ఆదానీ వ్యవహారంపై పట్టువీడని విపక్షాలు

  • పార్లమెంట్‌ ‌భవనం ఎక్కి తీవ్ర నిరసన
  • ఉభయ సభల్లోనూ జెపిసికి సభ్యుల డిమాండ్‌
  • ‌లండన్‌ ‌కేంబ్రిడ్జ్ ‌వర్సిటీలో రాహుల్‌ ‌వ్యాఖ్యలపై క్షమాపణకు అధికార పక్షం డిమాండ్‌
  • ‌గందరగోళం మధ్య రేపటికి వాయిదా

న్యూ దిల్లీ, మార్చి 21 : అదానీ విషయంపై పార్లమెంట్‌లో విపక్షాలు పట్టు వీడటం లేదు. అదానీ సంక్షోభంపై జేపీసీ వేయాలన్న తమ డిమాండ్‌పై ప్రతిపక్షాలు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో ఉభయ సభల్లో నిరసనలతో వాయిదాల పర్వం కొనసాగుతున్నది. ఇదే క్రమంలో మంగళవారం కూడా పార్లమెంట్‌ ఉభయసభలు మొదట మధ్యాహ్నం రెండు గంటలసేపు వాయిదా పడ్డాయి. అదానీ వ్యవహారంపై జేపీసీతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ విపక్ష ఎంపీలు పార్లమెంట్‌ ‌ఫస్ట్ ‌ప్లోర్‌ ఎక్కి మరీ నిరసనలు తెలిపారు. బ్యానర్లు పట్టుకొని నినాదాలు చేశారు. తృణముల్‌ ఎం‌పీలు కూడా ప్రత్యేక ఆందోళన చేపట్టారు. అదానీ అంశంపై మోదీ మౌనం వీడాలని డిమాండ్‌ ‌చేశారు. అదానీపై విచారణ చేపట్టకుండా..మోదీ ప్రభుత్వం ఆయనకు సహకరిస్తుందని ఆరోపించారు.

తృణముల్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీతో పాటు..కాంగ్రెస్‌, ‌డీఎంకే, ఆర్జేడీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, శివసేన, జేడీయూ, జేఎంఎం, ఐయూఎంఎల్‌, ఆప్‌, ఎం‌డీఎంకే పార్టీలన్నీ కలిసి ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్‌ ‌ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో పార్లమెంట్‌లో రభస కొనసాగుతూనే ఉన్నది. రెండో విడత సమావేశాలు ప్రారంభమై దాదాపు 10 రోజులు కావస్తున్నా ఇంతవరకూ ఉభయసభల్లో ఒక్కరోజూ సాఫీగా సాగింది లేదు. ఇక ఒకవైపు అదానీ-హిండెన్‌బర్గ్ ‌వ్యవహారంపై జాయింట్‌ ‌పార్లమెంటరీ కమిటీ వేయాలని విపక్షాలు పట్టుపడుతుండగా మరోవైపు లండన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చేసిన ప్రసంగంపై రాహుల్‌గాంధీ క్షమాపణలు చెప్పాలని అధికారపక్ష సభ్యులు ఎదురుదాడి చేస్తున్నారు. ఉదయం 11 గంటలకు ఉభయసభలు ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు అదానీ అంశంపై జేపీసీ కోసం పట్టుబట్టారు.

ఆ వెంటనే అధికారపక్షం ఎంపీలు కూడా రోజులాగే రాహుల్‌గాంధీ అంశాన్ని లేవనెత్తారు. రాహుల్‌గాంధీ క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్‌తో ఎదురుదాడికి దిగారు. దాంతో అటు రాజ్యసభలో, ఇటు లోక్‌సభలో గందరగోళం చెలరేగింది. ఇరువర్గాల సభ్యులు పోటాపోటీ నినాదాలతో సభలను హోరెత్తించారు. లోక్‌సభలో స్పీకర్‌ ఓమ్‌ ‌బిర్లా, రాజ్యసభలో చైర్మన్‌ ‌జగదీప్‌ ‌ధన్‌కర్‌ ఆం‌దోళన చేస్తున్న సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు. దాంతో ముందుగా ఉభయసభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదాపడ్డాయి. ఒంటిగంటకు లోక్‌సభ స్పీకర్‌, ‌రాజ్యసభ చైర్మన్‌ ‌వేర్వేరుగా ఆల్‌పార్టీ వి•టింగ్‌ ఏర్పాటు చేసి మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. మధ్యాహ్నం రెండు గంటలకు ఉభయసభలు తిరిగి ప్రారంభమైనా సేమ్‌ ‌సీన్‌ ‌రిపీట్‌ అయ్యేసరికి ఉభయ సభలు గురువారానికి వాయిదా వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page