ట్రాల్లో బ్యూరోక్రాట్లును కొత్తగా అధికారంలోకి వొచ్చిన ప్రభుత్వాలు వేధిస్తున్నాయి. బ్యూరోక్రాట్లను బ్రష్టుపట్టించే చర్యలను ప్రజాస్వామ్య వాదులు నిరసించాలి. లేదంటే దీని వల్ల వ్యవస్థ కుళ్లిపోతుంది. రాజకీయ పార్టీలకు ఊడిగం చేస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయో తెలుస్తోంది. ఈ ఊడిగ మనస్తత్వం నుంచి బ్యూరోక్రాట్లు బయటపడాలి.

రాజకీయ పార్టీలు కూడా బ్యూరోక్రాట్లను తమ ఇష్టారాజ్యంగా వాడుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. స్వాతంత్య్రం వొచ్చిన కొత్తల్లో, ఆ మధ్య వరకు బ్యూరోక్రాట్లు స్వతంత్రంగానే పనిచేశారు. కాని ఇటీవల కాలంలో ప్రజాస్వామ్య విలువలు క్షీణించడం, అనైతిక విలువలు పెచ్చుమీరడం, వల్ల బ్యూరోక్రాట్ల వ్యవస్థ మసక బారింది. ఈ వ్యవస్థకు పునర్వైభవం తీసుకురావాలంటే, ప్రభుత్వం , బ్యూరోక్రాట్లు కలిసి పారదర్శకంగా పనిచేయాలి. ప్రజా సంక్షేమానికి, నీతివంతమైన పాలనకు , మెరుగైన వ్యవస్థల ఏర్పాటుకు ప్రభుత్వం, బ్యూరోక్రాట్లు అంకిత భావంతో పనిచేయాలి. లేదంటె ప్రజల నుంచి చీత్కారాలు ఎదురవుతాయి. బ్యూరోక్రాట్లను రాచి రంపాన పెట్టె దిక్కుమాలిన క్రూర స్వభావాన్ని ప్రభుత్వాలు వొదులుకోవాలి. అలాగే బ్యూరోక్రాట్లు ఆడంబర జీవన విధానానికి స్వస్తి చెప్పి, ప్రజలకు చేరువగా ఉంటూ మంచి చేస్తారనే పేరు తెచ్చుకోవాలి.

-శామ్ సుందర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page