కష్టాల బండరాళ్లు
నా గమ్యాన్ని నిరోధిస్తోంటే,
పోటెత్తిన భావాలన్నీ
పొర్లుకుంటూ వచ్చి
మదిగోడలపై పరచుకోగా,
కునుకు రావడంలేదు కంటిమీదకు.
కన్నీటి నదుల్ని, వెతల సుడుల్ని
గర్భాన్ని దహించే క్షుధానలాన్ని
దాచుకొనే శక్తి ఉన్న నా మదిలో
ఏదైనా చేయాలి,
ఏదో చేయాలనే తపన
మస్తిష్కాన్ని దొలిచేస్తోంది.
నిరంతర స్పర్శతో
పాషండులను సైతం
మృదువుగా మార్చే స్నేహగుణం
సంతరించుకున్న నా ఎదలో
ఆలోచనా కెరటాలు
ఎగసిపడినప్పుడల్లా
అవి నా మనోఫలకంపై
ఏదో ఒక ఆకారంగా
ఆవిష్కరించబడేదాకా
నా హృదిలో ఈ అలజడి
షరా మామూలే!
అప్పుడే ఈ కంటిమీద కునుకు.
– వేమూరి శ్రీనివాస్, 9912128967, తాడేపల్లిగూడెం