ఆత్మస్తుతి..పరనింద

అంకెల గారడీ తప్ప మరోటి లేదు
ఎన్నికల హావిూలకు ఎగనామం
బడ్జెట్‌పై మాజీ మంత్రి హరీష్‌ రావు విమర్శలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 25 : రాష్ట్ర అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఆసాంతం ఆత్మస్థుతి, పరనింద తప్ప మరేవిూ లేదని మాజీ మంత్రి హరీష్‌ రావు విమర్శించారు. బడ్జెట్‌ లో ఆసరా పెన్షన్‌ల ప్రస్తావనే తీసుకురాలేదని అన్నారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని ఎన్నికల సందర్భంగా హావిూ ఇచ్చారని, కానీ ఆ ఊసే ఎత్తలేదని మండిపడ్డారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్‌ నేతలు ఎన్నికల సందర్భంగా హావిూలు ఇచ్చారని, ఆ విషయాన్ని కూడా ఎక్కడా ప్రస్తావించలేదని హరీష్‌రావు ఆరోపించారు. ఆసరా పెన్షన్‌ల ప్రస్తావన తేకుండా వితంతువులు, వృద్ధులు, వికలాంగులను ప్రభుత్వం నిరాశపర్చిందని విమర్శించారు. కాంగ్రెస్‌ సర్కారుకు పేదల ప్రభుత్వం అని చెప్పుకునే అర్హత లేదని అన్నారు. బడ్జెట్‌ పూర్తిగా అంకెల గారడీలా ఉన్నదని, ఇది రాష్టాన్న్రి తిరోగమనం వైపు నడిపేదని హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని గొప్పలకు పోయిన కాంగ్రెస్‌ సర్కారు.. ఆ ప్రస్తావనే తేకపోవడం దారుణమని అన్నారు.

ఆర్భాటంగా అభయ హస్తం దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆరు గ్యారెంటీ ఊసెత్తలేదని మండిపడ్డారు. ఆసరా పింఛన్‌లు పెంచుతామని ఎన్నికల్లో హావిూలు ఇచ్చారని, వృద్ధుల పెన్షన్‌ను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు, వికలాంగుల పెన్షన్‌ను రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంచుతామని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ హావిూ ఇచ్చిందని.. బడ్జెట్‌ లో ఆ ప్రస్తావన ఎందుకు చేయలేదని హరీష్‌రావు ప్రశ్నించారు. ఇచ్చిన మాట తప్పడం ద్వారా ప్రభుత్వం పేదలను మోసం చేసిందని విమర్శించారు. ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఓట్లు దండుకున్న సర్కారు.. ఇప్పుడు రెండు లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడలేదని, మాయమాటలతో విద్యార్థులను మోసం చేసిందని హరీష్‌రావు మండిపడ్డారు. ఆటో కార్మికులకు రూ.12 వేలు ఇస్తామని ఎన్నికల సందర్భంగా చెప్పారని, ఇప్పుడు ఆ విషయం ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం వైఖరి కారణంగా ఇప్పటికే 50 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని హరీష్‌రావు గుర్తుచేశారు. రాష్టాన్న్రి అప్పులకుప్పగా మార్చారని గత ప్రభుత్వ పాలన విూద బురద జల్లే ప్రయత్నం చేశారని హరీశ్‌రావు పేర్కొన్నారు. భట్టి విక్రమార్క చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు హరీశ్‌రావు తెలిపారు.ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 57 వేల కోట్ల అప్పులు తెచ్చుకుంటామని బడ్జెట్‌లో భట్టి విక్రమార్క ప్రతిపాదించారు. గత ప్రభుత్వం కంటే రూ. 17 వేల కోట్ల అప్పులు ఎక్కువగా తెచ్చుకుంటామని ప్రతిపాదించారు. గతంలో ఆర్థిక మంత్రిగా నేను ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ. 40 వేల కోట్లు ఎఫ్‌ఆర్‌బీఎం కింద అప్పులు ప్రతిపాదిస్తే, భట్టి విక్రమార్క మాత్రం రూ. 57 వేల కోట్లు ప్రతిపాదించారు.

మా కంటే రూ. 17 వేల కోట్లు ఎక్కువగా చూపించారు అని హరీష్‌ రావు తెలిపారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఘనతలను తమ ఘనతలుగా చెప్పుకునే ప్రయత్నం చేసి.. ఈ పదేండ్లలో అభివృద్ధే జరగలేదని చెప్పే ప్రయత్నం చేశారు భట్టి విక్రమార్క. ఈ దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. పదేండ్ల కింద తెలంగాణ 13వ స్థానంలో ఉండే. అక్కడున్న తెలంగాణను ప్రథమ స్థానంలోకి తెచ్చాం. దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా మెచ్చుకుంది.గత పదేండ్లలో జరిగిన అభివృద్ధి కూడా తమ ఘనతగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం ఒక లక్షా 64 వేల 63 రూపాయాలు ఎక్కువ. ఈ రాష్ట్ర పౌరుడి తలసరి ఆదాయం 3,47,299. అయితే దేశ పౌరుడి తలసరి ఆదాయం 1,83,236. అంటే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం ఒక లక్షా 64 వేల 63 రూపాయాలు ఎక్కువగా ఉంది..

పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలన, కేసీఆర్‌ పాలన ఫలితం ఇది. మేం అధికారంలోకి వచ్చినప్పుడు 13 స్థానంలో ఉంటే.. ప్రథమ స్థానంలోకి వచ్చామంటే మా పరిపాలనకు గీటురాయి అని హరీశ్‌రావు పేర్కొన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని.. కళ్లుండి చూడలేని కబోదులు అలా మాట్లాడుతారు. భట్టి వ్యాఖ్యలపై హైదరాబాద్‌ ప్రజలు నవ్వుకుంటున్నారు. హైదరాబాద్‌ అభివృద్ధి విషయంలో మొన్నటి దాకా పని చేసిన ప్రభుత్వం నా కంటే బాగా పని చేసిందని చెబుతూ ఇటీవలే సీఎం చంద్రబాబు నాయుడు కేసీఆర్‌ అభివృద్ధిని కొనియాడారు. హైదరాబాద్‌ అభివృద్ధిని లోకం మొత్తం మెచ్చింది. రజనీకాంత్‌ కూడా హైదరాబాద్‌ అభివృద్ధిని ప్రశంసించారు. ఆ రజినీలకు అర్థమైంది కానీ కాంగ్రెస్‌ గజనీలకు అర్థం కావడం లేదు. ఎంతో మంది హైదరాబాద్‌ను మెచ్చుకున్నారు. హైదరాబాద్‌ అభివృద్ధి జరగలేదని మాట్లాడడం జోక్‌. ఏ రంగంలో కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి విజన్‌ లేదని అర్థమవుతుందని హరీష్‌ రావు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page